logo

అంతర్రాష్ట్ర రహదారి.. ప్రమాదకారి

ఘన్‌పూర్‌ అంతర్రాష్ట్ర రహదారిపై కన్గుట్ట గ్రామ సమీపంలోని వంతెన వద్ద, సాకెర గ్రామ సమీపంలో భారీ గుంతలు పడటంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. గుంతలను తప్పించబోయి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

Published : 06 Jun 2023 04:47 IST

పదుల సంఖ్యలో ఘటనలు
బోథ్‌, న్యూస్‌టుడే

ఘన్‌పూర్‌ అంతర్రాష్ట్ర రహదారిపై కన్గుట్ట గ్రామ సమీపంలోని వంతెన వద్ద, సాకెర గ్రామ సమీపంలో భారీ గుంతలు పడటంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. గుంతలను తప్పించబోయి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

రహదారులు నిర్మించడంతో గ్రామాలు, పల్లెలు అభివృద్ధి చెందటం చూస్తుంటాం. కానీ అదే ప్రమాదాలకు నెలవుగా మారి ప్రజల పాలిట ప్రమాదకారిగా మారుతోంది. ఇక్కడ నెల రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ-మహారాష్ట్రలను కలుపుతూ బోథ్‌ మండలంలోని సరిహద్దు గ్రామాలమీదుగా పొచ్చర ఎక్స్‌రోడ్డు నుంచి ఘన్‌పూర్‌ వరకు రోడ్డును నిర్మించారు. బోథ్‌ మండలంలోని పొచ్చర, కన్గుట్ట, కౌఠ, సాకెర, సొనాల, గుట్టపక్కతండా, ఘన్‌పూర్‌ మీదుగా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వరకు దాదాపు 16 కి.మీ దూరంతో రహదారిని నిర్మించారు. ప్రస్తుతం ఈ మార్గం పొడవునా నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కన్గుట్ట వంతెన వద్ద రహదారిపై భారీ గుంతలు ఏర్పడటంతో వాటిని తప్పించబోయి వాహనదారులు ఎదురుగా వస్తున్న వాటిని గమనించకపోవటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతోపాటు గుంతలను తప్పించబోయి అదుపుతప్పి పడిపోతున్నారు. మహారాష్ట్ర ప్రాంతం దగ్గరగా ఉండటంతో.. ఘన్‌పూర్‌వైపునుంచి అక్కడివారు నిత్యం ఆయా పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. సొనాల పరిసర ప్రాంతంలోని ఓ కూడలి వద్ద ఉన్న హోటల్‌లో, పొచ్చర ఎక్స్‌రోడ్డు వద్ద ఉన్న ధాబాలలో మద్యం తాగడం. తాగి వాహనాలను నడుపుతుండటంతో.. ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇటీవలి ఘటనలు పరిశీలిస్తే..

* సొనాల గ్రామానికి చెందిన ఒకరు సాయంత్రం నడకకు వెళ్లగా.. వెనక నుంచి వచ్చిన మహారాష్ట్రకు చెందిన ద్విచక్ర వాహనదారుడు అతన్ని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనదారుడు అధికంగా మద్యం తాగి ఉండటంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

* కన్గుట్ట వంతెన వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై పొచ్చర నుంచి కౌఠకు వెళుతున్న ఓ కారు గుంతలను తప్పించబోయి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మరో ఘటనలో ఇదే వంతెన వద్ద రాత్రిపూట ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు గుంతలను గమనించకపోవటంతో అదుపుతప్పి పడి తీవ్ర గాయాలపాలయ్యారు.

* కన్గుట్ట గ్రామ సమీపంలో పొచ్చర వైపు వెళుతున్న ట్రాక్టరును గమనించక వెనుకే వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు బలంగా ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

* కౌఠ గ్రామ సమీపంలో కౌఠ నుంచి మద్యం తాగి వెళుతున్న ఓ ద్విచక్ర వాహనదారుడు ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొన్నాడు. దీంతో ఆటోలోని వారు, వాహనదారుడు గాయాలపాలయ్యారు.

* సొనాల గ్రామ సమీపంలోని విద్యుత్తు ఉపకేంద్రం వద్ద సైతం ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పిపడిపోతున్నారు. ఇటీవల ఇద్దరు గాయాలపాలయ్యారు.

* సాకెర గ్రామ సమీపంలో రహదారి మధ్యలో గుంత ఏర్పడటంతో.. దాన్ని తప్పించబోయిన ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది.


గుంతలు పూడ్చుతాం

ఘన్‌పూర్‌ అంతర్రాష్ట్ర రహదారిపై ఏర్పడిన గుంతలను త్వరలోనే పూడ్చుతాం. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం. వంతెనల వద్ద, మూలములుపుల వద్ద జాగ్రత్తలు చేపడతాం.

సునీల్‌, డీఈ, ఆర్‌అండ్‌బీ


తనిఖీలు చేపడతాం

ఘన్‌పూర్‌ అంతర్రాష్ట్ర రహదారిపై పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దానికి గల కారణాలు తెలుసుకొని ప్రమాదాలను నివారిస్తాం. రహదారిపై ఉన్న హోటళ్లు, ధాబాలు, చిన్నచిన్న వ్యాపార సముదాయాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్న విషయం మా దృష్టికి రాలేదు. తనిఖీలు చేస్తాం, హోటల్‌ యజమానులతో సమావేశం నిర్వహిస్తాం. ప్రతి రోజు డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. కేసులు నమోదు చేస్తున్నాం.

కేంద్రె రవీందర్‌, ఎస్సై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు