logo

మత్తు వదిలించేందుకు మరో కేంద్రం!

మాదక ద్రవ్యాలు, మద్యం తదితర మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన బాధితులను వాటి నుంచి గట్టెక్కించడానికి  రిమ్స్‌లో డీ-అడిక్షన్‌ కేంద్రం ఏర్పాటు కానుంది.

Published : 04 Jun 2023 03:07 IST

రిమ్స్‌లో డీ-అడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు వైద్యశాఖ ప్రకటన

ఆదిలాబాద్‌ పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో డోవ్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న డీ-అడిక్షన్‌ కేంద్ర భవనం

ఆదిలాబాద్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే: మాదక ద్రవ్యాలు, మద్యం తదితర మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన బాధితులను వాటి నుంచి గట్టెక్కించడానికి  రిమ్స్‌లో డీ-అడిక్షన్‌ కేంద్రం ఏర్పాటు కానుంది. రాష్ట్రంలో ఇప్పటికే 15 డీ-అడిక్షన్‌ కేంద్రాలు ఉండగా.. అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. దీంతో ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో మరో 34 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వైద్య శాఖ ప్రకటించింది. జిల్లా కేంద్రంలోని టీచర్స్‌ కాలనీలో ఇప్పటికే డోవ్‌(డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ ఫర్‌ విలేజ్‌ ఎన్విరాన్‌మెంట్) అనే స్వచ్ఛంద సంస్థ 2005 నుంచి నిర్వహిస్తోంది. ఈ కేంద్రం ఉన్నట్లు జిల్లాలో ఎక్కువ మందికి తెలియదు. పోలీసులు పంపించిన బాధితులు, తెలిసిన పలువురు.. పంపిన బాధితులకు ఇందులో పునరావాసం కల్పించి కౌన్సెలింగ్‌ చేస్తూ వారిని ఆరోగ్యవంతులను చేయటానికి సంస్థ ప్రతినిధులు కృషి చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన డీ-అడిక్షన్‌ కేంద్రం రిమ్స్‌లో ఏర్పాటు చేస్తే బాధితులకు మరింత ప్రయోజనం కలుగుతుంది.

బాధితులకు ఉపకరించేలా..

కొంతమంది సరదాగా మాదక ద్రవ్యాలు వాడుతూ, మద్యం తీసుకుంటూ క్రమేణా మత్తుకు బానిసలుగా మారిపోయి విలువైన జీవితాలను, వారిపై ఆధార పడ్డ కుటుంబాలను చీకటిమయం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని ఆ అలవాటు నుంచి దూరం చేయటంతోపాటు ఆరోగ్యవంతులను చేయటానికి డీ-అడిక్షన్‌ కేంద్రాలు ఉపకరిస్తాయి. బాధితులకు ఈ కేంద్రాల్లో పునరావాసం కల్పించడంతోపాటు మాదకద్రవ్యాలు, మద్యం, కల్లు వల్ల కలిగే అనర్థాలు, దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తారు. దీంతోపాటు వారి కుటుంబ సభ్యులకు సైతం కౌన్సెలింగ్‌ నిర్వహించి, ఇలాంటి బాధితులు ఆ అలవాటు మానుకోవటానికి కుటుంబపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారితో వ్యవహరించే తీరు గురించి వివరిస్తారు. వారికి అవసరమైన చికిత్సలు సైతం అందజేస్తారు. రిమ్స్‌లో ఈ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.

* మాదక ద్రవ్యాలు, మద్యం తదితర మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. సమయానుసారం వారికి మత్తు లభించకపోతే చిరాకు పడటం, కోపగించుకోవడం వంటివి చేస్తుంటారు. వారిలో క్యాల్షియం, విటమిన్ల లోపాలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటి వారికి డీ-అడిక్షన్‌ కేంద్రాల్లో చికిత్సలు అందిస్తే వారికి కొత్త జీవితాలను ఇచ్చినట్లవుతుంది.

కౌన్సెలింగ్‌ నిర్వహిస్తూ..

పట్టణంలోని టీచర్స్‌కాలనీలో నిర్వహిస్తున్న పునరావాస కేంద్రంలో డోవ్‌ స్వచ్ఛంద సంస్థ మేనేజరు చంద్రశేఖర్‌రెడ్డి.. బాధితులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న చిత్రం ఇది. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలను కథల రూపంలో తరగతి గదిలో అవగాహన కల్పిస్తారు. వారి ఆరోగ్యం మెరుగుపర్చటానికి అవసరమైన చికిత్స సైతం ఇందులో అందిస్తున్నారు. నెలరోజులపాటు వారికి కౌన్సెలింగ్‌ చేసి ఆ దురలవాటును మాన్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి నెలా కనీసం 15 మందికి ఈ కేంద్రంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు.

దురలవాటు మాన్పిస్తాం చంద్రశేఖర్‌రెడ్డి, డోవ్‌ సంస్థ ప్రాజెక్ట్‌ మేనేజర్‌

మాదక ద్రవ్యాలకు, మద్యానికి, గంజాయికి అలవాటు పడి బానిసలుగా మారి ఆరోగ్యం పాడుచేసుకున్న బాధితులను మా కేంద్రానికి తీసుకొస్తే నెల రోజులు పునరావాసం కల్పిస్తాం. వారికి అవసరమైన కౌన్సెలింగ్‌ నిర్వహించి ఆరోగ్యం మెరుగుపర్చటానికి మందులు ఇస్తూ చికిత్సలు అందజేస్తాం. ఇలాంటి బాధితులు ఉంటే సమాచారం అందించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని