logo

గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేద్దాం

ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడపగడపకు తీసుకెళ్లాలి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్ష పార్టీల నేతల ఆగడాలను తిప్పికొట్టాలి..

Published : 24 Mar 2023 03:20 IST

భారాస ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

అభివాదం చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, చిత్రంలో పార్టీ జిల్లా  ఇన్‌ఛార్జి గంగాధర్‌గౌడ్‌, ఎమ్మెల్సీ దండె విఠల్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, తదితరుల

నిర్మల్‌-నర్సాపూర్‌(జి), న్యూస్‌టుడే: ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడపగడపకు తీసుకెళ్లాలి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్ష పార్టీల నేతల ఆగడాలను తిప్పికొట్టాలి.. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఉంటూ సమన్వయంతో పనిచేయాలి.. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకెళ్దామని భారాస నేతలు తమ ప్రసంగాల ద్వారా పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, భాజపా నేతలు ఏం చేశారో ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతూనే ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన వారిందరికీ ఏకం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు. ఎన్నికలే లక్ష్యంగా సాగిన నేతల ప్రసంగాలతో భారాస శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. భారాస కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకోవడంతోపాటు పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఆత్మీయ సమ్మేళనాల సమావేశాలకు శ్రీకారం చుట్టారు. గురువారం తొలి భారాస ఆత్మీయ సమ్మేళనం నిర్మల్‌ నియోజకవర్గంలోని నర్సాపూర్‌(జి)లో నిర్వహించారు. తొలుత మండల కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా సభా ప్రాంగణం ఎదుట పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీకి 50 వేల సభ్యత్వం ఉందని చెబుతూనే మన సైన్యం మరింత పటిష్ఠంగా తయారు కావాలన్నారు. మనమంతా కేసీఆర్‌ కుటుంబ సభ్యులమని, ప్రతిపక్ష పార్టీ నాయకుల మాయమాటలు నమ్మిపోసపోవద్దని చెప్పారు. అధికారంలో మనమే ఉన్నాం.. అభివృద్ధి మనతోనే సాధ్యమవుతుందని, ఏం కావాలో అడగండి.. చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం కోసం కార్యకర్తల అభిప్రాయాలు, మనోభావాలు తెలుసుకునేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాకు వైద్య కళాశాల తీసుకొచ్చామని, 450 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసుకున్నామని గుర్తుచేశారు. పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి వి.గంగాధర్‌గౌడ్‌ మాట్లాడుతూ ఎన్నికలకు ఇప్పటి నుంచి సమాయత్తం కావాలని సూచించారు. ఇంటింటా వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించాలన్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి సమానంగా తీసుకెళ్తున్నారన్నారు. భాజపా నాయకులు గ్రామాల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని నిలదీయాలని సూచించారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రెడ్డిలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ మంత్రి జిల్లాలో చేపట్టిన ప్రగతిని వివరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, డీసీసీబీ వైస్‌ఛైర్మన్‌ రఘునందన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్ల వెంకట్రాంరెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ ఛైర్మన్‌ ధర్మాజిగారి రాజేందర్‌, పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, అల్లోల సురేందర్‌రెడ్డి, యువ నాయకుడు అల్లోల గౌతంరెడ్డి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ చిలుక రమణ, తెరాస జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు నజీరొద్దీన్‌, స్థానిక జడ్పీటీసీ సభ్యుడు అరుగుమీది రామయ్య, ఎంపీపీ రేఖ, సర్పంచి ఎ.రాంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు గంగారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, గ్రామ, మండల కమిటీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని