logo

మళ్లీమళ్లీ మళ్లించి.. జలాశయాన్ని ముంచి..

కుమురం భీం జిల్లాలో వట్టివాగు జలాశయాన్ని నింపే ప్రధాన నీటి వనరును ఇప్పటికే ఒకసారి మళ్లించారు. తాజాగా మరోసారి కిలోమీటరు దూరంలో మళ్లింపు పనులు పేరిట ఏకంగా జలాశయాన్నే పూడ్చేస్తున్నారు.

Published : 06 Jun 2023 04:47 IST

గని విస్తరణ పేరిట వట్టివాగు పూడ్చివేత

జలాశయంలో మట్టిపోసి పూడ్చేస్తున్నారిలా..

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌: కుమురం భీం జిల్లాలో వట్టివాగు జలాశయాన్ని నింపే ప్రధాన నీటి వనరును ఇప్పటికే ఒకసారి మళ్లించారు. తాజాగా మరోసారి కిలోమీటరు దూరంలో మళ్లింపు పనులు పేరిట ఏకంగా జలాశయాన్నే పూడ్చేస్తున్నారు. దీంతో ఆయకట్టు అన్నదాతల్లో కలవరం మొదలైంది. 20 హెక్టార్ల మేర వరకు అనుమతులు ఇచ్చామని అధికారులు అంటున్నా, దాదాపు 60 హెక్టార్ల స్థలంలో మట్టి వేసే పనులు సాగుతున్నాయి. తిర్యాణి మండలంలోని కైరిగూర ఉపరితల గని విస్తరణ పనులు వట్టివాగు ప్రాజెక్టుకు శాపంగా మారాయి. ఇప్పటికే ఈ జలాశయం చుట్టూ భారీగా బొగ్గు వ్యర్థాల నిల్వలను డంప్‌ చేయడంతో చాలా వరకు పూడికతో నిండింది.

ఆసిఫాబాద్‌, రెబ్బెన, తిర్యాణి మండలాల సరిహద్దులో వట్టివాగు జలాశయాన్ని 1998లో రూ.120 కోట్ల ఖర్చుతో పూర్తి చేశారు. 2 టీఎంసీల సామర్థ్యంతో 25వేల ఎకరాల ఆయకట్టు కలిగిన ఈ ప్రాజెక్టును ఆనుకునే 1217 హెక్టార్లలో కైరిగూర ఉపరితల గని ఉంది. ప్రస్తుతం ఈ గనిని 450 హెక్టార్ల మేర విస్తరిస్తున్నారు. తిర్యాణి మండలం చెలిమెల ప్రాజెక్టు మత్తడితోపాటు మార్గమధ్యలో అనేక వాగులను కలుపుకొని వచ్చే నీటిపాయ వట్టివాగు జలాశయానికి ప్రధాన వనరు. 2006లో కైరిగూర ఉపరితల గని విస్తరణలో భాగంగా దీన్ని ఒకసారి దారి మళ్లించారు. తాజాగా మళ్లీ మళ్లింపు పనులు చేస్తున్నారు. ఇందుకు రూ.8 కోట్లు కేటాయించారు.

జలాశయంలోనే మట్టి వేస్తున్నారు..

ఉన్నతాధికారుల నుంచి అనుమతులు తీసుకున్నామని చెబుతూ సింగరేణి సంస్థ జలాశయంలోనే ప్రస్తుతం మట్టి వేసి చదును చేసేస్తున్నారు. 20 హెక్టార్ల జలాశయ ఆక్రమణ ఇప్పటికే పూర్తయింది. గని పక్కనే ఉన్న కొండల నుంచి మట్టిని తెస్తూ భారీ యంత్రాల సాయంతో మట్టితో పూడ్చివేస్తున్నారు.

నది ప్రవాహానికి అడ్డుగా వేసిన కట్ట

నిర్వహణ లేక అస్తవ్యస్తం..

సమృద్ధిగా జలాలు ఉన్నప్పటికీ నిర్వహణ లేక ప్రాజెక్టు అస్తవ్యస్తంగా మారింది. 25వేల ఆయకట్టు ఉన్నప్పటికీ శిథిల కాలువలు, దెబ్బతిన్న తూములు, అడుగడుగునా లీకేజీల కారణంగా అతికష్టం మీద 2 వేల ఎకరాలకు సాగు నీరందిస్తోంది. రైతులే ఏటా కాలువల్లో పూడిక తీసుకుంటూ, తమ పంటలను తడుపుకొంటున్నారు.


ఉన్నతాధికారులు అనుమతులు ఇచ్చారు..

కాలువ మళ్లింపు, జలాశయం స్థల కేటాయింపునకు ఉన్నతాధికారులు అనుమతులు ఇచ్చారు. ఇక్కడ జలాశయంలో 20 హెక్టార్ల మేర పూడ్చి వేసినందుకు మాకు మరో చోట సింగరేణి సంస్థ ఇరవై హెక్టార్ల వరకు ఇవ్వనుంది.

దామోదర్‌, డీఈ నీటిపారుదలశాఖ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని