logo

నిర్లక్ష్యంతో వెనకబడి

ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించి బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన మన ఊరు - మన బడి పథకం జిల్లాలో నత్తనడకన కొనసాగుతోంది.

Published : 24 Mar 2023 03:20 IST

మంచిర్యాల గ్రామీణం, న్యూస్‌టుడే

ఈ చిత్రం చెన్నూరు నియోజకవర్గంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల. మన ఊరు - మన బడి పథకం కింద చేర్చి నిధులు మంజూరు చేశారు. తాగునీటి వసతి, మరుగుదొడ్లు, కుర్చీలు, బెంచీలు వంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు శిథిలావస్థకు చేరిన గదిని కూల్చివేసి నూతన భవనం నిర్మించాల్సి ఉంది. కానీ ఇంతవరకు పనులు పూర్తిచేయడం లేదు. మరుగుదొడ్డి పనులు ప్రారంభించి మధ్యలోనే వదిలేశారు. శిథిలమైన భవనాన్ని కూల్చే పనులు ఇటీవలే చేపట్టారు. సెలవు దినాల్లో పనులు చేయాల్సి ఉండగా ఓ వైపు పాఠశాల కొనసాగుతుండగానే మరో వైపు పనులు చేస్తున్నారు. దీంతో బోధనకు ఆటంకం ఏర్పడుతోంది. మధ్యాహ్న భోజనం వండేందుకు, విద్యార్థులు భోజనం చేసే సమయంలో భయాందోళనకు గురవుతున్నారు.


ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించి బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన మన ఊరు - మన బడి పథకం జిల్లాలో నత్తనడకన కొనసాగుతోంది. మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తిచేయాలని పాలనాధికారి కచ్చితమైన ఆదేశాలు జారీచేసినప్పటికీ పలు ప్రాంతాల్లో నేటికీ పనులు ప్రారంభించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పనుల్లో వేగవంతం చేయాలని ఒత్తిడి తెస్తుండడంతో నాణ్యత లోపిస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనులు చేయాల్సి ఉండగా అనేక పాఠశాలల్లో పనులు ప్రారంభం చేయలేదు. గడువు దగ్గర పడుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.


జాప్యంతో ఇబ్బందులు..

జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో చేపట్టిన మన ఊరు- మన బడి పనుల్లో చేస్తున్న జాప్యంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మరుగుదొడ్లు, కిచెన్‌షెడ్ల నిర్మాణాలు, ప్రహరీలు, అదనపు తరగతి గదుల నిర్మాణం పనుల్లో ఆలస్యమవుతుంది. కొన్ని చోట్ల గుత్తేదారులు, మరికొన్ని ప్రాంతాల్లో ఇసుక కొరత కారణంగా ఆలస్యమవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పనులు చేసే క్రమంలోనూ పలు పాఠశాలల్లో బోధనకు, మధ్యాహ్న భోజన నిర్వహణకు తీవ్ర ఆటంకమేర్పడుతుంది. ఈ ఆర్థిక ఏడాది పనులు పూర్తిచేసిన పక్షంలో మరికొన్ని పాఠశాలలను రెండో విడతలో ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు సమాచారం.


ఈ చిత్రం హాజీపూర్‌ మండలం ముల్కల్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోనిది. మన ఊరు మన బడి పథకం కింద పనులు చేసేందుకు రూ.64 లక్షల మేరకు నిధులు కేటాయించారు. పనులు ప్రారంభించిన నాటి నుంచి నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఇందులో రెండు అదనపు తరగతి గదులు, ప్రహరీ, మరుగుదొడ్లు, వంటగది, డైనింగ్‌ గదులు, సంపు నిర్మాణం చేయాలి. కుర్చీలు, బెంచీలు, ఇతర మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఇంతవరకు గదుల నిర్మాణం 70 శాతం పనులు కాగా డైనింగ్‌ గది రూఫ్‌లెవల్‌ వరకు చేశారు. వైరింగ్‌, వంట గదులు, సంపుల నిర్మాణం పనుల్లో జాప్యమేర్పడుతుంది. మరుగుదొడ్ల నిర్మాణం పనులు పూర్తికాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని