logo

విద్యార్థులు.. చిత్రకళా నిపుణులు

ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక సృజనాత్మకత దాగి ఉంటుంది. సాధించాలన్న పట్టుదల, ఏకాగ్రత ఉంటే లక్ష్యాలను చేరుకోవచ్చు

Published : 31 Mar 2023 05:56 IST

నిర్మల్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక సృజనాత్మకత దాగి ఉంటుంది. సాధించాలన్న పట్టుదల, ఏకాగ్రత ఉంటే లక్ష్యాలను చేరుకోవచ్చు. అదే కోవలో పలువురు విద్యార్థులు కళారంగంలో తమదైన ప్రత్యేకతను చాటుతూ పలువురిచే మన్ననలు పొందుతున్నారు. వారిలో దాగి ఉన్న కళను చూస్తే అబ్బురపర్చేలా, ఆలోచింపజేసేలా ఉండడం విశేషం.

తండ్రిబాటలో..

నిర్మల్‌కు చెందిన కోటగిరి గోపి- విజయలక్ష్మి దంపతుల కుమార్తె మంజుశ్రీ మాధ్యమిక విద్యను పూర్తి చేశారు. తండ్రి గోపి మట్టితో దేవుళ్ల విగ్రహాలను తయారు చేయడంలో పేరున్న వ్యక్తి. ఈయనకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు విజయలక్ష్మి. వారి కుమార్తె అయిన ఈ విద్యార్థిని సైతం అదే రంగంలో తనదైన గుర్తింపును పొందుతున్నారు. తండ్రి రూపొందించిన విగ్రహాలకు తుదిమెరుగులు దిద్దడం, ఏవైనా లోపాలుంటే తండ్రికి తెలిపి వాటిని సరిచేయడంలో నేర్పరి. నాలుగో తరగతి చదివే గణిత్‌ సైతం ఏటా వినాయక చవితి సందర్భంగా చిన్నచిన్న గణనాథులను మట్టితో అపురూపంగా తీర్చిదిద్దుతారు.

కళ్లకు కట్టినట్టుగా..

నర్సాపూర్‌(జి) మండలం రాంపూర్‌కు చెందిన మేకల శంకర్‌- చంద్రకళ దంపతుల కుమారుడు కార్తికేయ నిర్మల్‌లోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల బాలుర విద్యాలయంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం అంటే ఎంతో మక్కువ. అందులోనూ పెన్సిల్‌తో వేయడం ప్రత్యేకత. కళ్లకు కట్టినట్టుగా గీయడంలో దిట్ట. విద్యార్థిలో దాగి ఉన్న కళను గుర్తించి గురువులు, తోటి స్నేహితులు సైతం ప్రోత్సహిస్తున్నారు. మంచి కళాకారునిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే తన అభిలాష అని పేర్కొంటున్నారు.

ఆలోచింపజేసేలా..

మామడ మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన జి.మోహన్‌ గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహం నిర్మల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. కళలంటే ఎంతో ఇష్టం. అందులోనూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతికి జరుగుతున్న నష్టం, దానిని భర్తీ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి వాటిపై ఆలోచింపజేసేలా చిత్రాలు వేయడంలో నేర్పరి. ఈయన వేసిన వాటిని చూసి పలువురు ప్రశంసించారు.

చిన్నప్పటి నుంచి..

నిర్మల్‌లోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల బాలుర విద్యాలయంలో ఆరోతరగతి చదువుతున్న విద్యార్థి సంపంగి ధనుశ్‌కు మూడో తరగతిలో ఉన్న సమయంలో చిత్రలేఖనంపై అభిరుచి కలిగింది. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన సుధాకర్‌- వనిత దంపతుల కుమారుడు ఈయన. తండ్రి సుధాకర్‌ ఇంట్లో పెన్సిల్‌తో అందమైన బొమ్మలు వేస్తుంటారు. వాటిని చూసి మక్కువ పెంచుకొని ఈ రంగం వైపు కదిలారు. పెన్సిల్‌తో పెయింటింగ్‌ వేయడం, ఉన్నది ఉన్నట్లుగా గీయడంలో విద్యార్థి ప్రత్యేకత.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని