logo

అన్నదాతలకు ముందస్తు గాలం

వానాకాలం సీజన్‌కు మరో మూడు నెలల గడువుంది. ఇప్పటి నుంచే రైతులను మోసం చేయడానికి కొన్ని విత్తన కంపెనీలు, వ్యాపారులు రంగంలోకి దిగారు.

Published : 31 Mar 2023 05:50 IST

లక్కీడ్రాల పేరిట విత్తన కంపెనీల ఆర్భాటం
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం

గతంలో పట్టుబడిన నకిలీ విత్తనాలు

వానాకాలం సీజన్‌కు మరో మూడు నెలల గడువుంది. ఇప్పటి నుంచే రైతులను మోసం చేయడానికి కొన్ని విత్తన కంపెనీలు, వ్యాపారులు రంగంలోకి దిగారు. తమ కంపెనీల పత్తి విత్తనాలను ఎక్కువ మొత్తంలో విక్రయించుకునేందుకు అడ్వాన్స్‌ బుకింగ్‌ను మొదలెట్టారు. అన్నదాతలను ఆకర్షించేందుకు లక్కీడ్రాల పేరిట ఎర వేస్తున్నారు. విత్తనాలను బుక్‌ చేసుకోవాలని ఆఫర్ల ఆశ పెడుతున్నారు. సీజన్‌ ప్రారంభంలో లక్కీ డ్రా తీస్తామని, గెలుపొందిన వారికి బహుమతులు ఉంటాయని చెబుతున్నారు. రెండు బ్యాగులు కొనుగోలు చేసే రైతుల నుంచి రూ.300 అడ్వాన్స్‌గా తీసుకుంటున్నారు. మిగిలిన మొత్తం తిరిగి విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో కొన్ని కంపెనీలు అడ్వాన్స్‌ బుకింగ్‌ పేరిట సొమ్ములు వసూలు చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇంత జరుగుతున్నా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు మోసపోయే పరిస్థితి నెలకొంది.

జిల్లాలో పత్తి అధికంగా సాగు చేస్తారు. వచ్చే వానాకాలం సీజన్‌లో 3.50 లక్షల ఎకరాల్లో పండిస్తారని అంచనా. ఈ లెక్కన 8 లక్షల పత్తి విత్తన సంచులు అవసరం ఉంటుంది. విత్తనాల కోసం అన్నదాతలు ఎక్కువగా ప్రైవేటు కంపెనీలపైనే ఆధారపడతారు. రైతుల అవసరాన్ని కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. వందల కంపెనీలు పలు పేర్లతో విత్తనాలను విడుదల చేస్తాయి. వాటిలో ఏవి మంచివో.. ఏవి నకిలీవో తెలియని పరిస్థితి. ఒక్కోసారి విత్తిన తర్వాత మొలకరానివి ఉన్నాయి. కొన్ని సార్లు ఏపుగా పెరిగి దిగుబడి రాని సందర్భాలు ఉన్నాయి. విత్తనాల సీజన్‌లో నకిలీలు రాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఏటా ఎక్కడో ఒక చోట రైతులు మోసపోతూనే ఉన్నారు. అయితే తాజాగా సీజన్‌ ప్రారంభానికి ముందే రైతులను మోసం చేసేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాలకు వెళ్లి రైతుల నుంచి విత్తనాల విక్రయానికి అడ్వాన్స్‌ సొమ్ము తీసుకోకూడదు. కానీ కంపెనీలు ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడంతో పాటు లక్కీడ్రా పద్ధతి పెట్టడం, బహిరంగంగా రసీదుల ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత కంపెనీలకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉన్నది లేనిది కూడా తెలియదు. వాళ్లు ఏ రకం విత్తనాలు ఇస్తారనే స్పష్టత లేదు. రైతుల నుంచి వీలైనంత సొమ్ము లాగేసుకోవాలనే ఆలోచనతో వల వేస్తున్నారు.

డీలర్లకు నజరానాలు

విత్తనాలు కొనుగోలు చేసే రైతులు పంట సాగుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. విక్రయించే డీలర్లకు కంపెనీలు భారీ నజరానాలు ఇస్తాయి. ఎక్కువ మొత్తంలో విత్తనాలు విక్రయించే వ్యాపారులను విదేశీ పర్యటనలకు తీసుకెళుతుంటాయి. నగదు, బంగారం, కార్లు లాంటి భారీ నజరానాలను ఇస్తాయి. విత్తనాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతులకు ఎక్కువ కమీషన్లు, నజరానాలు ఉండే విత్తనాలనే అంటగడుతుంటారు. విత్తనాల వల్ల నష్టపోయిన సందర్భంలో మాత్రం తమకు సంబంధం లేదంటూ చేతులెత్తేస్తుంటారు. ఏటా కొన్ని కంపెనీల విత్తనాలతో రైతులు నష్టపోయి ఆందోళనలు చేసినా.. ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు పట్టించుకోక నష్టపరిహారం రాని పరిస్థితి ఉంది. రైతులు లైసెన్స్‌ ఉండి, రసీదులు ఇచ్చే వ్యాపారుల నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేస్తే నష్టపోయిన సందర్భంలో కొంతైనా నష్టపరిహారం పొందే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు