logo

మినీ బ్యాంకులుగా.. రేషన్‌ దుకాణాలు!

‘కమీషన్‌ డబ్బులు సకాలంలో రావు.. ఇచ్చేవి సరిపోవడం లేదు.. కనీస వేతనాలు చెల్లించాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి..’ ఇలాంటి డిమాండ్లతో రేషన్‌ డీలర్లు తరచూ ఆందోళనలు చేపడుతూనే ఉంటారు.

Updated : 24 Mar 2023 06:27 IST

ప్రారంభానికి కసరత్తు..

వేలిముద్రలు సేకరిస్తున్న డీలరు (పాతచిత్రం)

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే : ‘కమీషన్‌ డబ్బులు సకాలంలో రావు.. ఇచ్చేవి సరిపోవడం లేదు.. కనీస వేతనాలు చెల్లించాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి..’ ఇలాంటి డిమాండ్లతో రేషన్‌ డీలర్లు తరచూ ఆందోళనలు చేపడుతూనే ఉంటారు. వీటికి పూర్తిస్థాయిలో కాకపోయినా ఎంతోకొంత ఆదాయమార్గం చూపేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే రేషన్‌ దుకాణాలను మినీ బ్యాంకులుగా మార్చాలని నిర్ణయించారు. ఆ దిశగా కసరత్తు మొదలెట్టారు.

తపాలా శాఖ సహకారంతో..

తపాలా శాఖ వారి ఐపీపీబీ (ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు) సహకారంతో రేషన్‌ దుకాణాల్లో పౌర సేవలను విస్తరించాలని నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో మినహాయిస్తే.. బ్యాంకింగ్‌ సేవలు అంతగా అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఉపయోగపడుతుంది. వినియోగదారులు తమ విద్యుత్తు, నల్ల, ఫోన్‌ తదితర బిల్లులను ఇక్కడ్నుంచే చెల్లించవచ్చు. నగదు, డిజిటల్‌ లావాదేవీలు కొనసాగించవచ్చు. దీనివల్ల ప్రజలకు బ్యాంకింగ్‌, డిజిటల్‌ సేవలు మరింత సులభంగా, సౌకర్యవంతంగా మారతాయి. 0-10 సంవత్సరాల్లోపు వారికి ఇక్కడ నుంచే ఆధార్‌ కార్డు జారీ చేయొచ్చు. ఉపాధిహామీ కూలీ డబ్బులు, ఆసరా పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది.

యాప్‌ సాయంతో..

రేషన్‌ డీలర్ల చరవాణిలో స్మార్ట్‌ఫోన్‌లో ఐపీపీబీ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తారు. ప్రత్యేకంగా డిజిటల్‌ ఖాతా తెరవాలి. దీనిద్వారా రూ.10 వేల వరకు నగదు, డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించొచ్చు. స్మార్ట్‌ఫోన్‌, అంతర్జాల వినియోగంపై అవగాహన ఉన్నవారికే ఇందులో అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం మండలాల వారీగా డీలర్లకు ముందస్తు అవగాహన కల్పిస్తారు. ఆపై ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తులు పరిశీలించి, అనుమతి పొందిన వారికి ఎలాంటి డిపాజిట్‌ లేకుండానే ప్రతినిధిగా నియమించనున్నారు. ఆ తర్వాత వచ్చే వారికి రూ.5 వేలు డిపాజిట్‌గా స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. వీరిని బ్యాంకు మిత్రగా పేర్కొనే అవకాశముంది.

కమీషన్‌ పద్ధతిలో..

లావాదేవీలు విస్తరిస్తే తదనుగుణంగా డీలర్లకు కమీషన్‌ విధానంలో అదనపు ఆదాయం సమకూరనుంది. ప్రతి లావాదేవీకి రూ.4 చొప్పున, నెలలో రూ.5 లక్షలు దాటితే మరో రూ.11 చొప్పున చెల్లించనున్నారు. ప్రతి నెలా పక్షం రోజులపాటు రేషన్‌ సరకులు పంపిణీ జరుగుతుంది. ఆ తర్వాత డీలర్లు ఖాళీగానే ఉంటారు. ఈ సమయాన్ని డిజిటల్‌ లావాదేవీలకు వినియోగించడం వల్ల సమయం కలిసొస్తుంది. ఆదాయమూ సమకూరుతుంది. మారుమూల ప్రాంతాలు, గ్రామాల్లో ఉన్నవారు బ్యాంకింగ్‌ సేవల కోసం పట్టణాలకు వెళ్లాల్సిన అవసరమూ ఉండదు.

మొదలైన దరఖాస్తుల ప్రక్రియ..

ఆసక్తి ఉన్న డీలర్లు తమ ఆధార్‌, పాన్‌కార్డు, నివాసం, ఆదాయ ధ్రువపత్రాలతోపాటు ఎలాంటి నేర చరిత్ర లేదని రూఢీ చేసేలా పోలీసు శాఖ నుంచి ఎన్‌ఓసీ పొందాలి. వీటన్నింటి ఆధారంగా మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించాలి. వాటిని పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు అనుమతి జారీచేస్తారు. ఇప్పటికే పలువురు డీలర్లు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని