logo

సమ్మె బాటన రేషన్‌ డీలర్లు

జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ స్తంభించింది. రేషన్‌ డీలర్లు ఇదివరకు తహసీల్దార్‌, కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టినా.. ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మెబాట పట్టారు.

Updated : 06 Jun 2023 05:09 IST

తెరచుకోని దుకాణాలు
పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే

మూసి ఉన్న చౌకధరల దుకాణం

జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ స్తంభించింది. రేషన్‌ డీలర్లు ఇదివరకు తహసీల్దార్‌, కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టినా.. ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మెబాట పట్టారు. ఈనెల 3వ తేదీ నుంచి సమ్మెకు దిగడంతో దుకాణాలు మూసివేసి దర్శనమిస్తున్నాయి. అధికారులంతా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో నిమగ్నం కావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించని పరిస్థితి నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేదిలేదని డీలరు సంఘ నాయకులు తేల్చిచెబుతున్నారు.

జిల్లాలో 355 రేషన్‌ దుకాణాలు ఉండగా.. 1,91,889 కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ నెలకు 4,083 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం క్వింటాలు బియ్యానికి రూ.70 కమీషన్‌ ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇందులోనే హమాలీ, దుకాణ అద్దె, విద్యుత్తు, ఇంటర్నెట్‌ బిల్లులను చెల్లించాల్సి రావడంతో ఏమి మిగలడం లేదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయోమెట్రిక్‌ విధానం అమలులోకి వచ్చాక తరుగు విషయంలోనూ నష్టపోతున్నట్లు వాపోతున్నారు. గతంలో తొమ్మిది రకాల సరకులు ఇచ్చేవారు. ఇపుడు కేవలం బియ్యం మాత్రమే. అదీ ఉచితంగా ఇస్తుండటంతో ఇచ్చే కమీషన్‌ సైతం ఆలస్యంగా వస్తోందంటున్నారు. దీంతో అప్పులు చేసి అద్దెలు, హమాలీ చెల్లించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. వచ్చే కమీషన్‌ సరిపోక అద్దె, విద్యుత్తు, దినసరి కూలీ వేతనం, హమాలీ ఖర్చులు చెల్లించేందుకు నానా తంటాలు పడుతున్నారు డీలర్లు.

జిల్లా పౌరసరఫరాల శాఖాధికారికి సమ్మె నోటీసు ఇస్తున్న డీలర్లు (పాత చిత్రం)

ప్రధాన డిమాండ్లు...

* గౌరవ వేతనం కింద రూ.45 వేలు ఇవ్వాలి
* రూ.10 లక్షల బీమా అమలు చేయాలి
* హమాలీ ఛార్జీ ప్రభుత్వమే భరించాలి
* శాశ్వత ఆథరైజేషన్‌ ఇవ్వాలి
* క్వింటాకు కిలో తరుగు మినహాయించాలి
* ఇతర సరకులు పంపిణీ చేయాలి
* కారుణ్య నియామక వయసు 50ఏళ్లకు పెంచాలి

వివరాలు..

రేషన్‌ డీలర్లు మొత్తం:  349
కార్డుదారులు:  1,91,889
తెరచుకోని దుకాణాలు:  355


ఏదో ఒకటి తేలేదాకా దుకాణాలు తెరవం

వందలాది పేదలకు ఆకలి తీర్చేలా బియ్యం పంపిణీ చేస్తున్నా మేము గౌరవ వేతనం కోసం ఏళ్లుగా పోరాడుతున్నాం. ఉపాధికూలీ కంటే హీనంగా మారింది మా పరిస్థితి. ప్రభుత్వం స్పందిస్తుందన్న ఆశతో అప్పులు చేసి దుకాణాలు నడుపుతున్నాం. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి సరకులు ఇచ్చాం. అయినా గౌరవవేతనం ఇవ్వకపోగా కమీషన్‌ పెంచడంలేదు. గత్యంతరం లేక సమ్మెబాట పట్టాం. కార్డుదారులు సహకరించాలి. ప్రభుత్వం మా డిమాండ్లను పరిష్కరించేవరకు దుకాణాలు తెరవవద్దని నిర్ణయించాం. అప్పులు చేసి నడిపే బదులు ఏదో ఒకటి తేల్చుకోవాలని సమ్మెకు దిగాం. మానవతా దృక్పథంతో ప్రభుత్వం స్పందిస్తుందని ఎదురుచూస్తున్నాం.

వేణుగోపాల్‌, జిల్లా అధ్యక్షుడు, రేషన్‌డీలర్ల సంఘం


ఎలాంటి ఆదేశాలు రాలేదు

రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుండటంతో జిల్లాలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారం మాకు లేదు. రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావచ్చు. వాటికనుగుణంగా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం. కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెలలో యథావిధిగా బియ్యం పంపిణీ చేస్తాం.

టి.కిరణ్‌కుమార్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని