logo

రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది: మంత్రి

ఉమ్మడి రాష్ట్రంలో కష్టాలతో సాగుచేసి ఎన్నో నష్టాలు ఎదుర్కొన్న రైతాంగం కళ్లల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనందం కనిపిస్తోందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

Published : 04 Jun 2023 03:07 IST

నిర్మల్‌ మండలం కొండాపూర్‌ నుంచి ఎల్లపెల్లి రైతువేదిక వరకు ఎడ్లబండి నడిపిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్‌

నిర్మల్‌-నిర్మల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : ఉమ్మడి రాష్ట్రంలో కష్టాలతో సాగుచేసి ఎన్నో నష్టాలు ఎదుర్కొన్న రైతాంగం కళ్లల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనందం కనిపిస్తోందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవం నిర్వహించారు. నిర్మల్‌ పట్టణంలోని మార్కెట్‌యార్డు, మండలంలోని ఎల్లపెల్లి రైతు వేదిక (న్యూపోచంపాడ్‌)లలో నిర్వహించిన కార్యక్రమాల్లో మాట్లాడారు. అంతకుముందు ఈ రెండు చోట్ల కాసేపు ఎడ్లబండి, ట్రాక్టర్‌ను నడిపారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయాన రైతు కావడం, అన్నదాతలు పడుతున్న బాధలు తెలియడంతోనే రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ చేపడ్తున్నారన్నారు. మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ జరిగి ఆయకట్టు విస్తీర్ణం పెరిగిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, వాగులు, నదులపై చెక్‌డ్యాంల నిర్మాణాలతో భూగర్భజలాలు పుష్కలంగా వృద్ధి చెందడంతో రెండు పంటలు సాగవుతున్నాయన్నారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులను సకాలంలో కొనుగోలు చేస్తున్నామన్నారు. యాసంగి సీజన్‌ను మార్చి 31 వరకు ముగిస్తే తర్వాత కురిసే అకాల వర్షాలతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, వచ్చే సీజన్‌ నుంచి ముందస్తు పంటలు సాగు చేయాలని సూచించారు. కష్టపడే కర్షకునికి అన్ని విధాలుగా అండగా ఉండటంతో రైతు ఆత్మహత్యలు లేవని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీకాంతచారి వంటి దాదాపు 1200 మందికిపైగా అమరులు అయ్యారని గుర్తుచేశారు. అంతకుముందు వ్యవసాయ అధికారులు రైతు దినోత్సవ నివేదికను చదివి వినిపించారు. కార్యక్రమాల్లో జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ ఛైర్మన్‌ ధర్మాజిగారి రాజేందర్‌, ఆత్మ ఛైర్మన్‌ గంగారెడ్డి, జడ్పీ సీఈఓ సుధీర్‌, జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్‌, నాయకులు అల్లోల గోవర్ధన్‌రెడ్డి, గంగాధర్‌, మల్లేశ్‌, వ్యవసాయ అధికారులు, ఏఈవోలు, పలు గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు