logo

సిరులు కురిపిస్తున్న ఎర్ర బంగారం

గతేడాది వరకు నష్టాలు చవిచూసిన రైతులు వారు.. ఇప్పుడు మార్కెట్ల్‌ో డిమాండ్‌ ఉన్న సాగు చేపట్టి లాభాలు గడిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఊరంతా మిర్చి సాగుబాటపట్టి ఔరా అనిపిస్తున్నారు.

Published : 31 Mar 2023 06:08 IST

మిర్చి సాగు బాట పట్టిన రైతులు
కౌటాల గ్రామీణం, న్యూస్‌టుడే

ఆరబోసిన మిర్చి

గతేడాది వరకు నష్టాలు చవిచూసిన రైతులు వారు.. ఇప్పుడు మార్కెట్ల్‌ో డిమాండ్‌ ఉన్న సాగు చేపట్టి లాభాలు గడిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఊరంతా మిర్చి సాగుబాటపట్టి ఔరా అనిపిస్తున్నారు.  కౌటాల మండలంలోని తాటిపల్లి గ్రామ రైతులు గతేడాది వరకు వాణిజ్య పంటలు పండించారు. ప్రకృతి విపత్తులు, దిగుబడులు తగ్గి.. పంటలు బాగా పండినా మద్దతు ధర దక్కక నష్టాలే మిగిలేవి. కానీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ మార్కెట్‌లో మిర్చికి గిట్టుబాట ధర దొరుకుతుందని గ్రహించి.. ఈసారి అంతా పంట మార్పిడి చేసి ఆదాయం పొందుతున్నారు.

గ్రామంలో 566 కుటుంబాలు ఉండగా.. దాదాపుగా 500 కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో మిర్చి ఎక్కువగా సాగు చేస్తుండటం గమనించారు. దీంతోవారుకూడా ఎర్రబంగారం సాగుకు శ్రీకారం చుట్టారు. గతేడాది  150 ఎకరాల్లో సాగు చేయగా.. అందరికీ లాభాలు రావడంతో ఈసారి మరికొంత మంది మిర్చి సాగువైపు మళ్లారు. ప్రస్తుతం తాటిపెల్లి ఒక్క గ్రామంలోనే 400 ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. ఎకరానికి రూ.50 వేల వరకు ఖర్చు అవుతుందని, సుమారు 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం నాగ్‌పూర్‌ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.25 వేల వరకు ధర పలుకుతుండటంతో బాగా గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు అక్కడి రైతులు.

కష్టమైనా నాగ్‌పూర్‌ తరలిస్తూ..

తాటిపెల్లి నుంచి మహారాష్ట్రలోని నాగపూర్‌ మార్కెట్‌ సుమారు 250 కి.మీ. ఉంటుంది. అయినా గిట్టుబాటు ధర కోసం కష్టమైనా అక్కడికి తరలిస్తున్నారు. రాకపోకలకు రూ.12 వేల వరకు అవుతున్నా.. లాభాలు వస్తుండటంతో వెనకడుగు వేయడం లేదు. కౌటాల మండలంలో రైతులు పత్తి, సోయా ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ ఏడాది పత్తి దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చినప్పటికీ గిట్టుబాటు ధర లేక అన్నదాతల ఇళ్లలో నిల్వలు పేరుకుపోయాయి. తాటిపల్లి రైతులను ఆదర్శంగా తీసుకొని ఇంతకాలం వర్షాధారమైన పత్తి, సోయా పండించిన ప్రాణహిత సరిహద్దు గ్రామాలైన గుండాయిపేట, వీర్దండి, తుమ్మిడిహెట్టి, బూరెపల్లి గ్రామాల రైతులు కూడా మిర్చి సాగుకోసం వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు.


నాలుగెకరాల్లో 100 క్వింటాళ్ల దిగుబడి
ఎల్ములె దత్తు, తాటిపల్లి

గతేడాది వరకు మా గ్రామంలో పత్తి పంటే ఎక్కువగా సాగు చేసేవారు. ఏటా దిగుబడి రాక.. మద్దతు ధర లభించక నష్టాలే మిగిలేవి. రెండేళ్లుగా మార్కెట్లో తేజ రకం మిర్చికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. దీంతో గ్రామంలో చాలామంది రైతులు మిర్చిపంటనే సాగు చేస్తున్నారు. నేను 4 ఎకరాల్లో సాగు చేసాను. దాదాపుగా వంద క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఎకరానికి రూ.50 వేల వరకు పెట్టుబడి ఖర్చులు అయ్యాయి.


డిమాండ్‌ ఉన్న పంటలకే మొగ్గు..
బడిగె దామాజీ, రైతు, తాటిపల్లి

నాకున్న ఆరు ఎకరాల్లో మొత్తం మిర్చి పంట సాగు చేసాను. 170 క్వింటాళ్ల పంట పండింది. ఏటా పత్తి సాగు చేస్తే ఏం లాభం ఉండేది కాదు. ఇప్పుడు మిర్చిసాగుతో లాభాలు వచ్చాయి. నాగ్‌పూర్‌ మార్కెట్‌యార్డులో క్వింటాల్‌కు రూ.24 వేల ధర వచ్చింది. డిమాండ్‌ ఉన్న పంటలు సాగు చేస్తే లాభాలు వస్తాయని తెలుసుకున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని