logo

ఉద్యోగినుల సౌకర్యార్థం.. బాలవినోదం

అన్ని శాఖలకు సంబంధించిన సేవలను ఒకే చోట అందించాలని ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో సమీకృత పాలనా ప్రాంగణాలను నిర్మించింది.

Published : 03 Jun 2023 02:15 IST

సమీకృత పాలనా ప్రాంగణంలో ప్రత్యేక విభాగం

ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నిర్మల్‌ సమీకృత పాలనాప్రాంగణ భవనం

నిర్మల్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : అన్ని శాఖలకు సంబంధించిన సేవలను ఒకే చోట అందించాలని ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో సమీకృత పాలనా ప్రాంగణాలను నిర్మించింది. అయితే ఇందులో చిన్నారులు కలిగిన మహిళా ఉద్యోగినుల సౌకర్యార్థం ఎక్కడా లేని విధంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా పాలనాధికారి కె.వరుణ్‌రెడ్డి చొరవతో ప్రత్యేక విభాగం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ఒక గదిని కేటాయించి దానికి బాలవినోదం అనే నామకరణం చేశారు.

ప్రత్యేకత..

ఆయా విభాగాల్లో మహిళలు వివిధ విధులు నిర్వర్తిస్తున్నారు. అందులో కొందరు చిన్నారులు కలిగిన వారు ఉన్నారు. వృత్తిరీత్యా ఉద్యోగానికి వెళ్తే ఇంటికి తిరిగి వచ్చే వరకు ఇంట్లో ఉన్న వారు వారి ఆలనా పాలనా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో పెద్ద వారుంటే కొంత వెలుసుబాటు ఉన్నా.. అలా లేనివారు ప్రత్యేకంగా ఆయాలను నియమించుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ మాతృమూర్తి చూపే వాత్సల్యం ఎవరెన్ని చేసినా కొరతే. అదే తల్లే తమ వద్ద ఉంటే ఆ పిల్లల ఆనందానికి హద్దులుండవు. అలాగే వారు సైతం తమ పిల్లలు ఎలా ఉన్నారో..? అన్న బెంగ ఉంటుంది. అలాంటి వాటిని దూరం చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో కొత్త కలెక్టరేట్‌లో బాలవినోదాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకొచ్చిన పాలనా ప్రాంగణాల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం విశేషం.

ఆకట్టుకునేలా..

నిర్వహణ బాధ్యతలను జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి విజయలక్ష్మికి అప్పగించారు. జిల్లా కేంద్రంలో సుందరీకరణ కోసం ఆయా ప్రాంతాల్లో, గండిరామన్న హరితవనం, తదితర చోట్ల వివిధ చిత్రాలు వేసిన చిత్రకారుడు రమణకు సదరు బాధ్యతలు ఇచ్చారు. అమ్మప్రేమను తలపించేలా వివిధ చిత్రాలతో పాటు, ఏడు చేపల కథ, బేతాళుడు, అమ్మచెప్పిన కమ్మని నీతి కథలు, జంతువుల మధ్య స్నేహభావం, తెనాలి రామకృష్ణ కథలు, వివిధ జంతువుల చిత్రాలను అందంగా వేశారు.

సకల సౌకర్యాలతో..

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పాలనాధికారి కె.వరుణ్‌రెడ్డి ఆదేశానుసారం ఈ బృహత్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చిన్నారుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక ఆయాను నియమించనున్నాం. ఇప్పటికే సుమారు చిత్రాలు వేసే పని పూర్తయ్యింది. త్వరలోనే ఆట వస్తువులను అందుబాటులోకి తీసుకురానున్నాం. దీంతో వృత్తి రీత్యా విధి నిర్వహణకు వచ్చిన తల్లులు ఇక్కడ తమ చిన్నారులను ఉంచి తమ బాధ్యతలను నిర్వహించుకోవచ్చు. అలాగే మధ్యాహ్న భోజన సమయంలో వారితో గడిపే అవకాశం దక్కనుండడంతో మాతృప్రేమ అంది పిల్లలు, తల్లులు ఆనందంగా ఉండనున్నారు.

విజయలక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి, నిర్మల్‌
 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని