logo

ఆశలు రేకెత్తిస్తున్న ఇంజినీరింగ్‌ కళాశాల

‘మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోరిక మేరకు ఇంజినీరింగ్‌ కళాశాలను మంజూరు చేస్తున్నా. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏ ప్రాంతం అనువుగా ఉంటుందో. దాన్ని పరిశీలిస్తాం.’ అని నిర్మల్‌లో ఆదివారం జరిగిన సభలో సీఎం కేసీఆర్‌ ప్రకటించడం ఆశలు రేకెత్తిస్తోంది.

Published : 06 Jun 2023 04:47 IST

అనువైన ప్రాంతం కోసం అన్వేషణ..
ఈటీవీ, ఆదిలాబాద్‌

‘మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోరిక మేరకు ఇంజినీరింగ్‌ కళాశాలను మంజూరు చేస్తున్నా. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏ ప్రాంతం అనువుగా ఉంటుందో. దాన్ని పరిశీలిస్తాం.’ అని నిర్మల్‌లో ఆదివారం జరిగిన సభలో సీఎం కేసీఆర్‌ ప్రకటించడం ఆశలు రేకెత్తిస్తోంది.

అక్షర క్రమంలో ముందున్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సాంకేతిక ఉన్నత విద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం పెద్దలోటుగా ఉంది. ముఖ్యమంత్రి ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుపై హామీ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పటివరకు బాసర కేంద్రంగా ఆర్జీయూకేటీ ఉన్నప్పటికీ ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకే అవకాశం ఉంటుంది.  గతంలో ఆదిలాబాద్‌లో బాపూజీ ఇంజినీరింగ్‌ కళాశాల, నిర్మల్‌లో మహేశ్వరీ ఇంజినీరింగ్‌ కళాశాల, మంచిర్యాలలో ఐజా పేరిట ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉండేవి. కానీ 2004 నుంచి 2010 మధ్యకాలంలో విద్యార్థులు హైదరాబాద్‌లోని కళాశాలలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాపై ప్రభావం పడింది. అదేసమయంలో కళాశాలల నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతభత్యాలు చెల్లించడం, ప్రభుత్వం నుంచి సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం జరగడంతో కళాశాలల మూసివేతకే ప్రైవేటు యాజమాన్యాలు నిర్ణయించడంతో.. ఇంజినీరింగ్‌ విద్య అందుబాటులో లేకుండా పోయింది. తాజాగా సీఎం హామీతో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటైతే సాంకేతిక ఉన్నత విద్య జిల్లాలో అందుబాటులోకి వచ్చినట్లవుతుందనే అభిప్రాయం విద్యావేత్తల్లో వ్యక్తమవుతోంది.

కావాల్సినవి..

ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలంటే ప్రైవేటులోనైతే కనీసం 20 ఎకరాలు స్థలం, నిపుణులైన బోధకులను తప్పనిసరిగా యాజమాన్యమే చూపించాల్సి ఉంది. ప్రభుత్వ కళాశాల అయితే అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. పైగా భవిష్యత్తు విద్యావసరాల రీత్యా కనీసం 30-50 ఎకరాల్లో కళాశాల ఏర్పాటుచేసే అవకాశం ఉంటుంది. జిల్లా కేంద్రాలైన మంచిర్యాల/నిర్మల్‌కు అనుగుణంగానే ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌కు సైతం నాలుగు వరుసల రహదారులు అనుసంధానమై ఉండటంతో రాకపోకలకు ఏ ఇబ్బందీ లేదు. ఇప్పటికే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో అసంతృప్తి ఉంది. ఇంజినీరింగ్‌ కళాశాలను ఏర్పాటుచేస్తే ప్రభుత్వ పరంగా మేలుచేసినట్లేననే మాట రాజకీయనేతల నుంచి వినిపిస్తోంది. ఈ నెల 26 నుంచి ఇంజినీరింగ్‌ అడ్మిషన్లు ప్రారంభం కానుండటం, సీఎం హామీ ఇవ్వడంతో సానుకూల స్పందన లభిస్తోంది. ఉమ్మడి జిల్లా నేతలు పట్టుదల, పంథాలకు వెళ్లకుండా సామరస్యంగా కనీసం తాత్కాలికమైన ఏర్పాట్లు చేసినా ఈ ఏడాదిలోనే కళాశాల అందుబాటులోకి తీసుకురావడం కష్టమేమీ కాదనే అభిప్రాయం పేరు వెల్లడించడానికి ఇష్టపడని హైదరాబాద్‌లోని సాంకేతిక ఉన్నత విద్యాశాఖాధికారి ఒకరు ‘ఈనాడు’తో పేర్కొనడం గమనార్హం.

ప్రయోజనం..

ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటైతే సివిల్‌ ఇంజినీరింగ్‌/కంప్యూటర్‌సైన్స్‌/మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ ఈఈఈ/ఈసీఈ లాంటి ఎనిమిది విభాగాలు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో కోర్సుకు 30 విద్యార్థులు తగ్గకుండా చూస్తారు. విద్యార్థుల సంఖ్య వంద దాటితే మరో సెక్షన్‌ ఏర్పాటవుతుంది.  యూనివర్శిటీ గ్రాంట్‌ కమిషన్‌ (యూజీసీ) నిబంధనల ప్రకారం.. ప్రతి విభాగానికి ఓ ప్రొఫెసర్‌, మరో ముగ్గురు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అయిదుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు వస్తారు. అంటే వంద వరకు బోధన సిబ్బంది ఉంటే కనీసం మరో రెండు వందల మంది బోధనేతర సిబ్బందికి ఉద్యోగాలు వస్తాయి. నిర్మల్‌ జిల్లాలో ఇప్పటికే ఆర్జీయూకేటీ ఉన్నందు నిర్మల్‌ మినహా మిగిలిన మూడు జిల్లా నేతల్లో స్థలాన్వేషణ ప్రారంభమైనట్లు సూచనప్రాయంగా తెలియవచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని