logo

ఇది మా ఆకాంక్షలు.. మీ మీదే ఆశలు

తెలంగాణ ఉద్యమంలో అండగా నిలిచిన గడ్డకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి మా స్వాగతం. నిర్మల్‌ చారిత్రక ప్రాంతమని, కవులు, కళాకారులకు నిలయమని, పోరాటాలకు పురిటిగడ్డ అని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నోసార్లు మీ నోట విన్నాం.

Published : 04 Jun 2023 03:07 IST

నేడు  నిర్మల్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌

నిర్మల్‌, న్యూస్‌టుడే : తెలంగాణ ఉద్యమంలో అండగా నిలిచిన గడ్డకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి మా స్వాగతం. నిర్మల్‌ చారిత్రక ప్రాంతమని, కవులు, కళాకారులకు నిలయమని, పోరాటాలకు పురిటిగడ్డ అని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నోసార్లు మీ నోట విన్నాం. 5 జులై 2015న హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని దస్తురాబాద్‌ మండలం దేవునిగూడెంలో మొక్కలు నాటి సమయానుభావం వల్ల నిర్మల్‌కు రాకుండానే వెళ్లిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల ప్రచారానికి వచ్చారు. అప్పటినుంచి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు వస్తారని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆదివారం నిర్మల్‌లో సమీకృత కలెక్టరేట్‌ భవనంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు అడుగిడుతుండటంతో ఈ ప్రాంత అభివృద్ధికి వరాల జల్లు కురిపిస్తారనే నమ్మకం ఇక్కడి ప్రజాప్రతినిధులు, ప్రజల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తయి దశాబ్దిలోకి అడుగు పెట్టినా అన్ని వనరులు పుష్కలంగా ఉన్న జిల్లాలో ఆశించినంత అభివృద్ధి జరగలేదు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రధాన సమస్యలు మీ దృష్టికి తెస్తున్నాం. వీటిపై దృష్టి పెట్టాలని.. నిధులు కేటాయించి పరిష్కరించాలని కోరుకుంటున్నాం.


భూగర్భ మురుగుకాలువకు నిధులు కావాలి  

జిల్లాకేంద్రంలో భూగర్భ మురుగుకాలువ (అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని 2018లో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గతంలో ఇందుకోసం సర్వే డీపీఆర్‌ (డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌) నివేదికను ప్రభుత్వానికి పంపించినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.  


రైల్వేలైన్‌ ‘కల’ తీర్చాలని..

రాష్ట్రం- కేంద్రం సంయుక్తంగా కేటాయించి నిధులతో ఆర్మూర్‌-ఆదిలాబాద్‌ రైలు మార్గం వస్తుందని, జిల్లావాసుల రైలు కల నెరవేరుతుందని పాలకులు చేస్తున్న ప్రకటనలు కార్యరూపం దాల్చలేదు. రాష్ట్ర వాటా చెల్లించే విషయంలో మీరు స్పష్టతనిచ్చి, నిధుల విడుదలకు ఆమోదం తెలిపితే పనులు వేగవంతమయ్యే అవకాశముండటంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది.


గల్ఫ్‌ బాధితులకు బాసటగా నిలవండి

గల్ఫ్‌లో పనికి వెళ్తున్న కార్మికులు

ఈ ప్రాంతానికి చెందిన వందలాది మంది గల్ఫ్‌ బాట పడుతున్నారు. 2008లో అప్పటి ప్రభుత్వం గల్ఫ్‌ బాధితులకు ఉపాధి కల్పిస్తామని నిర్మల్‌లో జాబ్‌మేళా నిర్వహించింది. ఈ మేళాకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 8 వేల మంది బాధితులు హాజరయ్యారు. ఈ జాబ్‌మేళాకు ఆరు కంపెనీలు వచ్చి దరఖాస్తులు స్వీకరించినా ఏ ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదు. మీరైనా ఉపాధి చూపించి ఆదుకోవాలని గల్ఫ్‌ బాధితులు కోరుతున్నారు.


15 ఏళ్లుగా సాగుతున్న పనులు పూర్తి చేయించండి

నిర్మల్‌ పట్టణం

నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గాల్లో 50 వేల ఎకరాల చొప్పున సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 27, 28 కింద రూ.1,300 కోట్ల వ్యయంతో 2008లో పనులకు శ్రీకారం చుట్టారు. తొలుత నాలుగేళ్ళలో పూర్తిచేయాలని అప్పటి ప్రభుత్వం గడువు విధించగా, తదనంతరం జరిగిన పరిణామాలతో ఈ పనులు అర్ధాంతరంగా ఆగాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూన్‌ 2019 లోగా పనులు పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు అవకాశం కల్పించారు. గడువు ముగిసి నాలుగేళ్లయినా పనులు గట్టెక్కడం లేదు.


అందరికీ జీవనభృతి అందించాలి

బీడీలు చుడుతున్న కార్మికులు

ఉమ్మడి జిల్లాలో 1.10 లక్షల మంది బీడీ కార్మికులు ఉండగా.. 65 వేల మంది నిర్మల్‌ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. పీఎఫ్‌ ఉన్న కార్మికులకు మాత్రమే జీవనభృతి వర్తిస్తుందని చెప్పడంతో మిగతా కార్మికులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పీఎఫ్‌ సౌకర్యం లేనివారు 40 వేల మంది ఉన్నారు. బీడీ యాజమాన్యాలు తమ స్వలాభం కోసం పథకం ప్రకారం బీడీ కార్మికులకు భవిష్యనిధి కల్పించలేదన్న ఆరోపణలున్నాయి. వారికి న్యాయం చేయండి.


పర్యాటకంపై దృష్టి సారిస్తే బాగు

పురాతన శ్యాంగడ్‌

నిర్మల్‌ చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం.. 400 ఏళ్ల క్రితం ఏర్పడిన పట్టణంలో పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేయొచ్చు. జిల్లాకు ముఖద్వారంలో పురాతన సోన్‌గడ్‌ ఉంది. నిర్మల్‌ పట్టణంలో శ్యాంగడ్‌, బత్తీస్‌గడ్‌, ఖిల్లాగుట్ట, బంగల్‌ బురుజు వంటి పునాతన కట్టడాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా పేరున్న నిర్మల్‌ బొమ్మల కేంద్రం ఉంది. సమీపంలో కుంటాల, పొచ్చెర జలపాతాలు, కవ్వాల్‌ అభయారణ్యం, ఎస్సారెస్పీ, కడెం జలాశయాలున్నాయి. బాసర చదువుల తల్లి క్షేత్రం, పురాతన కదిలి పాపహరేశ్వర, అడెల్లి మహా పోచమ్మ దేవస్థానాలు ఉన్నాయి. నిర్మల్‌ను పర్యాటక కేంద్రంగా మార్చడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నా ఆ దిశగా అడుగులు వేయడం లేదు.


సదర్మాట్‌ బ్యారేజీ పూర్తి  చేయాలని..

నిర్మాణంలోనే సదర్మాట్‌ బ్యారేజీ

మామడ మండలం పొన్కల్‌ వద్ద గోదావరి నదిపై ఏడేళ్ల క్రితం నిర్మాణ పనులు మొదలుపెట్టినా ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదు. చెరువుల కింద ఉన్న కాలువలో పాటు స్వర్ణ, గడ్డెన్నవాగు జలాశయాలు, సరస్వతి కాలువల మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది.  జిల్లాలో 41 ఎత్తిపోతల్లో 29 పథకాలకు మరమ్మతులు చేయలేక దాదాపు 15 వేల ఎకరాలకుపైగా భూములు బీళ్లుగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని