ఆరోగ్య శ్రీమంతులు
సైకిల్.. అయిదు దశాబ్దాల కిందట ఇదొక విలాస రవాణా వాహనం. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో సైకిళ్లు నడిపే వారి సంఖ్య బాగా తగ్గింది.
నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం
న్యూస్‌టుడే, ఆదిలాబాద్ క్రీడావిభాగం : సైకిల్.. అయిదు దశాబ్దాల కిందట ఇదొక విలాస రవాణా వాహనం. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో సైకిళ్లు నడిపే వారి సంఖ్య బాగా తగ్గింది. రోజూ సైక్లింగ్‌తో రోగాలు దూరమవుతాయని అమెరికా, బ్రిటన్ దేశాల వైద్య సంస్థల విభాగాలు నిర్వహించిన పరిశోధనలో తేలింది. వైద్య నిపుణులు సైతం సూచించడంతో ఆరోగ్యమే మహాభాగ్యమని భావిస్తున్న ప్రతి ఒక్కరు మళ్లీ సైకిళ్లు తొక్కుతున్నారు. శనివారం ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సైక్లింగ్ చేస్తున్న సాధకులు, ప్రయోజనాలు వివరిస్తూ ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.
సైక్లింగ్‌తో ప్రయోజనాలెన్నో..
రోజూ సైకిల్ తొక్కడంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. రోగులకు సైక్లింగ్ చేయాలని సిఫారసు చేస్తున్నారు.
దేశానికి ఆడాలని..
ఈ విద్యార్థి పేరు జాదవ్ కృష్ణ. నేరడిగొండ మండలం వాంకిడి గ్రామానికి చెందిన గణేష్-లక్ష్మీబాయి దంపతుల కుమారుడు. సైక్లింగ్ క్రీడల్లో రాణించాలని రోజుకు 10 కి.మీ.ల దూరాన్ని లక్ష్యంగా పెట్టుకొని సాధన చేశారు. అదే స్ఫూర్తితో నిజామాబాద్, సిద్దిపేట ప్రాంతాల్లో జరిగిన అండర్-14 ఏళ్ల విభాగం రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో కాంస్య పతకాలు సాధించారు. తన ప్రతిభతో హైదరాబాద్‌లోని సాట్స్(రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ) సైక్లింగ్ అకాడమీకి ఎంపికయ్యారు. అక్కడ శిక్షకుల పర్యవేక్షణలో ఏడాది కాలంగా సైక్లింగ్‌లో శిక్షణ పొందుతున్నారు. అకాడమీలోనే పదో తరగతి చదువుతున్నారు. దేశానికి ఆడడమే తన ధ్యేయమంటున్నారు. జాతీయస్థాయి పోటీలకు వాడే సైకిలు రూ.5 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఈ విషయంలో సహకరించాలంటున్నారు.
ఆరోగ్యంగా ఉండాలని సైకిల్ ర్యాలీలో పాల్గొన్న పాలనాధికారి రాహుల్‌రాజ్, జిల్లా వైద్యాధికారులు, వైద్యులు (పాత చిత్రం)
సైకిళ్ల ధరలు ఇలా..
* చిన్నారులకు : రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు
* యువతకు : రూ.4వేల నుంచి రూ.15 వేలు
* స్పోర్ట్స్ సైకిల్ : రూ.8వేల నుంచి రూ.30 వేల వరకు
ఈయనకు సైకిలే నేస్తం..
72 సంవత్సరాల బత్తిని గణపతికి సైకిలే నేస్తం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పనులున్నా, ఎక్కడికెళ్లినా సైకిల్‌పైనే. జిల్లా కేంద్రం క్రాంతినగర్ కాలనీకి చెందిన ఈయన పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత సామాజిక సేవా కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ద్విచక్ర వాహనం తీసుకోవాలని భార్య, పిల్లలు బలవంతం చేసినా తీసుకోలేదు. బైక్ కొనిస్తానని ప్రాణ స్నేహితుడు కె.గంగాధర్ ప్రాధేయపడ్డా సున్నితంగా తిరస్కరించారు. తనకు సైకిల్ అంటే ప్రాణమని, రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు 15 కి.మీ.ల వరకు సైకిల్ తొక్కుతానని, ఇదే నా ఆరోగ్య రహస్యమంటున్నారు. ఇటీవల తన 45 ఏళ్ల పాత సైకిల్‌ను విక్రయించి, చిన్న సైకిల్ తీసుకున్నానంటున్నారు.
రోజుకు 10 కిలోమీటర్లు..
సైకిల్ తొక్కుతున్న వీరి పేర్లు అమన్ చౌదరి, సిద్ధి డోహే, క్రితిక జడల, అపర్ణ. జిల్లా కేంద్రం టీచర్స్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వీరి కుటుంబ పెద్దలు రైల్వేలో లోకో పైలెట్లుగా పని చేస్తున్నారు. వీరు 2019 నుంచి సైక్లింగ్ చేస్తున్నారు. ఆరోగ్యం కోసమే సైక్లింగ్ అంశాన్ని ఎంచుకున్నామని, రోజూ 10 కి.మీ.లు సైకిల్‌పై సవారీ చేస్తున్నామని పేర్కొంటున్నారు. రోజూ సైకిల్ తొక్కడంతో రోజంతా ఉత్సాహంగా ఉంటున్నానని, బరువు కూడా తగ్గిందని గృహిణి అపర్ణ అంటున్నారు.
కరోనా తర్వాత ఆదరణ పెరిగింది: ఫిరోజ్‌ఖాన్, సైకిల్ విక్రయదారుడు
గత 41 సంవత్సరాలుగా సైకిళ్ల వ్యాపారం చేస్తున్నా. కరోనా అనంతరం సైకిళ్లకు బాగా ఆదరణ పెరిగింది. ఆరోగ్యంపై స్పృహ ఉన్నవారంతా ఆన్‌లైన్‌లో కంటే నేరుగా నా వద్ద సైకిళ్లు కొంటున్నారు. నెలకు 90 వరకు సైకిళ్లు విక్రయిస్తున్నా. ఉత్తర భారత రాష్ట్రాల్లో సైకిళ్ల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. అలాంటివి దక్షిణ భారత ప్రాంతాల్లో స్థాపించేలా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత
-
IND vs AUS: ఆసీస్‌పై ఆల్‌రౌండ్ షో.. టీమ్ఇండియా ఘన విజయం
-
Bennu: నాసా ఘనత.. భూమి మీదికి గ్రహశకలం నమూనాలు!
-
Canada MP: ‘కెనడా హిందువుల్లో భయం’.. ట్రూడోపై సొంతపార్టీ ఎంపీ ఆర్య విమర్శలు..!
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్