logo

అలా తీసుకొని.. ఇలా అమ్మేస్తున్నారు..

మంచిర్యాలలోని ఓ రేషన్‌ దుకాణం ఎదుట లబ్ధిదారులు బియ్యం తీసుకుని అక్కడే దళారులకు అమ్ముకుంటున్నారు. రేషన్‌ కార్డులో ఒక్కో లబ్ధిదారునికి ప్రస్తుతం ప్రభుత్వం 5 కిలోల చొప్పున నలుగురు ఉంటే 20 కిలోలు ఇస్తున్నారు.

Published : 24 Mar 2023 03:20 IST

చౌకధరల దుకాణాల ఎదుటే దళారుల కొనుగోలు
మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే

మంచిర్యాలలోని ఓ రేషన్‌ దుకాణం ఎదుట లబ్ధిదారులు బియ్యం తీసుకుని అక్కడే దళారులకు అమ్ముకుంటున్నారు. రేషన్‌ కార్డులో ఒక్కో లబ్ధిదారునికి ప్రస్తుతం ప్రభుత్వం 5 కిలోల చొప్పున నలుగురు ఉంటే 20 కిలోలు ఇస్తున్నారు. ఆ బియ్యం తీసుకున్న లబ్ధిదారుడు చౌకధరల దుకాణం వద్ద సిద్ధంగా ఉన్న దళారులకు కిలోకు రూ.12 చొప్పున అమ్ముతున్నారు. ఆ దళారీ బియ్యం కొనుగోలు చేసి ఇలా ఆటోలో తీసుకొస్తున్నారు.


జిల్లాలో రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఇప్పటివరకు లబ్ధిదారులు రేషన్‌ బియ్యం తీసుకుని ఇంటికి వెళ్లిన తర్వాత దళారులకు అమ్ముకునే వారు. ఆ బియ్యాన్ని వారు మహారాష్ట్రకు తరలించి అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. తాజాగా రేషన్‌ దుకాణాలు తెరిసే సరికే దళారులు అక్కడ సిద్ధంగా ఉంటున్నారు. లబ్ధిదారులు తీసుకున్న వెంటనే అక్కడే దళారులకు అమ్ముతున్నారు. ఇంకొన్నిచోట్ల ఆ బియ్యాన్ని డీలర్లే కొని లబ్ధిదారులకు ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో పౌరసరఫరాల శాఖ అస్తవ్యస్తంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేక రేషన్‌ బియ్యం బహిరంగంగా పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వం ప్రతి నెల మండల గిడ్డంగుల నుంచి రేషన్‌ దుకాణాలకు పంపించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. వీటిని ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీలోపు ఒక్క రూపాయికి కిలో చొప్పున లబ్ధిదారులకు డీలర్లు పంపిణీ చేయాలి. గత కొన్ని నెలలుగా బియ్యం ఆలస్యంగా సరఫరా చేయడంతో ప్రతి నెల గడువు పొడిగిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు రేషన్‌ డీలర్లు దళారులకు అండగా నిలుస్తున్నారు. లబ్ధిదారులు కొనుగోలు చేసిన బియ్యం ఆ దుకాణం ముందే దళారులకు రూ.12కి కిలో చొప్పున అమ్ముతున్నారు. కొందరు డీలర్లు ఇప్పుడు అక్రమ బియ్యం దందా చేస్తున్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన రేషన్‌ బియ్యానికి బదులు, డీలర్లే రూ.8 కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఆ డబ్బులను లబ్ధిదారులకు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లిస్తున్నారు. మరికొందరు బియ్యంకు బదులు నిత్యావసర సరకులు ఇస్తున్నారు. ఆ బియ్యాన్ని డీలర్లు మళ్లీ దళారులకు రూ.15కు కిలో చొప్పున అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి. తూకం వేసిన తర్వాతనే వేలిముద్ర వేస్తే ఈ-పాస్‌ యత్రం నుంచి రశీదు వస్తుంది. డీలర్లు బియ్యంతో తూకం వేయకుండా బాట్ల బరువు పెట్టి వేలిముద్రలు తీసుకుంటున్నారు. డీలర్లకు ప్రభుత్వం ఇచ్చే కమీషన్‌ కంటే, బియ్యం అక్రమ దందాతో ఆదాయం పెంచుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


మంచిర్యాలలో మరికొంతమంది దళారులు రేషన్‌ దుకాణాల ముందు కొనుగోలు చేసిన బియ్యం ద్విచక్ర వాహనాలపై ఓ రహస్య స్థలానికి తరలిస్తున్నారు. ఎక్కువబియ్యం ఒకేసారి తీసుకెళ్తే అధికారులు పట్టుకుంటారనే ఉద్దేశంలో ఇలా రెండు మూడు బస్తాలు తరలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని