logo

ఆదిలాబాద్‌కు అరుణశోభ..

చేతిలో ఎర్రజెండాలు, ఒంటిపై ఎర్ర చొక్కాలు, ప్రజా నాట్య మండలి పాటలు.. శ్రేణుల కోరస్‌... పట్టణమంతా ఫ్లెక్సీలు వెరసి ఆదిలాబాద్‌ పట్టణం ఎరుపెక్కింది.

Published : 24 Mar 2023 03:31 IST

సీపీఎం శ్రేణుల ద్విచక్రవాహన ర్యాలీ
కాంగ్రెస్‌, భారాస, సీపీఐ సంఘీభావం

వేదికపై ప్రసంగిస్తున్న బీవీ రాఘవులు, వివిధ పార్టీల నాయకులు

ఈటీవీ - ఆదిలాబాద్‌: చేతిలో ఎర్రజెండాలు, ఒంటిపై ఎర్ర చొక్కాలు, ప్రజా నాట్య మండలి పాటలు.. శ్రేణుల కోరస్‌... పట్టణమంతా ఫ్లెక్సీలు వెరసి ఆదిలాబాద్‌ పట్టణం ఎరుపెక్కింది. ప్రధాన వీధుల మీదుగా నిర్వహించిన భారీ ద్విచక్రవాహన ర్యాలీలో సీపీఎం కార్యకర్తలు చేసిన నినాదాలతో పట్టణం మార్మోగింది. దేశవ్యాప్తంగా సీపీఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్రల్లో ఒకటి గురువారం ఆదిలాబాద్‌లో ప్రారంభమైంది. మూడురోజులపాటు ఉమ్మడి జిల్లాలో కొనసాగనున్న ఈ యాత్రను ఆ పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రారంభించగా.. అంతకుముందు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద బహిరంగ సభ జరిగింది. కాంగ్రెస్‌, భారాస, సీపీఐ నేతలు సంఘీభావం ప్రకటించారు. భాజపా అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఎండగట్టారు. ఆదిలాబాద్‌లోని సిమెంటు పరిశ్రమ మూత, ఆర్మూర్‌-రైల్వేలైన్‌పై నిర్లక్ష్యం, పత్తి పరిశ్రమల మూత, అంగన్‌వాడీ, ఒప్పంద కార్మికుల ఉద్యోగ భద్రతలేకపోవడం, బీడీ కార్మికుల దైన్యస్థితి, నిత్యావసర సరకుల ధరలు, మోదీ తీసుకొస్తానన్న నల్ల ధనం, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన ఏది అని ప్రశ్నించారు. మానవ ధర్మమా? మను ధర్మమా? తేల్చుకోవాలనే అంశాలను తమ ఉపన్యాసాల్లో సీపీఎం నేతల ప్రస్తావించడంతో సభికుల నుంచి సానుకూల స్పందన లభించింది. సీపీఎం రాష్ట్ర, జిల్లా నేతలు రవికుమార్‌, విజయలక్ష్మి, లంకా రాఘవులు, బండి దత్తాత్రి, పూసం సచిన్‌, అన్నమొల్ల కిరణ్‌, కె.సునీత, బొజ్జ ఆశన్న, జమున, రెంజర్ల ప్రవీణ్‌, బైరి సోమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో ద్విచక్ర వాహన ర్యాలీలో బీవీ రాఘవులు


పేదల పార్టీ సీపీఎం
రాఠోడ్‌ బాపురావు ఎమ్మెల్యే, అడ్డి భోజారెడ్డి డీసీసీబీ ఛైర్మన్‌

అధికారంలో ఏపార్టీ ఉన్నా పేదల తరఫున నిలిచేవి ఎర్రజెండా పార్టీలే. సమస్యలు  ఉత్పన్నమైన ప్రతిసారి  ఎర్రజెండా పార్టీలే గుర్తుకొస్తాయి. ఆ పార్టీల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకల్పన జరిగింది. ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా పాలన సాగుతోంది. వామపక్షాలు చేపట్టే కార్యక్రమాలకు భారాస తరఫున మున్ముందు కూడా పూర్తిగా మద్దతు కొనసాగిస్తాం.


ఎంపీ మోసం చేశారు
వీరయ్య, జన చైతన్య యాత్ర నాయకుడు

కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉంది. ఆ పార్టీ అభ్యర్థి సోయం బాపురావునే ఎంపీగా గెలిపించినా ఆదిలాబాద్‌ జిల్లా ఎందుకు అభివృద్ధి కాలేదు. ఆర్మూర్‌ - రైల్వే లైన్‌, గిరిజన విశ్వవిద్యాలయం, విమానాశ్రయం ఎందుకు రాలేదు. భాజపా డబుల్‌ ఇంజిన్‌ సర్కారంటే ఇదేనా. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చనందుకు సోయం బాపురావు క్షమాపణలు కోరుతూ భాజపా నుంచి బయటకు వస్తే స్వాగతిస్తాం. మతం, కులం పేరిట విభజిస్తూ ప్రజల్లో ధ్వేషభావాన్ని కలిగించడం తప్ప భాజపా చేసేదేమీ లేదు.


సంపూర్ణ మద్దతు..
గండ్రత్‌ సుజాత, సాజిద్‌ఖాన్‌

సీపీఎం చేపట్టిన జన చైతన్య యాత్రకు సంపూర్ణ మద్దతు ఉంటుంది. రాష్ట్రంలోనూ ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే ఏదీ పరిష్కారం కావడం లేదు. పోడు భూములు, రుణమాఫీ, నిధులు, నీళ్లు, నిధులు నియామకాల్లో అన్యాయం జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన తరుణం ఆసన్నమైంది.


నల్ల చట్టాలు వెనక్కి
ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ కార్యదర్శి

పోరాటాలతోనే ఏదైనా సాధించుకోవచ్చు. రైతులకు నష్టం చేకూర్చేలా భాజపా అమలు చేసేందుకు యత్నించిన మూడు నల్ల చట్టాలను ఉద్యమాలతోనే నియంత్రించగలిగాం. ఇదే పంథా మున్ముందు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పోరాటాలు చేయాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని