logo

ఎవరి తోవ వారిది.. కట్టాలి వారధి..

ఉమ్మడి జిల్లాలో తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగిన భారాసలో ఇప్పుడు జిల్లానేతలు ఎవరిదారి వారిది అన్నట్లుగా సాగుతున్నారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వీరందిరిని ఏకతాటిపైకి తేవాల్సిన అవసరముందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

Published : 04 Jun 2023 03:07 IST

 సీఎం పర్యటనపై భారాస శ్రేణుల్లో ఆసక్తి

ఈటీవీ, ఆదిలాబాద్‌: ఉమ్మడి జిల్లాలో తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగిన భారాసలో ఇప్పుడు జిల్లానేతలు ఎవరిదారి వారిది అన్నట్లుగా సాగుతున్నారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వీరందిరిని ఏకతాటిపైకి తేవాల్సిన అవసరముందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మొదటి విడతలో జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలకు మంత్రివర్గంలో స్థానం లభించింది. రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చాక ఇంద్రకరణ్‌రెడ్డికి మాత్రమే మళ్లీ చోటు లభించింది. అప్పట్లో తూర్పు/పశ్చిమ జిల్లాలకు అధ్యక్షులు ఉంటే.. జిల్లాల పునర్విభజన తరువాత నాలుగు జిల్లాలకు కొత్త అధ్యక్షులను పార్టీ నియమించింది. ఆదిలాబాద్‌కు జోగు రామన్న, నిర్మల్‌కు ముథోల్‌ ఎమ్యెల్యే విఠల్‌రెడ్డి, మంచిర్యాలకు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు అవకాశం దక్కింది. ప్రారంభంలో ఏకతాటిపైనే ఉన్నప్పటికీ  డీసీసీబీ/ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి క్రమంగా అంతర్గత వైరం పెరిగింది.  వర్గాలుగా నేతలు విడిపోయారు. పార్టీ అనిశ్చితి/ఎమ్మెల్యేల మధ్య వైరుధ్యాల విషయం చాలాసార్లు అధిష్ఠానం దృష్టికి సైతం వెళ్లినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఉమ్మడి జిల్లాలో పార్టీశ్రేణులను ఏకతాటిపై నడిపించే సమర్థ నాయకత్వం కొరవడింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబందు, దళితబస్తీ, ఇళ్ల నిర్మాణం వంటి పథకాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు, వారి అనుచరులు, కుటుంబ సభ్యుల జోక్యం, అవినీతి ఉందనే విషయం సీఎం దృష్టికి సైతం వెళ్లడంతో.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఈ నెల 4న నిర్మల్‌ జిల్లా, 9న మంచిర్యాల జిల్లాకు సీఎం పర్యటనకు రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

ఎన్నికల తరువాత సీఎం రాక..

అసెంబ్లీ ఎన్నికల అనంతరం సీఎం నిర్మల్‌ జిల్లాకు వస్తుండటంతో రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ సారంగాపూర్‌ జడ్పీటీసీ సభ్యుడు రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం, ఆయన దారిలో సీనియర్‌నేత శ్రీహరిరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకోవడం, మరో సీనియర్‌ నేత సత్యనారాయణ గౌడ్‌ అంటీముట్టనట్లు వ్యవహరించడం శ్రేణులకు పరీక్షగా మారింది. మంచిర్యాల జిల్లా నేతల వ్యవహార శైలి వివాదాలకు తావిస్తుండటం కూడా వర్గాలను పెంచి పోషిస్తోంది. బోథ్‌, ఖానాపూర్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో.. నేతలు, కార్యకర్తల మధ్య మునుపు ఉన్న సఖ్యతలేదు. ఉమ్మడి జిల్లాకు  దాదాపు నాలుగేళ్ల తరువాత సీఎం వస్తుండటం శ్రేణుల్లో ఆసక్తి కనిపిస్తోంది. తెలంగాణ దశాబ్ది సంబరాలు జరుగుతున్న వేళ జిల్లా నేతలకు కేసీఆర్‌ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనే దానిపై శ్రేణుల దృష్టి కేంద్రీకృతమైంది.

ఎందుకీ పరిస్థితి..

వర్గాలు విడిపోయిన తరువాత పార్టీని ఏకతాటిపై నడిపించే ప్రయత్నం నేతలెవరూ చేయలేదు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో ఖానాపూర్‌, ముథోల్‌, మంచిర్యాల ఎమ్మెల్యేలు సఖ్యంగా ఉంటారు. జోగు రామన్న, సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనప్ప మరో వర్గంగా ఉన్నప్పటికీ చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు సుమన్‌, చిన్నయ్య, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ల మధ్య సఖ్యతలేదు. ఆత్రం సక్కు వ్యవహారశైలిపై అధిష్ఠానం గుర్రుగానే ఉంది. ఏడాదిన్నర కాలంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆదిలాబాద్‌, నిర్మల్‌, బెల్లంపల్లి పర్యటనల్లో అంతర్గత సమీక్షలు జరిపినప్పటికీ ఫలితం లేకపోవడంతో కేసీఆర్‌ దృష్టి సారించారు. అందుకే ఇటీవల ప్రగతి భవన్‌ వేదికగా రెండుసార్లు జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో జిల్లా నేతల పేర్లు ఉటంకించడం చర్చనీయాంశమైంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని