logo

సీఎం గారూ.. మా సందేహాలను తీర్చాకే రండి: భాజపా

2018 ఎన్నికల ప్రచారం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలిసారిగా నిర్మల్‌ జిల్లాకు రావడం హర్షణీయమని, అయితే ఇచ్చిన హామీలను అమలు చేయలేని ఆయన ఎందుకు వస్తున్నారో స్పష్టం చేయాలని మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు.

Published : 03 Jun 2023 02:15 IST

లేఖను చూపిస్తున్న నాయకులు

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: 2018 ఎన్నికల ప్రచారం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలిసారిగా నిర్మల్‌ జిల్లాకు రావడం హర్షణీయమని, అయితే ఇచ్చిన హామీలను అమలు చేయలేని ఆయన ఎందుకు వస్తున్నారో స్పష్టం చేయాలని మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజల్లో ఉన్న పలు సందేహాలను నివృత్తి చేయాలన్నారు. రాష్ట్ర మంత్రిగా ఉండాల్సిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కేవలం ఎల్లపెల్లి మంత్రిగా మారారని దుయ్యబట్టారు. ప్రజలకు అందుబాటులో కట్టాల్సిన సమీకృత భవన సముదాయాన్ని దూరంగా, మంత్రి సంబంధీకుల భూములకు దగ్గరగా ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. దళితబంధును సొంత గ్రామంలో తప్ప ఎక్కడా అమలుచేయడం లేదని, పైగా నర్సాపూర్‌ (జి)లో గతంలో జరిగిన ఓ సభలో దళితమహిళను అవమానించి కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. చెరువులు- కుంటలు- భూములను చెరబట్టి పట్టణాన్ని వర్షం నీటిలో ముంచేస్తున్నారని, పేపర్‌ లీకేజీలపై చులకనగా మాట్లాడి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్మల్‌కు రైలొస్తుందంటూ ఏళ్లుగా జనాలను మోసగిస్తున్నారని, ముస్లింలను ఓటుబ్యాంకుగా వాడుకుంటూ వారి బాగోగులను విస్మరించారని, కబ్జాలు- కమీషన్లతో అభివృద్ధి ఫలాలను కొందరికే పరిమితం చేశారని ఆరోపించారు. ఈ మేరకు పలు డిమాండ్లతో ముఖ్యమంత్రికి బహిరంగలేఖ రాశామని చెప్పారు. సమావేశంలో నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్‌, సామ రాజేశ్వర్‌రెడ్డి, అంజుకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* మంజులాపూర్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన కుమురం భీం విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పలువురు భాజపా నేతలు పాల్గొని నివాళులర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని