logo

అధికారే అన్నీ.. సిబ్బంది లేక ఇబ్బంది

జిల్లాలోని కొన్ని శాఖల్లో జిల్లాస్థాయి అధికారి తప్ప వారి విభాగాలకు కనీసం అటెండర్‌ కూడా లేరు.దీంతో వారి కార్యాలయాలకు అన్నీ తామై వ్యవహరిస్తూ అవస్థలు పడుతూ నెట్టుకొస్తున్నారు. జిల్లాలో యువజన, క్రీడాభివృద్ధిశాఖ,

Published : 04 Jun 2023 03:07 IST

నిరాదరణకు గురవుతున్న శాఖలు..

జిల్లాస్థాయి అధికారులు (డీవైఎస్‌ఓ, వయోజన విద్యాధికారి) అందుబాటులో ఉండేది ఈ గదిలోనే

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే : జిల్లాలోని కొన్ని శాఖల్లో జిల్లాస్థాయి అధికారి తప్ప వారి విభాగాలకు కనీసం అటెండర్‌ కూడా లేరు.దీంతో వారి కార్యాలయాలకు అన్నీ తామై వ్యవహరిస్తూ అవస్థలు పడుతూ నెట్టుకొస్తున్నారు. జిల్లాలో యువజన, క్రీడాభివృద్ధిశాఖ, జిల్లా ఔషధ తనిఖీ(డీఐ) శాఖలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డీఐ కార్యాలయం ఓ అద్దె నివాసంలో కొనసాగుతుండగా.. డీవైఎస్‌ఓ కార్యాలయం ఇక్కడి సైన్స్‌ సెంటర్‌ భవనంలోని ఓ గదిలో నిర్వహిస్తున్నారు. ఈ రెండింటికి జిల్లాస్థాయి అధికారులు తప్ప అసిస్టెంట్‌, అటెండర్‌ వంటి వారు ఎవరూ లేకపోవడంతో కార్యాలయం తెరిచిన దగ్గర నుంచి శుభ్రం చేయించడం, కార్యాలయ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం వరకు అన్ని వారే చూసుకుంటున్నారు. విధినిర్వహణలో ఇతర ప్రాంతాల్లో పర్యటించినా కార్యాలయాలకు తాళం వేసి వెళ్లాల్సిన దుస్థితి ఆ శాఖల జిల్లా అధికారులది. చాలామందికి క్రీడలు, ఔషధాల శాఖలు ఎక్కడున్నాయో తెలియదు. కనీసం ఒక ఆఫీస్‌అసిస్టెంట్‌, అటెండర్‌ను నియామకం చేసినా ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడకుండా, శాఖకు సంబంధించిన సమాచారం బయటి డీటీపీ కేంద్రాలకు వెళ్లకుండా ఉంటాయి.

* జిల్లా యువజన, క్రీడాభివృద్ధి శాఖ కార్యాలయం ఇది. బోర్డుపై పేరు మరోలా ఉందని అనుకుంటున్నారా.. కానీ ఇందులోనే సంబంధిత శాఖ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రతి సందర్భంలోనూ ఆటలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటూ గొప్పలు చెప్పడం తప్ప సంబంధిత శాఖకు కనీసం అటెండర్‌ను కూడా ఇవ్వలేకపోతున్నారు. జిల్లా అధికారికి సహాయకుల సంగతి పక్కన పెడితే ఇక్కడి క్రీడాకారుల శిక్షణకు ఈ శాఖ తరఫున ఒక్క శిక్షకుడుకూడా లేకపోవడం గమనార్హం. వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్‌ క్రీడాకారుల సహకారాలతో ఈ శాఖ నిర్వహణ సాగుతుండటం విశేషం.

* ఇక్కడ సూచిక కూడా సక్రమంగా కనిపించకుండా ఓ నివాసంలో కొనసాగుతున్న కార్యాలయం.. జిల్లా ఔషధ తనిఖీ అధికారిది. ఈ శాఖ పరిధిలో వందల సంఖ్యలో ఔషధ దుకాణాలు, ల్యాబ్‌లు, రక్తనిధి కేంద్రాలు ఉంటాయి. వీటిని నిత్యం తనిఖీ చేస్తూ నియంత్రణలో పెట్టాల్సిన బాధ్యత సంబంధిత అధికారికి ఉంటుంది. దుకాణాలకు నూతనంగా అనుమతులు ఇవ్వడం, తనిఖీల్లో భాగంగా నోటీసులు జారీ చేయడం ఇలా అనేక పనులు ఉంటాయి. ఇవన్నీ చేసేందుకు జిల్లా అధికారి తప్ప మరొక సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తోంది. తనిఖీలకు వెళ్తే కార్యాలయానికి తాళం వేయాల్సిందే. పని నిమిత్తం దుకాణదారులు ఇక్కడికి వచ్చినా నిరాశతో వెనుతిరగాల్సిన పరిస్థితి ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు