logo

కష్టపడ్డారు.. సీటు సాధించారు

లక్ష్యం గొప్పదైతే ఎంతటి కష్టమైనా దాని ముందు నిలవదని నిరూపించారు. పని చేస్తేనే పూట గడిచే కుటుంబాల నుంచి వచ్చి గురుకులంలో విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యంతో చదివారు.

Published : 03 Jun 2023 02:38 IST

న్యూస్‌టుడే, ఇచ్చోడ : లక్ష్యం గొప్పదైతే ఎంతటి కష్టమైనా దాని ముందు నిలవదని నిరూపించారు. పని చేస్తేనే పూట గడిచే కుటుంబాల నుంచి వచ్చి గురుకులంలో విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యంతో చదివారు. ఓ వైపు తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చాలనే సంకల్పం, తాము ఉన్నత స్థాయిలో నిలబడాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. నెల రోజుల కిందట నిర్వహించిన అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం పీజీ ప్రవేశపరీక్షలో ప్రతిభ చాటి సీటు సంపాదించారు. వారే ఇచ్చోడ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో తమకు ఈ అవకాశం వచ్చిందని, భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలబడతామని పేర్కొంటున్నారు. విద్యార్థులను ప్రిన్సిపల్‌ జ్యోతి, అధ్యాపకులు అభినందించారు.  


ఈ చిత్రంలోని విద్యార్థిని పేరు దుర్గం సాయికీర్తి. కుమురం భీం జిల్లాకు చెందిన ఈమె తల్లిదండ్రులు శంకర్‌, సునీత. తండ్రి కొన్నేళ్ల కిందట మరణించారు. జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. ఇంటర్‌ టీఎస్‌ ఆర్‌జేసీలో చేశారు. బీఎస్సీ- బీజడ్‌సీ మూడో సంవత్సరం చదువుతున్నారు. యూనివర్సీటీ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబర్చడంతో ఎంఏ డెవలప్‌మెంట్‌ విభాగంలో సీటు సాధించారు. ఉపాధ్యాయుల తోడ్పాటుతోనే అవకాశం సాధించానని, ఉన్నతస్థాయిలో నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.


ఈమె పేరు డి.సుప్రజ. మంచిర్యాల జిల్లా. తల్లిదండ్రులు రామకిష్టయ్య, రాగమ్మలు వ్యవసాయం చేస్తారు. సిర్పూర్‌లోని టీఎస్‌ డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌లో 10వ తరగతి పూర్తి చేశారు. చెన్నూర్‌లోని టీఎస్‌ఆర్‌జేసీలో ఇంటర్‌ చదివారు. బీఎస్‌సీ, బీజడ్‌సీ మూడో సంవత్సరం చదువుతున్నారు. పరీక్షలో ప్రతిభ కనభర్చడంతో అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంలో ఎంఏ డెవలప్‌మెంట్‌ విభాగంలో సీటు సాధించారు. ఐఏఎస్‌ సాధించి సమాజానికి సేవలు అందించాలనేదే నా లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.


ఈ చిత్రంలోని విద్యార్థిని పేరు మల్కల సుప్రియ. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం. తల్లిదండ్రులు రాజేశ్వర్‌, గంగమ్మలు వ్యవసాయం చేస్తారు. పది, ఇంటర్‌ జైనథ్‌లోని మోడల్‌ స్కూల్‌, కళాశాలలో చదివారు. ఇచ్చోడలోని సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలలో బీఎస్‌సీ బీజడ్‌సీ మూడో సంవత్సరం చదువుతున్నారు. అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంలో ఎంఏ డెవలప్‌మెంట్‌ విభాగంలో సీటు సాధించారు. భవిష్యత్తులో సివిల్స్‌లో రాణించాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.  
ఈమె పేరు ధనలక్ష్మి. నిర్మల్‌ జిల్లా. తల్లిదండ్రులు గంగారాం, శాంతాబాయిలు వ్యవసాయం చేస్తారు. పదో తరగతి నిర్మల్‌లో పూర్తిచేశారు. ఇంటర్‌ బోథ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, ప్రస్తుతం డిగ్రీ ఇచ్చోడలోని మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, బీజడ్‌సీ మూడో సంవత్సరం చదువుతున్నారు. ఇటీవల నిర్వహించిన అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ప్రవేశపరీక్షలో ప్రతిభ చాటి ఎంఏ డెవలప్‌ మెంట్‌ విభాగంలో సీటు సాధించారు.  ఆంగ్ల ప్రొఫెసర్‌ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.


ఈమె పేరు అశ్విని. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. తల్లిదండ్రులు అర్జయ్య, గంగమ్మలు వ్యవసాయం చేస్తారు. 10వ తరగతి, ఇంటర్‌ వరకు టీఎస్‌ డబ్ల్యూఆర్‌ఐఈఎస్‌ బెల్లంపల్లిలో పూర్తి చేశారు. ఇచ్చోడలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్‌ మూడో సంవత్సరం చదువుతున్నారు. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌(హైదరాబాద్‌)లో సీటు సాధించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు