logo

సేవా సంకల్పం.. చైతన్యమే లక్ష్యం

బెల్లంపల్లి పాలిటెక్నిక్‌ కళాశాల 1993లో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగూడెం, బెల్లంపల్లిలో మాత్రమే మైనింగ్‌ కోర్సులు ఉన్నాయి. మైనింగ్‌ కోర్సు పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులకు ఓ వరంలా మారింది.

Updated : 24 Mar 2023 06:26 IST

బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల

బెల్లంపల్లి పట్టణం, న్యూస్‌టుడే: బెల్లంపల్లి పాలిటెక్నిక్‌ కళాశాల 1993లో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగూడెం, బెల్లంపల్లిలో మాత్రమే మైనింగ్‌ కోర్సులు ఉన్నాయి. మైనింగ్‌ కోర్సు పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులకు ఓ వరంలా మారింది. 1996 నుంచి ఇప్పటివరకు 1010 మంది మైనింగ్‌ విద్య అభ్యసించారు. ఇందులో 500కు పైగా విద్యార్థులు 2016 సంవత్సరం వరకు  మైనింగ్‌తో పాటు ఇతర విభాగాల్లో ఉద్యోగాలు సాధించారు. పది మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నారు. ఈ కళాశాలలో 27 బ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థులు కళాశాలను మరిచిపోకుండా ఇప్పటికీ సహకారం అందిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. సింగరేణి, నైవేలీ, కోల్‌ఇండియా, డీజీఎంఎస్‌, సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పేద విద్యార్థులకు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. సేవాభావంతో ముందుకుపోతున్న పాలిటెక్నిక్‌ కళాశాల, పూర్వ విద్యార్థుల సేవా కార్యక్రమాలపై కథనం.


నైవేలీలో అసిస్టెంట్‌ చీఫ్‌ మేనేజర్‌గా

వేల్పుల రాజ్‌కుమార్‌ బెల్లంపల్లి పాలిటెక్నిక్‌ కళాశాలలోనే మైనింగ్‌ డిప్లొమా పూర్తి చేశారు. తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌లో అడిషనల్‌ చీఫ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. 20 ఏళ్ల నుంచి చేస్తున్న సేవలకు గాను ఫిబ్రవరి 28, 2022లో అసోం గవర్నర్‌ జగదీష్‌ ముఖీ చేతుల మీదుగా గౌహతిలో అక్యుపేషనల్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ పురస్కారం అందుకున్నారు. కరోనా సమయంలో ఐదుగురు విద్యార్థులకు చరవాణులు అందజేసి సాంకేతిక విద్యకు సహకారం అందించారు. కళాశాలలో ఏ కార్యక్రమం జరిగినా తన వంతు చేయూత అందిస్తున్నారు.


సేవలో ముందుంటున్న వేణుగోపాలస్వామి

వేణుగోపాలస్వామి 1996లో మైనింగ్‌ డిప్లొమాను బెల్లంపల్లిలో పూర్తి చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్‌ సేఫ్టీలో పనిచేస్తున్నారు. 2013లో  డీజీఎంస్‌లో ఉద్యోగం సాధించారు. అప్పటినుంచి కళాశాలలో ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతుంటారు. విద్యార్థులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అఖిల్‌ అనే విద్యార్థి డిప్లొమా పూర్తి చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఇతన్ని వేణుగోపాలస్వామి ప్రభుత్వ ఫీజులు పోనూ మిగిలిన డబ్బులు చెల్లిస్తూ చదివిస్తున్నారు.


ఇక్కడే చదివి.. ఇక్కడే బోధిస్తూ

జగిత్యాల జిల్లాకు చెందిన పి.రాజమల్లు బెల్లంపల్లి పాలిటెక్నిక్‌ కళాశాలలో 2007లో మైనింగ్‌ డిప్లొమా పూర్తి చేశారు. మైనింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎంటెక్‌ పూర్తి చేసి ఇక్కడే అధ్యాపకుడిగా ఎంపికయ్యారు. 2013లో ఉద్యోగం సాధించి మైనింగ్‌ అధ్యాపకుడిగా కొనసాగుతున్నారు. చదువుకున్న కళాశాలలోనే మైనింగ్‌ విభాగంలోనే బోధన చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.


విద్యార్థులకు గైడెన్స్‌ అందిస్తున్న రమేష్‌

బెల్లంపల్లి మండలం చిన్నబూద గ్రామానికి చెందిన చీకటి రమేష్‌ మైనింగ్‌ డిప్లొమో 2002లో పూర్తి చేశారు. రమేష్‌ ప్రస్తుతం మందమర్రి ఏరియాలోని కేకే-1 రక్షణాధికారిగా పనిచేస్తున్నారు. పాలిటెక్నిక్‌ కళాశాల బోర్డు సభ్యుడిగా ఉన్నారు. కెరీర్‌ కమిటీలోనూ సభ్యుడిగా కొనసాగుతున్నారు. విద్యార్థులకు అవసరమైనప్పుడు కళాశాలకు వచ్చి సలహాలు, సూచనలు అందజేస్తుంటారు. మైనింగ్‌కు సంబంధించిన అంశాలు చెబుతుంటారు.


అమ్మాయిలు మైనింగ్‌ కోర్సుల్లో చేరారు
- దేవేందర్‌, మైనింగ్‌ విభాగం అధిపతి

బెల్లంపల్లి కళాశాలలో 2021 సంవత్సరం నుంచి  మైనింగ్‌ కోర్సులో ప్రవేశానికి అమ్మాయిలకు అవకాశం కల్పించారు.  ప్రస్తుతం 24 మంది అమ్మాయిలు చదువుతున్నారు. ఇప్పటికే శాంతిఖని భూగర్భ గనిలోకి  ఎంతో సాహసంతో వెళ్లి బొగ్గు వెలికితీస్తున్న తీరును పరిశీలించారు. ఇక్కడ చదివిన మైనింగ్‌ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉండడం సంతోషంగా ఉంది. 10 మంది వరకు ఉన్నత స్థానాల్లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని