logo

చదరంగంలో ‘ఆకాశ’మంతా

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నారు. అన్ని రంగాల్లోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు.

Updated : 24 Mar 2023 06:30 IST

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌నకు ఎంపిక

ఆకాశ్‌ను అభినందిస్తున్న ప్రిన్సిపల్‌ సంతోష్‌కుమార్‌

బెల్లంపల్లి పట్టణం, న్యూస్‌టుడే: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నారు. అన్ని రంగాల్లోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. బెల్లంపల్లిలో నిర్వహిస్తున్న కాసిపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థి ఐరొండ్ల ఆకాశ్‌కుమార్‌ ప్రపంచ చదరంగం ఛాంపియన్‌షిప్‌నకు ఎంపికయ్యాడు. తాండూరు మండలం రేపల్లెవాడ గ్రామానికి చెందిన ఐరొండ్ల సమయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు ఆకాశ్‌కుమార్‌. చిన్నతనం నుంచి చదరంగమంటే అమితాసక్తి. తల్లిదండ్రులు కుమారుడిని ప్రోత్సహించారు. ఆకాశ్‌కుమార్‌ గురుకులంలో ఐదో తరగతిలో సీటు దక్కించుకున్నారు. పదో తరగతి చదువుతున్న ఇతను గత ఏడాది డిసెంబరులో శ్రీలంకలో నిర్వహించిన 16వ ఏషియన్‌ చదరంగం ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు. వెండి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. శ్రీలంక ప్రధానమంత్రి దినేష్‌ గుణవర్ధనే చేతుల మీదుగా వెండి పతకాన్ని అందుకున్నాడు. వచ్చే నెల 13వ తేదీ నుంచి 23 వరకు గ్రీస్‌ దేశంలో నిర్వహించే అండర్‌-17 విభాగం ప్రపంచ పాఠశాల చదరంగం పోటీల్లో భారత్‌ తరఫున ఆడనున్నాడు. పదోతరగతి పరీక్షలు సమీపంలో ఉన్నప్పటికీ ప్రిన్సిపల్‌ ఊటూరి సంతోష్‌కుమార్‌, పీడీ ప్రవీణ్‌, పీఈటీ సంతోష్‌ ప్రత్యేక చొరవ చూపిస్తూ చదరంగంలో సాధనకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఆకాశ్‌కు హైదరాబాద్‌లో శిక్షణ కేంద్రంలో ప్రత్యేక శిక్షణను గురుకులాల సంస్థ అందిస్తోంది. ఎలాగైనా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సాధించాలనే లక్ష్యంతో సాధన కొనసాగిస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని