logo

‘గిరి’ పుత్రులకు అరుదైన అవకాశం

గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకలవ్య గురుకులం పాఠశాలలో 6వ తరగతితో పాటు 7, 8, 9వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 31 Mar 2023 05:56 IST

ఏకలవ్య గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకలవ్య గురుకులం పాఠశాలలో 6వ తరగతితో పాటు 7, 8, 9వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 23 ఉండగా, ఉమ్మడి జిల్లాలోని కాగజ్‌నగర్‌, నార్నూర్‌, ఇంద్రవెల్లి, ఉట్నూరులో నాలుగు ఉన్నాయి. ఏకలవ్య పాఠశాలలో 6వ తరగతిలో 60 సీట్లు ఉండగా, అందులో బాలురు 30, బాలికలకు 30 కేటాయించారు. 95 శాతం సీట్లు ఎస్టీలకే, మిగతా అయిదుశాతంలో ఓపెన్‌-1, దివ్యాంగులు-1, బీసీ-1, ఎస్సీ-2 సీట్లు రిజర్వ్‌ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
మార్చి 27వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించగా.. ఏప్రిల్‌ 20తో గడువు ముగియనుంది. మే 7వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ల ప్రతిపాదికన ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ సొసైటీ(హైదరాబాద్‌) ఆధ్వర్యంలో ఎంపిక చేస్తారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కాగజ్‌నగర్‌ ఏకలవ్య గురుకులం ప్రిన్సిపల్‌ వి.సాయిలు కోరారు. మిగతా వివరాల కోసం స్థానిక ఏకలవ్య గురుకులంలో సంప్రదించాలన్నారు.

పూర్తయిన భవనాలు..

6 నుంచి 12వ తరగతి వరకు గిరిజన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో 2019 సంవత్సరంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏకలవ్య గురుకుల పాఠశాలలు ప్రారంభించింది. ప్రస్తుతం 6, 7, 8, 9 తరగతులు నిర్వహిస్తున్నారు. మిగతా తరగతుల్లోని ఖాళీలను కూడా ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. కాగజ్‌నగర్‌లో రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏకలవ్య పాఠశాల భవనాన్ని పూర్తి చేయగా, 2022 డిసెంబరు 28న రాష్ట్రపతి దౌపదీ ముర్ము వర్చువల్‌(అంతర్జాలం) విధానంలో ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని మిగతా పాఠశాలల నిర్మాణాలు సైతం పూర్తికాగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన భవనంలోనే తరగతులు నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని