logo

బిల్లు రాదు.. నమోదు కాదు..

జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ప్రభుత్వం రైతు వేదిక, మన ఊరు- మన బడి కింద మంజూరైన పనులను గుత్తేదారులు సకాలంలో పూర్తి చేసినప్పటికీ పనులకు సంబంధించిన ఇంజినీర్‌ (ఏఈ)లు రికార్డు నమోదు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని,

Published : 04 Jun 2023 03:07 IST

కమీషన్లే  కారణమంటున్న గుత్తేదార్లు..

కాసిపేట, న్యూస్‌టుడే : జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ప్రభుత్వం రైతు వేదిక, మన ఊరు- మన బడి కింద మంజూరైన పనులను గుత్తేదారులు సకాలంలో పూర్తి చేసినప్పటికీ పనులకు సంబంధించిన ఇంజినీర్‌ (ఏఈ)లు రికార్డు నమోదు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కమీషన్‌ ఇవ్వకపోవడంతో రికార్డు నమోదు చేయడం లేదని సర్పంచులు, గుత్తేదారులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం నుంచి సమయానికి నిధులు విడుదల కాక ఇబ్బంది పడుతుంటే.. ప్రతి పనికి కమీషన్ల పేరిట మానసికంగా వేధిస్తున్నారని గుత్తేదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాదిలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సీసీ రహదారుల నిర్మించేందుకు గుత్తేదారులు, సర్పంచులు ముందుకు రాకపోవడంతో పనులు పూర్తి చేయకుండానే పనులు వెనక్కి వెళ్లాయి.

కాసిపేట మండలం ధర్మారావుపేట రైతు వేదిక పనులను 2021లో రూ.22 లక్షలతో చేపట్టారు. సర్పంచి దుస్స విజయ ఆరు నెలల్లోపు పనులు పూర్తి చేశారు. ఇప్పటికి రూ.11 లక్షలకు ఏఈ రికార్డు నమోదు చేయడంతో ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. దీంతో పాటు  ప్రభుత్వ పాఠశాల మన ఊరు- మన బడి కింద ఎంపిక కావడంతో రూ. 18 లక్షలతో పనులు చేశారు. ఆ పనులకు ఇప్పటి వరకు రూ. 10 లక్షల నిధులను ఏఈ రికార్డు నమోదు చేయడంతో నిధులు మంజూరు చేశారు.

పంచాయతీలో పచ్చదనంతో నిండేలా పార్క్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని పంచాయతీలకు సూచించింది. కాసిపేట మండలంలోని పెద్దనపల్లి పంచాయతీలో సర్పంచి ప్రత్యేక చొరవ తీసుకుని పార్క్‌కు వచ్చే ప్రజలకు సౌకర్యంగా వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణాన్ని దాదాపు రూ. 6 లక్షలతో ఏర్పాటు చేశారు. నిర్మాణం పూర్తి చేసి ఏడాది గడుస్తున్నా సంబంధించిన ఏఈ ఇప్పటి వరకు రికార్డు నమోదు చేయలేదని, అప్పు చేసి పనులు పూర్తి చేశానని సర్పంచి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆభరణాలు అమ్ముకొని పూర్తి చేశా..

బంగారు ఆభరణాలు అమ్ముకొని ప్రభుత్వం నుంచి మంజూరైన పనులు పూర్తి చేశా. మన ఊరు- మన బడి కింద మంజూరైన పనులు జిల్లాలోనే మొట్ట మొదటగా పూర్తి చేశా. పనులు పూర్తి చేసి ఆరు నెలలు గడుస్తున్నా ఏఈ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రికార్డు నమోదు చేయలేదు. దీంతో నిధులు విడుదల కావడం లేదు. చేసిన పనులకు కమీషన్ల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

దుస్స విజయ, సర్పంచి, పల్లంగూడ, కాసిపేట మండలం

సమాచారం లేకుండా పనులు చేశారు

మండలంలో చేపట్టిన పనుల్లో రికార్డు నమోదు ఎప్పటికప్పుడు చేస్తున్నాం. కొన్ని పనులు తమకు సమాచారం లేకుండా పనులు చేయడంతో రికార్డు నమోదులో జాప్యమవుతోంది. రికార్డు నమోదు చేసినప్పటికీ కొన్ని చోట్ల నిధులు విడుదల ఆలస్యమవుతోంది.

ఏఈ కల్యాణ్‌రెడ్డి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని