logo

చిన్న వయస్సులో పెద్ద కష్టం

కళ్లలో నీళ్లు తిరుగుతుండగా పంటి బిగువన దుఃఖాన్ని అదిమి పట్టి భర్త ఒడిలో పడుకుని ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న యువతి పేరు పురంశెట్టి మమత.

Updated : 06 Jun 2023 05:06 IST

భర్త ఒడిలో పడుకుని ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న మమత

జన్నారం, న్యూస్‌టుడే : కళ్లలో నీళ్లు తిరుగుతుండగా పంటి బిగువన దుఃఖాన్ని అదిమి పట్టి భర్త ఒడిలో పడుకుని ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న యువతి పేరు పురంశెట్టి మమత. ఈమె వయస్సు 24 సంవత్సరాలు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ స్వగ్రామం. మైదం జయ-మల్లేశ్‌ దంపతుల రెండో కూతురు. రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన పురంశెట్టి కిరణ్‌కిచ్చి వివాహం జరిపించారు. ఆరు నెలల క్రితం కడుపులో నొప్పి వాంతులు కావడంతో జగిత్యాలలోని ఆసుపత్రిలో చూపించారు. రెండు మూత్ర పిండాల్లో సమస్య ఉందని అక్కడి వైద్యులు తెలిపారు. అనంతరం కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడంతో రెండు మూత్రపిండాలు చిన్నగా ఉన్నాయని క్రమం తప్పకుండా మందులు వాడాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ప్రతీ పది రోజులకోసారి కరీంనగర్‌ వెళ్లి మందులు తీసుకొని వస్తున్నారు. పురంశెట్టి మమత భర్త కిరణ్‌ కూలీ పనులు చేస్తుండగా తండ్రి మల్లేశ్‌ హమాలీగా చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.1.50 లక్షలు వైద్యానికి ఖర్చు చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. గుంట భూమి లేని నిరుపేద కుటుంబం. వైద్యులు డయాలసిస్‌ చేయించుకోవాలని సూచించినట్లు కిరణ్‌ తెలిపారు. మమత తల్లిదండ్రులకు చిన్న గుడిసె ఉండగా కిరణ్‌కు అది కూడా లేకపోవడంతో అన్నయ్య ఇంట్లో ఉంటున్నాడు. చిన్న వయస్సులోనే పెద్ద కష్టం రావడంతో అటు అత్తింటివారు ఇటు పుట్టింటివాళ్లు ఎంతగానో బాధపడుతున్నారు. తన పరిస్థితిని చూసి మమత ప్రతి రోజు కన్నీళ్లు ఇంకే వరకు ఏడుస్తూనే ఉంది. మూడు నెలలుగా పుట్టింట్లోనే ఉంటున్న మమత ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తోంది. మానవతామూర్తులు తగిన సాయం అందించి తన భార్యను బతికించాలని కిరణ్‌ వేడుకుంటున్నారు.

మమత తల్లిదండ్రులు ఉండే ఇల్లు ఇదే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు