logo

ఆన్‌లైన్‌ జూదం.. జీవితాలు ఆగం..

నగరాలు,పెద్దపట్టణాలకు పరిమితమనుకున్న ఆన్‌లైజూదం అడవులజిల్ల్లాలో జడలువిప్పుతోంది. అత్యాశకు పోయి జిల్లాలో ఎంతో మంది యువకులు దీనికి అలవాటు పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.  

Published : 31 Mar 2023 06:08 IST

 ఐపీఎల్‌ బెట్టింగ్‌.. మట్కాపై యువత మోజు
కాగజ్‌నగర్‌, కౌటాల గ్రామీణం, న్యూస్‌టుడే

నగరాలు,పెద్దపట్టణాలకు పరిమితమనుకున్న ఆన్‌లైజూదం అడవులజిల్ల్లాలో జడలువిప్పుతోంది. అత్యాశకు పోయి జిల్లాలో ఎంతో మంది యువకులు దీనికి అలవాటు పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.  మహారాష్ట్రలోని ముంబయి, ఔరంగాబాద్‌, వని తదితర ప్రాంతాలకు చెందిన నిర్వాహకులు, ఏజెంట్లతో జిల్లాలోని పలు ప్రాంతాల దళారులు ఈ దందాను దర్జాగా కొనసాగిస్తున్నారు.
కాగజ్‌నగర్‌తోపాటు మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన కౌటాల, చింతలమానెపల్లి, సిర్పూరు, బెజ్జూరు, పెంచికల్‌పేట మండలాల్లో.. మట్కా, ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ విచ్చలవిడిగా సాగుతోంది. యువత, పెద్దలు ఈ జూదంలో పాల్గొంటూ ఆర్థికంగా చితికిపోతున్నారు. అరికట్టాల్సిన అధికారులు ‘మాములు’గానే వదిలేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గతేడాది కౌటాలలో జూదం ఆడి మోసపోయిన ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా.. దళారిపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి సదరు వ్యక్తులతో బేరసారాలకు దిగినవిషయం విదితమే.

విచ్చలవిడిగా దందా..

సులువుగా డబ్బులు సంపాదించాలన్న దురాశతో పలువురు ఐపీఎల్‌, మట్కా జూదాలకు బానిసలుగా మారుతున్నారు. మహారాష్ట్రలోని వని, ముంబయి ప్రాంతాల నుంచి జిల్లాలోని కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, రెబ్బెన, ఈజ్‌గాం, కౌటాల తదితర ప్రాంతాల్లోని వ్యక్తులతో పరిచయాలు చేసుకొని మట్కా, ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లకు ఏజెంట్లుగా మారుతున్నారు. ప్రత్యేకంగా అడ్డాలను ఏర్పాటు చేసుకుని ఆట నిర్వహిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కొందరు యువకులు ఇళ్లల్లోనే కంప్యూటర్‌, స్మార్ట్‌ ఫోన్ల సహాయంతో ఈ దందా చేపడుతున్నారు. దీంతో నిత్యం రూ.లక్షల్లో లావాదేవీలు జరుగుతున్నాయి. అంకెల గారడితో సాగే ఈ జూదంలో చాలా మంది ఆర్థికంగా చితికి పోతుంటే.. నిర్వాహకులు మాత్రం రూ.కోట్లు ఆర్జిస్తున్నారు.

దళారుల జోరు..

కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని అన్ని మండలాల్లో యువత క్రికెట్‌ బెట్టింగ్‌ వైపు ఆసక్తి చూపుతున్నారు. దళారులు ఆన్‌లైన్‌ జూదంపై యువతకు లింకులు పంపుతూ ఆకట్టుకుంటున్నారు. బెట్టింగ్‌లో పాల్గొన్నవారికి మొదట్లో కొంతమేర డబ్బులు రావడంతో.. సులువుగా ఆకర్షితులవుతున్నారు. గతేడాది కాగజ్‌నగర్‌తోపాటు కౌటాల, సిర్పూర్‌(టి)లలో కొందరు మధ్యవర్తులుగా ఉండి నిర్వహించారు. ఈ వ్యవహారంలో కౌటాల పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించిన ఓ ఎస్సై, కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేయడం గమనార్హం.

నామమాత్రపు కేసులతో సరి..

ఐపీఎల్‌, మట్కాపై పోలీసులు దాడులు చేసి పలువురిని పట్టుకుంటున్నా.. నామమాత్రపు కేసులు నమోదు చేయడంతో వారిలో భయం లేకుండా పోయింది. పైగా నిర్వాహకుల్లో చాలా మందికి వివిధ పార్టీల నేతల అండదండలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. దీంతో కేసులు నమోదవుతున్నా.. మళ్లీ వెంటనే తమ దందాను కొనసాగిస్తుండడం గమనార్హం. ఈ ఆన్‌లైన్‌ దందాను రూపుమాపేందుకు పోలీసులు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.


చర్యలు తీసుకుంటాం
కరుణాకర్‌, డీఎస్పీ, కాగజ్‌నగర్‌    

నిషేధిత మట్కా, ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో పలువురిపై కేసులు నమోదు చేశాం. మట్కా, ఐపీఎల్‌ నిర్వహణ, ఆటలు ఆడే వారి సమాచారం పోలీసులకు చెపితే వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం.


మట్కా అంటే..

మట్కాలో ఆదివారం, పండగలు మినహా నిత్యం మధ్యాహ్నం వేళ కల్యాణి ప్రారంభ అంకెను ప్రకటించి గంటన్నర వ్యవధి తర్వాత చివరి అంకెను ప్రకటిస్తారు. తాను ఊహించిన నెంబరు తగిలితే రూ.10కి రూ.500 నుంచి రూ.600 చెల్లిస్తుంటారు. మహారాష్ట్రలో రూ.10కి వెయ్యి చొప్పన చెల్లిస్తుంటారు. మట్కా చార్టులో అంకెల గారడీని గుర్తించి స్వయంగా ఉహించి ప్రస్తుతం నడుస్తున్న నంబరు ఎంత? తర్వాత వచ్చేది.. ఇలా అంచనాలు, లెక్కలతో సాగే  జూదమే మట్కా. అయితే రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బును దీని రూపంలో కోల్పోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని