logo

సర్కారు స్థలం.. ప్రైవేటు పరం..

అది ప్రభుత్వ భూమి. ఆ స్థలంలో ఓ క్వార్టర్‌ నిర్మించి ఉంది. గతంలో నీటి పారుదలశాఖ ఫీల్డ్‌ అధికారి కార్యాలయంగా ఉండేది. క్వార్టర్‌తోపాటు ఖాళీ స్థలాన్ని కొందరు కబ్జా చేశారు.

Published : 06 Jun 2023 04:47 IST

నీటిపారుదల క్వార్టర్‌లో మద్యం దుకాణం
ఖాళీ స్థలంలో శాశ్వత నిర్మాణం..

మందు బాబుల కోసం క్వార్టర్‌ వెనకాల వేసిన రేకుల షెడ్డు

సారంగాపూర్‌, న్యూస్‌టుడే : అది ప్రభుత్వ భూమి. ఆ స్థలంలో ఓ క్వార్టర్‌ నిర్మించి ఉంది. గతంలో నీటి పారుదలశాఖ ఫీల్డ్‌ అధికారి కార్యాలయంగా ఉండేది. క్వార్టర్‌తోపాటు ఖాళీ స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. క్వార్టర్‌లో మద్యం గొలుసు దుకాణం ఏర్పాటు చేసి ఖాళీ స్థలంలో శాశ్వత నిర్మాణాలు చేస్తున్నారు. ఇదంత ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు. సారంగాపూర్‌ మండలంలోని నిర్మల్‌-స్వర్ణ రహదారిని ఆనుకొని జామ్‌ గ్రామంలో బహిరంగంగా జరుగుతున్న ఆక్రమణ.. స్వర్ణ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇక్కడ భూసేకరణ చేసి ఫీల్డ్‌ ఆఫీస్‌ను నిర్మించారు. ప్రాజెక్టు పనులు పూర్తయ్యాక కార్యాలయంలోపాటు ఖాళీ స్థలం వృథాగా ఉండిపోయింది. ఇప్పటికీ ‘ఫీల్డ్‌ ఆఫీస్‌ స్వర్ణ కాలువ క్వార్టర్‌’ పేరున 4వ బ్లాకులో ఇంటి నెం 4-1తో గ్రామ పంచాయతీ రికార్డుల్లో వివరాలు నమోదై ఉన్నాయి. దీనిపై కన్నేసిన కొందరు స్థలాన్ని కబ్జా చేశారు. క్వార్టర్‌లో మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. దాని వెనకాల రేకుల షెడ్డు వేసి తాగేందుకు అడ్డాగా మార్చారు. ముందున్న ఖాళీ స్థలంలో దుకాణ సముదాయం కోసం శాశ్వత నిర్మాణాలు చేస్తున్నారు. ఏడాది క్రితం ‘ప్రభుత్వ భూమిలో.. పరుల పాగా’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన నీటి పారుదలశాఖ అధికారులు నిర్మాణాలను నిలిపివేయించారు. ఇటీవల తిరిగి శాశ్వత నిర్మాణ పనులు ప్రారంభమై కొనసాగుతున్నాయి.

ఫీల్డ్‌ అధికారి కార్యాలయ క్వార్టర్‌ 

స్పందించని  పంచాయతీ కార్యదర్శి..

ఇక్కడ చేపడుతున్న శాశ్వత నిర్మాణ పనులను నిలిపేయాలని కోరుతూ ఏప్రిల్‌ 19న స్వర్ణ ప్రాజెక్టు జేఈ మధుపాల్‌ సారంగాపూర్‌ మండల పరిషత్‌ కార్యాలయం, జామ్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శికి రాత పూర్వంగా లేఖ రాసి స్వయంగా అందజేసినట్లు తెలిపారు. భూమి ఆక్రమణ యాక్టు 1905 ప్రకారం కబ్జాదారులపై నేరుగా చర్యలు తీసుకోవడానికి తమకు అధికారం లేదని, గ్రామ కంఠం పరిధిలో ఉన్నందున ఆక్రమణ దారులకు నోటీసులిచ్చి నిర్మాణాలను కూల్చాలని లేఖలో పేర్కొన్నారు. దాదాపు 43 రోజులు కావస్తున్నా స్థానిక పంచాయతీ కార్యదర్శి కబ్జాదారులకు నోటీసు ఇవ్వలేదని జేఈ తెలిపారు. దీనిపై ఆయన స్పందించక పోవడంతో శాశ్వత నిర్మాణాల పనులు జోరుగా కొనసాగుతూ చివరి దశకు చేరుకున్నాయన్నారు. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్య వైఖరిపై ఆ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేస్తామని జేఈ తెలిపారు.

చివరి దశకు చేరిన శాశ్వత నిర్మాణ పనులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని