logo

జర పైలం.. దిగజారుతున్న జలం

జిల్లాలో భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసంలో నిలకడగా ఉండి, ఈ నెలలో రెండు మీటర్లకుపైగా దిగజారిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Published : 24 Mar 2023 03:20 IST

నెల రోజుల్లో 1.90 మీటర్లు తగ్గిన భూగర్భ నీటిమట్టం

నిర్మల్‌, న్యూస్‌టుడే: జిల్లాలో భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసంలో నిలకడగా ఉండి, ఈ నెలలో రెండు మీటర్లకుపైగా దిగజారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఏర్పాటుచేసిన 42 ఫిజోమీటర్ల ద్వారా నీటి లెక్కింపు చేసి నివేదిక విడుదల చేశారు. అత్యధికంగా ఆరు మండలాల్లో జలం పడిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. నీటిని పొదుపు చేయకుండా అవసరానికి మంచి నీటిని వాడటంతో భూగర్భం విచ్ఛిత్తికి గురవుతోంది. నిరంతర విద్యుత్తు సరఫరాతో మోటార్ల ద్వారా ఎక్కువ నీటిని వినియోగిస్తుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా  నీటి మట్టం పడిపోవడం ప్రమాద సంకేతాన్ని సూచిస్తోంది.

నీటి సంరక్షణ కోసం చర్యలు చేపట్టకపోవడంతో రోజురోజుకు భూగర్భజల మట్టం పడిపోతుంది. ఫలితంగా తాగు, సాగునీటి కోసం ఇక్కట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది జనవరి నెలాఖరునకు జిల్లాలో సగటున 6.50 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉండగా.. ఫిబ్రవరి నెలాఖరునకు 8.40 మీటర్లకు పడిపోయింది. రానున్న రోజుల్లో భూగర్భజలం మరింత పాతాళానికి చేరుకునే ప్రమాదం నెలకొంది.

పంటలపైనా ప్రభావం...

ఓవైపు నిరంతర విద్యుత్తు సరఫరా.. మరోవైపు వాగులు, ఒర్రెల, నదుల నుంచి నిరంతరంగా ఇసుక తవ్వకాలు చేపట్టడంతో భూగర్భజలం కిందకు దిగజారిపోతుండటం ప్రమాదాన్ని సూచిస్తోంది. భూగర్భజలం పడిపోతుండటంతో వాటి పరివాహక ప్రాంతాల్లోని బోర్లలో నీరు రాకపోవడం పంటలపై ప్రభావం చూపుతోంది. జిల్లాలో 95 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 92 వేల ఎకరాల్లో వరి, 12 వేల ఎకరాల్లో నువ్వులు, మరో 30 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 50 వేల ఎకరాలకుపైగా పంటలు బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్నారు. నిరంతరంగా విద్యుత్తు సరఫరా చేస్తుండటంతో చాలా ప్రాంతాల్లో అన్నదాతలు పంటలకు నీరు అవసరం లేకున్నా పంపుసెట్లను నడిపిస్తున్నారు. అవసరం మేరకు సాగునీటి వాడుకునే విషయంలో అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తే కొంతవరకైనా మేలు జరుగుతుంది.

30శాతం నీరు ఆవిరే..

వేసవి ఆరంభంలోనే నీటి కష్టాలు మొదలవుతున్నాయి. గతేడాది పుష్కలంగా వర్షాలు కురియడంతో పంటల సాగు విస్తారంగా జరుగుతోంది. యాసంగి సీజన్‌లోనూ వరి పంటలు సాగు చేస్తుండటంతో బోర్ల ద్వారా నీటి వాడకం ఎక్కువ అవుతోంది. మండుతున్న ఎండల కారణంగా ఆవిరి రూపంలో 30 శాతం నీరు కనుమరుగవుతోందని భూగర్భజలశాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌ నెలాఖరులో, మే నెలలో జిల్లాలో భూగర్భ జలమట్టం 12 నుంచి 14 మీటర్లకు పడిపోయే ప్రమాదం ఉందని భూగర్భజల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.


కొత్తగా బోరుబావులు తవ్వించొద్దు
-శ్రీనివాసబాబు, ఉప సంచాలకుడు, భూగర్భజలశాఖ, నిర్మల్‌

జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకు పడిపోతూనే ఉన్నాయి. తాగునీటికి అత్యవసరం అనుకుంటే మినహా బోరుబావి తవ్వించొద్దు. భూగర్భంలోని నీటి పొరల్లో నీటి లభ్యత తగ్గిపోవడంతోనే బోరుబావుల ద్వారా నీరు రావడం నిలిచిపోతుంది. రైతులు తమ పంటపొలాల్లో నీటి నిల్వ కోసం గుంతలు తవ్వుకుంటే వర్షాకాంలో నీరు నిలిచి భూగర్భజలాలు వృద్ధి చెంది సాగునీటికి ఇబ్బందులు ఏర్పడవు.  

* జిల్లాలో జనవరి నెలాఖరుకు భూగర్భజలాలు (మీటర్లలో) : 6.50

* ఫిబ్రవరి నెలాఖరుకు వరకు :8.40

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని