logo

Voter ID: ఇల్లు 1.. ఓట్లు 100.. నివ్వెరపోయిన సిబ్బంది

ఆదిలాబాద్‌ పట్టణంలోని ఓ వార్డులో ఒకే ఇంటి నెంబరులో 103 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ ఇంటికి వెళితే 20మంది మాత్రమే ఉన్నట్లు తేలింది. మిగిలిన వారెక్కడ ఉన్నారంటే పనుల కోసం వేరేచోటికి వలస వెళ్లారని సమాధానం ఇవ్వడం సిబ్బందిని నివ్వెరపర్చింది.

Updated : 23 May 2023 08:16 IST

క్షేత్రస్థాయిలో జాబితా వడపోతకు శ్రీకారం..

సిరికొండలో ఇంటింటికీ వెళ్లి ఆరాతీస్తున్న తహసీల్దారు వర్ణ, ఆర్‌ఐ విలాస్‌

ఆదిలాబాద్‌ పట్టణంలోని ఓ వార్డులో ఒకే ఇంటి నెంబరులో 103 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ ఇంటికి వెళితే 20మంది మాత్రమే ఉన్నట్లు తేలింది. మిగిలిన వారెక్కడ ఉన్నారంటే పనుల కోసం వేరేచోటికి వలస వెళ్లారని సమాధానం ఇవ్వడం సిబ్బందిని నివ్వెరపర్చింది.

బీఎల్‌ఓలకు సవాల్‌గా..

మున్సిపల్‌ ఎన్నికల సమయంలో ఒకరిద్దరు కౌన్సిలర్లు మహారాష్ట్రలోని బంధువులను తీసుకొచ్చి ఓట్లు వేయించి గెలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ఒకే ఇంటి నెంబరుతో వందలాది మంది పేర్లను ఓటరు జాబితాలో చేర్పిస్తున్నారని స్పష్టమవుతోంది. పట్టణంలో 2,397 ఇళ్లల్లో 21,837 మంది ఓటర్లు ఉన్నట్లుగా ఎన్నికల సంఘం గుర్తించడంతో.. వారిని వెతికి పట్టుకోవడం, నిర్ధారించుకోవడం బీఎల్‌ఓలకు సవాల్‌ మారింది.

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే: ఎన్నికల ఏడాది కావడంతో కీలకమైన ఓటరు జాబితాపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. తప్పుల్లేని జాబితా తయారు చేసే క్రమంలో ఇప్పటికే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో.. రెండు, ఆపై ఎక్కువ చోట్ల ఓటుహక్కు కలిగిన ఓటర్లను తొలగించిన అధికారులు.. ఇపుడు ఒకే ఇంటి నెంబరుతో పదులు, వందల సంఖ్యలో ఉండటంతో మరో వడపోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాను పరిశీలిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

జిల్లాలోని ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాలు కలిపి మొత్తం 4,26,096 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లా సరిహద్దున మహారాష్ట్ర ఉండటంతో ఏటా పనుల నిమిత్తం వస్తున్న కూలీలు, బంధువులను ఓటరు జాబితాలో చేర్పిస్తున్నారనే వాదన ఉంది. మరోవైపు ఒకే ఓటరు అటు పంచాయతీలో, ఇటు బల్దియాలోనూ పేర్లు నమోదై ఉండటంతో.. జాబితాలో నకిలీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆధార్‌ అనుసంధానంతో అలాంటి ఓటర్లను తేల్చిన అధికార యంత్రాంగం ఏదో ఒకచోట ఓటుహక్కును కలిగి ఉండాలంటూ నోటీసులు జారీచేసింది. మరోవైపు ఒకే ఇంటి నెంబరుతో అనేకమంది ఓటర్లు జాబితాలో ఉన్నారని గ్రహించిన ఎన్నికల సంఘం సవరణ దిశగా ఉపక్రమించింది. ఇందులో భాగంగా.. బీఎల్‌ఓలకు ఒక ఇంటి నెంబరులో ఆరు కంటే ఎక్కువమంది ఓటర్లు ఉన్న వివరాలను అందించింది. ఆ జాబితాను పట్టుకుని వారు ఇంటింటికీ తిరుగుతున్నారు. నిజంగా అంతమంది ఉన్నారా? లేదా? అని ఆరా తీస్తున్నారు. తహసీల్దార్లు, ఇతర అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

ఎదురవుతున్న సమస్యలు..

బోథ్‌ నియోజకవర్గంలో ఇంటి నెంబరు లేని ఓటర్లు 511మంది ఉండగా.. ఇంటి నెంబరు 1-10 పేరిట 234 మంది, 1-15 పేరిట 252 మంది, 1-18 పేరిట 293 మంది, ఇంటి నెంబరు 1-23 పేరుతో 396మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 2-1 ఇంటి నెంబరులో 255మంది ఉన్నట్లు తేలింది. గ్రామాల వారీగా ఇంటి నెంబర్లు ఒకే క్రమంలో ఉండటం కూడా ఆయా ఇంటి నెంబర్లలో వందల మంది ఓటర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆదిలాబాద్‌ పట్టణంలో మాత్రం చిరునామా ఉన్నచోట ఓటర్లు లేకపోవడం, ఓటర్లు ఉండే చోట ఇంటినెంబర్లు లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.


ఇంటింటికీ వెళ్లి పరిశీలన

ఒకే ఇంట్లో ఆరు కంటే ఎక్కువమంది ఉన్న ఓటర్ల వివరాలపై క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి పరిశీలిస్తున్నారు. ప్రజలు బీఎల్‌ఓలకు సరైన వివరాలు చెప్పి సహకరించాలి. మల్టిపుల్‌ పోర్షన్స్‌, అపార్ట్‌మెంట్లలో ఒకే ఇంటి నెంబరుపై వేర్వేరు కుటుంబాలు ఓటర్లుగా నమోదైతే ఫాం-8 నింపి ఇవ్వాలి. ఇది ఓట్లు తొలగించే ప్రక్రియ కాదు.

రాఠోడ్‌ రమేష్‌, ఆర్డీవో


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని