logo

విస్తరిస్తున్న హెపటైటిస్‌!

ప్రధానంగా శరీర స్రావాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకే హెపటైటిస్‌ (కాలేయ సంబంధిత వైరల్‌) వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది.

Published : 26 May 2023 02:35 IST

సకాలంలో గుర్తిస్తే మేలు..

నమూనాలకు హెపటైటిస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సిబ్బంది

ఆదిలాబాద్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే: ప్రధానంగా శరీర స్రావాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకే హెపటైటిస్‌ (కాలేయ సంబంధిత వైరల్‌) వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. అలక్ష్యం చేస్తే  కాలెయానికి క్యాన్సర్‌ సోకి మనిషి మృత్యువాత పడే ప్రమాదమూ ఉంది. రాష్ట్రంలో క్యాన్సర్‌ను సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘జాతీయ వైర్‌ హెపటైటిస్‌ నియంత్రణ కార్యక్రమం’ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా.. రిమ్స్‌ ఆసుపత్రిలో ప్రత్యేకంగా చికిత్స గదిని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక నోడల్‌ అధికారి, ఫార్మసిస్ట్‌, ఎల్‌టీ, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్‌ను నియమించి చికిత్సలు అందిస్తోంది. ఆ వివరాలతో ‘న్యూస్‌టుడే’ కథనం...

రోగనిరోధక శక్తి తగ్గిన వారిలో హెపటైటిస్‌ వేగంగా విస్తరిస్తుంది. ఈ వ్యాధి తీవ్రత హెచ్‌ఐవీ కంటే వంద రేట్లు అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కాలెయంపై ప్రభావం చూపటం వల్ల అది చెడిపోయి సకాలంలో చికిత్స తీసుకోకుంటే క్యాన్సర్‌గా మారుతుంది. ఇప్పటికే హెపటైటిస్‌ ‘బీ’ సోకిన ముగ్గురు, ‘సీ’ బారిన పడ్డ ఆరుగురు ఆదిలాబాద్‌ రిమ్స్‌లోని డయాలసిస్‌ కేంద్రంలో చికిత్సలు పొందుతున్నారు. ఇటీవల జిల్లా జైలులో 150 మంది ఖైదీలకు పరీక్షలు చేయగా.. ఇద్దరికి హెపటైటిస్‌ నిర్ధారణ అయింది.

తల్లి నుంచి శిశువుకు సోకే ప్రమాదం..

హెపటైటిస్‌ వ్యాధి తల్లి నుంచి శిశువుకు సోకే ప్రమాదముందని వైద్యులు పేర్కొంటున్నారు. గర్భంలో శిశువు ఉన్నప్పుడు ప్లాసెంటా ద్వారా ప్రసవ సమయంలోనూ, ప్రసవానంతరం తల్లి పాల ద్వారా కూడా సోకే అవకాశాలున్నాయని చెబుతున్నారు. గర్భస్థ సమయంలో పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకుంటే తల్లీ బిడ్డకు క్షేమంగా ఉంటుందంటుని స్పష్టం చేస్తున్నారు.

వ్యాధి లక్షణాలు ఇవీ..

* అలసట

* బరువు తగ్గటం

* జ్వరం రావటం

* చర్మంపై మచ్చలు ఏర్పడటం

* ముదురు రంగులో మూత్రం రావటం

* కడుపు నొప్పి

* వాంతులు

* అజీర్తి కావటం

* ఆకలి మందగించటం

* విపరీతమైన నీరసం ఉండటం

వ్యాధి బారిన పడటానికి కారణాలు ఇవీ..

* అసురక్షిత సిరంజీలను వాడటం

* అసురక్షిత లైంగిక సంపర్కం

* శుద్ధి చేయని రక్తం ఎక్కించడం

* పచ్చబొట్లు వేయించుకున్నప్పుడు

నిర్ధారణ అయితే..

ఒకవేళ హెపటైటిస్‌‘బి’/ ‘సీ’ నిర్ధారణ అయితే రిమ్స్‌లో వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి వ్యాక్సిన్‌ అనంతరం నెలకు మరొకటి వేయించుకోవాలి. అనంతరం బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌ ఆరు నెలల తరువాత తీసుకుంటే ఈ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.

సకాలంలో పరీక్ష చేయించుకుంటే మేలు

అనుమానితులు సకాలంలో నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ హెపటైటిస్‌ బీ/సీ ఉన్నట్లు నిర్ధారణ అయితే ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకుంటే క్యాన్సర్‌     బారిన పడకుండా ఉంటాం.

డా.జాడె తానాజీ, నోడల్‌ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని