logo

భరోసా కల్పిస్తూ.. ఉత్తేజం నింపుతూ

జిల్లాలోని కెరమెరి మండలంలో గురువారం సీఎల్పీ నేత భట్టివిక్రమార్క నిర్వహిస్తున్న హాథ్‌ సే హాథ్‌ జోడో 8వ రోజు పాదయాత్ర.. ప్రజల్లో భరోసా కల్పిస్తూ పార్టీ  శ్రేణుల్లో ఉత్తేజం కలిగించేలా సాగింది.

Published : 24 Mar 2023 03:31 IST

8వ రోజుకు చేరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర

భగత్‌సింగ్‌ చిత్రపటం వద్ద వందనం సమర్పిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే : జిల్లాలోని కెరమెరి మండలంలో గురువారం సీఎల్పీ నేత భట్టివిక్రమార్క నిర్వహిస్తున్న హాథ్‌ సే హాథ్‌ జోడో 8వ రోజు పాదయాత్ర.. ప్రజల్లో భరోసా కల్పిస్తూ పార్టీ  శ్రేణుల్లో ఉత్తేజం కలిగించేలా సాగింది. మండలంలోని ఝరి గ్రామం నుంచి సాయంత్రం 6.45 గంటలకు ఆయన పాదయాత్ర మొదలు పెట్టారు. ముందుగా భగత్‌సింగ్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో పాదయాత్ర 123 కి.మీ. పూర్తి చేసుకున్న నేపథ్యంలో డీసీసీ  అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు కోకు కోసి భట్టికి తినిపించారు. అనంతరం పాదయాత్రను మొదలు పెట్టారు. మధ్య మధ్యలో కలిసిన స్థానికులను పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అంటూ ఆరాతీశారు. సుర్దాపూర్‌ గ్రామం చేరుకోగానే.. రోడ్డుపై నిల్చొని ఉన్న గ్రామస్థులకు అభివాదం చేసి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామ పటేల్‌ సోము, ఇతర గ్రామస్థులు మాట్లాడుతూ.. తమ గ్రామం ఏజెన్సీదని, ఏళ్ల తరబడి భూములు సాగు చేసుకుంటున్నామని, పాత బందోబస్తు పట్టాలు ఉన్నా.. లావణి పట్టాలు ఇచ్చారని పేర్కొన్నారు. తద్వారా ఇవి ధరణిలో చూపడం లేదని చెప్పారు. కొత్త పట్టాలు ఇవ్వడంలేదని వాపోయారు. ట్యాంకులు నిర్మించినా పైప్‌లైన్లు వేయక తాగునీరు రావడంలేదని చెప్పారు. రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చారా? రుణమాఫీ చేశారా? పంట నష్ట పరిహారం ఇచ్చారా? పోడు పట్టాలు పంపిణీ చేశారా? అంటూ భట్టి గ్రామస్థులను ప్రశ్నించారు. ఏ ఒక్కటీ తమకు అందలేదని వారు సమాధానం చెప్పారు.

సుర్దాపూర్‌లో గ్రామస్థుల సమస్యలు వింటున్న సీఎల్పీ నేత భట్టి

90 శాతం హామీలు అమలు చేయలే

ఏ ఆశయంతో పోరాడి తెలంగాణ సాధించుకున్నామో.. అవేమీ జరగడంలేదని భట్టి పేర్కొన్నారు. ఇచ్చిన హామీల్లో 90 శాతం ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో క్షేత్ర స్థాయిలో తెలుసుకునే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. తద్వారా ప్రజల సమస్యలు తెలుస్తున్నాయన్నారు. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ దోపిడీకి చరమగీతం పాడాలన్నారు. సంపదంతా సీఎం కుటుంబానికే చేరుతుందని.. ప్రజలు గమనించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. సుమారు ఏడు కి.మీ. వరకు పాదయాత్ర చేపట్టి రాంజీగూడ ఆర్‌ఆర్‌ కాలనీలో బసకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి మర్సుకోల సరస్వతి, సభ్యుడు డా.గణేష్‌ రాఠోడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని