logo

ప్రణాళికను అమలు చేయడమే ప్రగతి

‘ప్రజా సంక్షేమం కోసం రూపొందించే పథకాలు వందశాతం విజయవంతమైతేనే ప్రభుత్వ ఆశయం నెరవేరినట్లు. ఇందులో అధికారుల పాత్ర కీలకమైనది.

Updated : 03 Jun 2023 06:09 IST

పదేళ్లలో సమూల మార్పు
భవిష్యత్తులో వందశాతం లక్ష్యాల సాకారం
ఈటీవీ - ఆదిలాబాద్‌  

‘ప్రజా సంక్షేమం కోసం రూపొందించే పథకాలు వందశాతం విజయవంతమైతేనే ప్రభుత్వ ఆశయం నెరవేరినట్లు. ఇందులో అధికారుల పాత్ర కీలకమైనది. ఓ పథకం గొప్పది. మరో పథకం తక్కువది అనే తేడా ఉండకూడదు. ఏ పథకం అనుకున్న లక్ష్యాలను సాధించలేదంటే అందులో లోపం ఉన్నట్లుగానే భావించాలి. ప్రతి పథకాన్ని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు లోబడి అమలు చేసినప్పుడే ప్రగతి సాకారం అవుదందనేది నా ఆలోచన’ అని పాలనాధికారి రాహుల్‌రాజ్‌ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ భవిష్యత్తులో చేపట్టే ప్రణాళికపై ఆయనతో ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖి.

వ్యవసాయం

ఆదిలాబాద్‌ వ్యవసాయాధారిత జిల్లా. కానీ పంటల ఉత్పత్తి -  ఉత్పాదకతల మధ్య సమతుల్యత లేదు. సహజంగా ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసేలా మిషన్‌ కాకతీయ దోహదం చేసింది. మత్తడివాగు, సాత్నాల ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టుకు నీరందించినట్లే చనాఖా-కోర్ట బ్యారేజీ ద్వారా నీరు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. పంట రుణాల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా కేవలం డీసీసీబీ, ఎల్‌డీఎం అధికారులతోనే కాకుండా జిల్లాలోని అన్ని బ్యాంకర్లకు కేటాయించే లక్ష్యాలు పూర్తిచేసేలా పర్యవేక్షిస్తాం. వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలను బలోపేతం చేస్తాం. వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం కంటే ఎగుమతి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతాం.

విద్యా - వైద్యం  

అక్షర క్రమంలో ముందుండే ఆదిలాబాద్‌ జిల్లాలో విద్యా - వైద్య సౌకర్యాలను మెరుగుపర్చడం బృహత్తర బాధ్యతగా భావిస్తున్నాం. ప్రధానంగా మాతా శిశు మరణాలను పూర్తిగా తగ్గించడం,  రిమ్స్‌, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యాన్ని అందుబాటులోకి తేవడం కర్తవ్యంగా భావిస్తున్నాం. విద్యా పరంగా బడీడు పిల్లలందరిని బడిలో చేర్చడమే కాదు వందశాతం హాజరుశాతం ఉండేలా చర్యలు తీసుకుంటాం. పదో తరగతి పాసైన పిల్లలు ఇంటర్‌లోకి, ఇంటర్‌ పాసైన విద్యార్థులు డిగ్రీలో చేర్చడంతో పాటు ప్రతిరోజు హాజరయ్యేలా చూడాలనే ప్రణాళికను ఖరారుచేశాం. అర్హులైన విద్యార్థులు, స్వయం ఉపాధి అంశాలపై శిక్షణ ఇస్తూ సాంకేతిక విద్యపై దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తాం. తద్వారా స్వయం ఉపాధితో ఎవరి కాళ్లపై వారు నిలబడటానికి దోహదం చేసినట్లుగా ఉంటుంది.

సజావుగా ఎన్నికలు  

ఇది ఎన్నికల సంవత్సరం. గతంలో ఉన్నట్లుగా సమస్యాత్మక అంశాలేవీ ఇప్పుడు లేవు. వందశాతం ఓటరు నమోదు, వందశాతం ఓటింగ్‌ అనే నినాదంగా పని చేస్తాం. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం, నమోదైన ప్రతి ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకొని రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచేలా ప్రణాళికతో ముందుకెళ్తాం. రాజకీయ పార్టీలు, ప్రజలతో అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేయడానికి యంత్రాంగం తరఫున ప్రాధాన్యం ఉంటుంది. అభివృద్ధి అనేది ఒక్క శాఖకే పరిమితమయ్యే అంశం కాదు. అన్నింట్లో లక్ష్యాలను పూర్తి చేయలగలిగితేనే ఆశించిన ప్రయోజనం నెరవేరుతోంది.

రవాణా సౌకర్యం

రవాణా సౌకర్యం అభివృద్ధికి సూచికలాంటింది. సరైన రవాణా సౌకర్యం లేనందున ఇతర ప్రాంతాలతో అనుసంధానం ఉండదు. ఫలితంగా ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధి సూచికలో కొంత వెనకబడటానికి కారణంగా నిలుస్తోంది. ఇందులో మార్పు తెస్తాం. రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి జిల్లా ఉత్పత్తులను ఇతర జిల్లాలకు ఎగుమతి చేయడం, ఇతర జిల్లాల నుంచి దిగుమతులను తగ్గించగలిగితే జీడీపీ పెరుగుతుంది. ఉదాహరణకు ఫౌల్డ్రీకి సంబంధించిన కోళ్లు, దాణాకు జిల్లా అనుకూలమైనా కరీంనగర్‌, మహారాష్ట్రపై ఆధారపడాల్సి వస్తోంది. అలా కాకుండా జిల్లాలోనే వాటి ప్రాధాన్యం గుర్తించడమే కాకుండా రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ఇతర ప్రాంతాలకు మన సరకును ఎగుమతి చేయడానికి ప్రాధాన్యం ఇస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని