logo

జిల్లా కేంద్రంలో భూగర్భ డ్రైనేజీ ..

వీధుల్లో, రహదారులపై ఎక్కడపడితే అక్కడ అస్తవ్యస్తంగా మురుగు నీటి ప్రవాహం ఉండకుండా ఆదిలాబాద్‌ పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించనున్నారు.

Published : 26 May 2023 02:35 IST

రూ. 225.46 కోట్లతో నిర్మాణం

పట్టణంలో పలు కాలనీల్లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ ఇలా

ఆదిలాబాద్‌ పట్టణం, న్యూస్‌టుడే: వీధుల్లో, రహదారులపై ఎక్కడపడితే అక్కడ అస్తవ్యస్తంగా మురుగు నీటి ప్రవాహం ఉండకుండా ఆదిలాబాద్‌ పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమృత్‌-2 పథకంలో భాగంగా ఈ వ్యవస్థ నిర్మాణానికి రూ.225.46 కోట్లు మంజూరయ్యాయి.
చుట్టుపక్కల గ్రామాలు విలీనం కావడంతో.. ఆదిలాబాద్‌ పట్టణ విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం పాత పట్టణంలో చాలావరకు డ్రైనేజీ వ్యవస్థ ఉన్నా.. కొత్త వార్డుల్లో మురుగు కాలువలు లేక పట్టణవాసులు నరకయాతన పడుతున్నారు. ప్రధానంగా వర్షాకాలంలో వ్యాధులు ప్రబలేందుకు, దుర్గంధం వ్యాపించేందుకు ఇది కారణమవుతోంది.

అయితే పట్టణమంతా భూగర్భ డ్రైనేజీని నిర్మించనుండటంతో.. దీనికి అడ్డుకట్ట పడనుంది. చిన్న చిన్న వీధులలో కలిపి మొత్తం 260 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నారు.  అవసరమున్న ప్రతి చోటా మ్యాన్‌హోల్స్‌ను నిర్మిస్తారు.

మూడు చోట్ల శుద్ధి కేంద్రాల ఏర్పాటు

పట్టణంలోని ఇళ్లనుంచి వచ్చే మురుగు నీరు మూడుచోట్ల కలిసేలా ప్రణాళిక రచించారు. ఇందులో ఖానాపూర్‌ చెరువుతోపాటు చాందా(టి) వాగు, చిలుకూరి లక్ష్మీనగర్‌ వద్ద ఉన్న భీంసరి వాగుల్లో మురుగు నీటిని పంపించనున్నారు. దీనికోసం ఆ మూడుచోట్ల సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను(శుద్ధి కేంద్రాలు) నిర్మించనున్నారు. మొదటగా ఇందులోకి వచ్చిన మురుగును శుద్ధి చేసిన తర్వాతే ఆయా వాగుల్లోకి పంపిస్తారు.

భూ సేకరణ సైతం

శుద్ధి కేంద్రాల ఏర్పాటు కోసం అర ఎకరం నుంచి ఎకరం వరకు స్థలం అవసరం. ఈ కేంద్రాలు నిర్మించే మూడుచోట్ల స్థలాల కోసం రూ.10 కోట్లు అదనంగా కేటాయించారు. వీటి కోసం తొలుత ప్రభుత్వ స్థలాన్ని సేకరిస్తారు. ఒకవేళ అందుబాటులో ప్రభుత్వ స్థలం లేకపోతే ప్రయివేటు స్థలాన్ని కొనుగోలు చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం చేపట్టే ఈ మురుగు కాలువ పనుల్లో యూఎల్‌బీ (అర్బన్‌ లోకల్‌ బాడీస్‌) భాగస్వామ్యం కింద బల్దియాకు వచ్చే నిధులను ఇందులో కలుపుతారు. ఒకవేళ నిధుల కొరత ఉంటే.. ఆ భాగస్వామ్యనిధులు సైతం రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా విడుదల చేస్తుంది. మొత్తానికి ఆదిలాబాద్‌కు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ మంజూరు కావడం ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి టెండర్లు ఆహ్వానించనున్నట్లు అధికారులు తెలిపారు.

పదిహేను రోజుల్లోగా టెండర్లు

ఈ విషయమై పనులు పర్యవేక్షించే ప్రజారోగ్యశాఖ ఏఈ హరిభువన్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ తరహాలోనే పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తామన్నారు. మురుగు నీటితో వచ్చే దుర్గంధం, దుర్వాసనను వంటి సమస్యలుండవని తెలిపారు. కాలుష్యం ప్రబలకుండా ఇళ్లలోంచి వచ్చే మురుగును శుద్ధి చేసేందుకు మూడుచోట్ల ఎస్‌టీపీలను ఏర్పాటు చేయనున్నామని, పదిహేను రోజుల్లోగా టెండర్లు ఆహ్వానిస్తామని ఆయన పేర్కొన్నారు.

వివరాలు.. (రూ.కోట్లలో)

మొత్తం డ్రైనేజీ నిర్మాణ వ్యయం: 225.46

కేంద్ర భాగస్వామ్యం: 59.20

రాష్ట్ర భాగస్వామ్యం: 111.86

మున్సిపల్‌ గ్రాంటు: 6.56

యూఎల్‌బీ భాగస్వామ్యం: 37.48

భూసేకరణ కోసం: 10.00


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు