logo

భగీరథ గుంతలు.. వాహనదారుల తిప్పలు

జిల్లా కేంద్రంలో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ కోసం తవ్విన గుంతలకు మరమ్మతులు చేయకుండా అలాగే వదిలేశారు. బాగున్న బీటీ, సీసీ రోడ్లు పాడై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 24 Mar 2023 03:34 IST

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ అర్బన్‌

నేతాజీచౌక్‌లో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ కోసం తవ్వినపుడు ఏర్పడిన గుంత. ఏడాదవుతున్నా ఇప్పటిదాకా మరమ్మతు చేయక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

జిల్లా కేంద్రంలో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ కోసం తవ్విన గుంతలకు మరమ్మతులు చేయకుండా అలాగే వదిలేశారు. బాగున్న బీటీ, సీసీ రోడ్లు పాడై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులు చేయాలని స్థానిక కౌన్సిలర్ల నుంచి అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. మిషన్‌ భగీరథ పనులను ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ శాఖ చేపడుతుండటంతో మరమ్మతులను సైతం వారే చేపట్టాల్సి ఉంది. గతంలో ఈ పనులు చేపట్టిన గుత్తేదారు మరమ్మతులు చేయకుండా చేతులెత్తేశారు. రెండేళ్లుగా భగీరథ గుంతలతో పట్టణవాసులు నానా తిప్పలు పడుతున్నారు.

బాగున్న రోడ్లు చెడిపోయాయి

పట్టణంలో ప్రతి ఇంటికి శుద్ధ జలం సరఫరా చేసేందుకు ప్రభుత్వం మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పనులను పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ శాఖ పర్యవేక్షిస్తోంది. 2016లో పనులు దక్కించుకున్న గుత్తేదారు పట్టణ అంతర్గత రహదారులను తవ్వి పైప్‌లైన్‌ వేశారు. బల్దియా యంత్రాంగం పైనుంచి రోడ్లు వేశారు. పైప్‌లైన్‌ పనుల్లో సాంకేతిక లోపాలు, లీకేజీ సమస్యలు, ట్రయల్‌ రన్‌ పేరుతో బాగున్న రోడ్లను మళ్లీ తవ్వాల్సి రావడంతో ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. వాస్తవానికి గుంతలకు మరమ్మతులు చేయాల్సిన బాధ్యత గుత్తేదారుదే. రహదారులపై గుంతల కారణంగా పట్టణవాసులు ఇబ్బందులు పడుతుండడంతో గతేడాది బల్దియా యంత్రాంగం సొంత నిధులతో మరమ్మతులు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రోడ్డు కటింగ్‌ ఛార్జీలను రూ.80 లక్షలు వెచ్చించింది. ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ శాఖ వారే చేయాల్సిన పనులకు బల్దియా నిధులు వెచ్చించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ పనులు నిలిచిపోయాయి. మరమ్మతులు చేయాలని కౌన్సిలర్లు పదేపదే బల్దియా అధికారులకు చెప్పడం, వారు పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ అధికారుల దృష్టికి తీసుకుపోతున్నా పనులు మాత్రం జరగడం లేదు.

నిత్యం వేలాది వాహనాలు తిరిగే పాత జాతీయ రహదారిపై ప్రమాదకరంగా మారిన మిషన్‌ భగీరథ గుంత


త్వరలోనే మరమ్మతులు చేస్తాం
హరిభువన్‌, ఏఈఈ, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ శాఖ

పట్టణంలో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ కోసం తవ్విన గుంతలపై ఫిర్యాదులు వచ్చాయి. ఎక్కడెక్కడ గుంతలున్నాయో గుర్తించాం. త్వరలోనే మరమ్మతులు చేపడతాం. గతంలో గుత్తేదారు మారడంతో ఆలస్యమైంది. బీటీ రోడ్డు స్థానంలో మళ్లీ బీటీ వేసే పరిస్థితి లేదు. సిమెంటు కాంక్రీటుతో గుంతలను పూడ్చివేసేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని