logo

అభివృద్ధిపై మమకారం.. కావాలి సహకారం..

‘అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో ఆదిలాబాద్‌ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృతనిశ్చయంతో పని చేస్తోంది.

Published : 03 Jun 2023 02:32 IST

రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రభుత్వ విప్‌ గోవర్ధన్‌
న్యూస్‌టుడే, పాలనాప్రాంగణం

జెండాకు సెల్యూట్ చేస్తున్న ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌, ఎమ్మెల్యే రామన్న, పాలనాధికారి రాహుల్‌రాజ్‌, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఇతరులు

‘అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో ఆదిలాబాద్‌ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృతనిశ్చయంతో పని చేస్తోంది. ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి’ అని శాసనసభ ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కోరారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత ఆర్‌అండ్‌బీ అతిథి గృహ ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి ఆ తర్వాత తెలంగాణ చౌక్‌లోని ఆచార్య జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో జాతీయజెండాను ఎగురవేసి.. స్వరాష్ట్రం సిద్ధించాక తొమ్మిదేళ్ల పాలనలో జిల్లాలో సాధించిన ప్రగతిని వివరించారు. ఈ వేడుకల్లో జడ్పీ ఛైర్మన్‌ రాఠోడ్‌ జనార్దన్‌, ఎమ్మెల్యే రామన్న, పాలనాధికారి రాహుల్‌రాజ్‌, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, పుర అధ్యక్షుడు ప్రేమేందర్‌, డీసీసీబీ ఛైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, అదనపు పాలనాధికారి నటరాజ్‌, శిక్షణ సహాయ పాలనాధికారి ఆకాష్‌ మహతో, డీఎఫ్‌ఓ రాజశేఖర్‌, ఆర్డీవో రాఠోడ్‌ రమేష్‌, పురపాలక వైస్‌ ఛైర్మన్‌ జహీర్‌రంజానీ, ఆయాశాఖల అధికారులు, భారాస శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..
వ్యవసాయ శాఖ: రాష్ట్రం ఏర్పడిన కొత్తలో జిల్లాలో 4,88,925 ఎకరాలు సాగులో ఉండగా.. ఇపుడు 7,33,875 ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. రైతుబంధు పథకం కింద జిల్లాలో 1,47,161 మంది రైతులకు రూ.2,364 కోట్లు, పంట నష్టపరిహారం కింద రూ.1,81,933 మందికి రూ.85.97 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశాం. రైతు బీమా కింద వివిధ కారణాలతో మరణించిన 3,088 మందికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున వారి నామిని ఖాతాల్లో రూ.14.08 కోట్లు, వ్యవసాయ పరికరాల కొనుగోలుకు 6,643 మందికి రూ.27 కోట్ల రాయితీ మంజూరు, మరో 30,928మంది రైతులకు రూ.17.22 కోట్లు రాయితీ రూపేణా విత్తనాలు సరఫరా చేశాం.

దళితబంధు : జిల్లాలో 249 మంది దళిత కుటుంబాలకు యూనిట్ల స్థాపనకు రూ.24.65 కోట్లు తొలివిడతలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం.

గిరిజన సంక్షేమం: పోస్టు మెట్రిక్‌, ప్రీమెట్రిక్‌ కింద 1,01,943 మంది గిరిజన విద్యార్థులకు రూ.41 కోట్ల ఉపకార వేతనాల మంజూరు, గిరి ప్రాంతాల్లో 199 రహదారుల నిర్మాణ పనులకు రూ.253.63 కోట్లు మంజూరు కాగా రూ.80 కోట్లతో 72 పనులు పూర్తయ్యాయి. విద్యా మౌలిక సదుపాయాలకు రూ.22 కోట్లు, భవనాల నిర్మాణానికి రూ.4.32 కోట్లు, 115 గ్రామ పంచాయతీ భవనాలకు రూ.23 కోట్లు, పర్యాటక ప్రాంతాలైన కుంటాల జలపాతం, ఉట్నూరు పోర్టు అభివృద్ధికి రూ.7.73 కోట్లు, నాగోబా ఆలయానికి రూ.6 కోట్లు మంజూరు చేశాం.

సంక్షేమం : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద జిల్లాలో 29,082 మంది లబ్ధిదారులకు రూ.264.18 కోట్ల ఆర్థిక సాయం చెక్కులు ఇచ్చాం. మహిళా శిశుసంక్షేమ శాఖ ద్వారా ఆరోగ్యలక్ష్మి కింద 54,514 మంది పిల్లలు, 12,841 మంది గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. జిల్లా కేంద్రంలో క్రీడా పాఠశాలను స్థాపించడంతో 240 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. జైనథ్‌ మినీ స్టేడియానికి రూ.3.58 కోట్లు మంజూరు చేశాం.
విద్యా శాఖ మన ఊరు మన బడి కింద 237 పాఠశాలలు ఎంపిక చేసి మౌలిక సదుపాయాల కల్పనపనులు కొనసాగుతున్నాయి. ఆదర్శ పాఠశాలలో బాలికలకు వసతి ఏర్పాటు, కస్తూర్బాల్లో ఇంటర్‌ విద్యను అందిస్తున్నాం.

మిషన్‌ భగీరథ : ఈ పథకం కింద జిల్లాలో 1,234 ఆవాసాలకు రూ.337 కోట్లు ఖర్చు చేసి 1,69,270 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి సురక్షిత తాగునీటిని అందిస్తున్నాం. జిల్లాలో 1,106 అంగన్‌వాడీ కేంద్రాలు, 652 పాఠశాలలు, 101 రైతు వేదికలకూ నల్లా కనెక్షన్లు ఇచ్చి మంచినీటిని సరఫరా చేస్తున్నాం.

ఆసరా పింఛను : వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు వంటివారికి జిల్లాలో 71,742 మందికి రూ.18.36 కోట్లు ప్రతి నెల పింఛను రూపంలో అందజేస్తున్నాం.

వైద్య ఆరోగ్య శాఖ : జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన 39,565 బాలింతలకు కేసీఆర్‌ కిట్లు, రూ.32.72 కోట్లు వారి ఖాతాల్లో జమ, రక్తహీనత నివారణకు 7,703 మంది గర్భిణులకు న్యూట్రిషను కిట్లు, కంటి వెలుగు కింద ఇప్పటివరకు 3,34,133 మందికి పరీక్షలు చేసి 72,832 మందికి కళ్లద్దాలు ఇచ్చాం. రిమ్స్‌ ఆసుపత్రిలో వైద్య సేవలకు రూ.11.65 కోట్లతో ఎంఆర్‌ఐ యంత్రం మంజూరు, డయాలసిస్‌ యూనిట్‌, సిటీస్కాన్‌, సెల్‌కేర్‌ యూనిటు, స్కానింగ్‌ యంత్రాలతో సేవలందిస్తున్నాం. సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో కార్డియాలజీ, న్యూరో, యూరాలజీ, సర్జికల్‌ అంకాలజీ, పిడియాట్రిక్‌ సర్జరీ వంటి సేవలు అందుబాటులోకి తెచ్చాం.
 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని