logo

ఆవిష్కరణలు మెరిసె.. జపాన్‌ పిలిచె

ఆ విద్యార్థుల ఆలోచనలు మెరిశాయి.. వారు రూపొందించిన ఆవిష్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

Published : 04 Jun 2023 03:07 IST

మంచిర్యాల విద్యావిభాగం, కాసిపేట- న్యూస్‌టుడే: ఆ విద్యార్థుల ఆలోచనలు మెరిశాయి.. వారు రూపొందించిన ఆవిష్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ఇన్‌స్పైర్‌ జాతీయ స్థాయి మేళాలో జిల్లా నుంచి పాల్గొన్న విద్యార్థులకు అరుదైన గౌరవం దక్కింది. వీరి ఆవిష్కరణలకు ఆకర్షితులై జపాన్‌ ప్రభుత్వం సకుర సైన్స్‌ హై స్కూల్‌ ప్రోగ్రాం కార్యక్రమం ద్వారా వారి దేశ సందర్శనకు అవకాశం కల్పించింది. అక్కడి నూతన సాంకేతికతను దగ్గరుండి తెలుసుకొని శాస్త్రీయ నూతన ఆలోచనలు, ఆవిష్కరణ రూపకల్పనకు తమ సృజనాత్మకతను పెంపొందించుకునేందుకు ఆహ్వానం పలికింది. మంచిర్యాల జిల్లాలోని మల్కేపల్లి ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన జుమిడ్మి అంజన్న, నెన్నెల జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన కేసరి నవీన్‌కుమార్‌, మంచిర్యాల శ్రీచైతన్య ఉన్నత పాఠశాలకు చెందిన సాయిలు సాయిశ్రీవల్లి జపాన్‌  పర్యటనకు ఎంపికయ్యారు.


సర్కారు బడిలో చదువుతున్న తన మేధస్సుకు పదునుపెట్టి జాతీయ స్థాయిలో మల్కేపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థ్థి జుమ్మిడి అంజన్న తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇన్‌స్పైర్‌ మనక్‌ 2019-20 సంవత్సరం జాతీయస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రదర్శన  కనబరిచాడు. అంజన్న బాలింతలు బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు ఇబ్బంది లేకుండా పాలు ఇచ్చేందుకు గొడుగుతో సాధారణ వస్త్రంతో ఏర్పాటుచేసిన ఫీడింగ్‌ ఛాంబర్‌ ప్రాజెక్టు నాలుగో స్థానంలో నిలిచింది.

అంజన్న రూపొందించిన ఫీడింగ్‌ ఛాంబర్‌


జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని సాయిలు సాయిశ్రీవల్లి సొంతంగా రూపొందించిన శ్రీస్‌ ఋతుమిత్ర కిట్‌ పరికరం 2020-21 సంవత్సరం ఇన్‌స్పైర్‌లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమంగా నిలిచి ఆకట్టుకుంది. దేశంలోని సామాన్య వ్యక్తుల సృజనాత్మకతను గుర్తించడం, గౌరవించడం, సత్కరించడం లక్ష్యంగా ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇన్నోవోషన్‌ అండ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌-2023(ఫైన్‌) పేరిట ఏర్పాటుచేసిన కార్యక్రమానికి సైతం హాజరైంది. ఏప్రిల్‌ 10 నుంచి 13 వరకు దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో  స్త్రీ నెల వారీ రుతుక్రమం ప్రక్రియలో వినియోగిస్తున్న శానిటరీ ప్యాడ్‌ ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు దూరం చేసేందుకు శ్రీవల్లి సొంతంగా రూపొందించిన శ్రీస్‌ రుతుమిత్ర కిట్‌ పరికరాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా అభినందించారు. ప్రాజెక్టు రూపకల్పనపై తన ఆలోచన, అనుభవాలను శ్రీవల్లి రాష్ట్రపతితో ముచ్చటించారు.

ఫైన్‌ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన ప్రాజెక్టును వివరిస్తున్న శ్రీవల్లి


నెన్నెల జిల్లా పరిషతు ఉన్నత పాఠశాలకు చెందిన కె.నవీన్‌కుమార్‌. ఇన్‌స్పైర్‌ మనక్‌లో జిల్లా నుంచి జాతీయస్థాయిలో ఎంపికై 2019 ఫిబ్రవరి 14, 15 తేదీల్లో జరిగిన మేళాలో తన ప్రదర్శన ఇచ్చారు. తక్కువ ఖర్చుతో చెరువులు, వాగులు, సరస్సుల్లో నిండిన చెత్తను సౌరశక్తి విధానం ద్వారా తొలగించడానికి రూపొందించిన గార్భేజ్‌ రిమూవర్‌ ఫర్‌ స్వచ్ఛ వాటర్‌ అనే ప్రదర్శనతో జాతీయ స్థాయిలో ప్రోత్సాహక బహుమతి పొందారు.

జాతీయ స్థాయిలో ప్రదర్శన ఇస్తున్న నవీన్‌కుమార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని