logo

రాష్ట్రాభివృద్ధిలో కీలకం... దేశానికే గర్వకారణం

సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంలో సింగరేణి రాష్ట్రాభివృధ్ధిలో కీలకంగా మారి దేశానికే గర్వకారణమైందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు.

Published : 06 Jun 2023 04:47 IST

ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌

జైపూర్‌లో విద్యుత్తు ఉత్పత్తి గురించి విప్‌ బాల్క సుమన్‌కు వివరిస్తున్న అధికారులు

జైపూర్‌, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంలో సింగరేణి రాష్ట్రాభివృధ్ధిలో కీలకంగా మారి దేశానికే గర్వకారణమైందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి థర్మల్‌ విద్యుత్తు కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంచాలకుడు(పాఅండ్‌ ఫైనాన్స్‌) బలరాం నాయక్‌తో కలిసి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎస్టీపీపీని మరింత విస్తరించాలని సూచించారు. విద్యుత్తు ఉత్పత్తిలో మహారత్న కంపెనీల కంటే ఎస్టీపీపీ ముందు వరుసలో ఉండటం చాలా గర్వకారణం అన్నారు. రానున్న 800 మెగావాట్ల నూతన ప్లాంట్‌లో ఎక్కువ ఉపాధి అవకాశాలు స్థానికులకే ఇవ్వాలన్నారు. సంచాలకుడు బలరాం నాయక్‌ మాట్లాడుతూ  ఎంతో మంది అధికారులు, కార్మికుల రాత్రింబవళ్ల కృషి ఫలితంగానే నేడు ఎస్టీపీపీ ఈ స్థాయిలో ఉందన్నారు. లాభాల, దీపావళి బోనస్‌ ద్వారా సుమారు రూ.వెయ్యి కోట్లు సంస్థ ఉద్యోగులకు వచ్చే అవకాశముందన్నారు. అంతకు ముందు పలు స్టాళ్లను ప్రారంభించారు. చిన్నారులు వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. సీటీసీ సంజయ్‌కుమార్‌ సూర్‌, జీఎం సూర్యనారాయణరాజు, వోఅండ్‌ఎం జైన్‌సింగ్‌, అధికారులు శ్రీనివాస్‌, సత్యనారాయణ, సుధాకర్‌, శ్రీనివాస్‌, నారాయణరావు, గుర్తింపు సంఘం నాయకులు రాజు, తదితరులు ఉన్నారు.

శ్రీరాంపూర్‌లో  సింగరేణి సంబురాల్లో పాల్గొన్న జిల్లా పాలనాధికారి బాదావత్‌
సంతోష్‌కు జ్ఞాపిక అందజేస్తున్న జీఎం సంజీవ రెడ్డి, పక్కన ఎమ్మెల్యే దివాకర్‌ రావు

కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపులో వివక్ష

నస్పూర్‌: సింగరేణి ఉద్యోగులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే వివక్ష చూపుతుందని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేత పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ్రీరాంపూర్‌ ప్రగతి మైదానంలో సోమవారం సింగరేణి ప్రగతి రన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు కుట్ర చేస్తోందన్నారు. అందరం ఐక్యంగా పోరాడి సింగరేణిని కాపాడుకోవాలని సూచించారు. తొమ్మిదేళ్లలో అనేక రంగాల్లో దేశానికి స్ఫూర్తినిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని డైరెక్టర్‌ బలరాం అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పన, వాటిని సక్రమంగా అమలు చేస్తూ తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా పాలనాధికారి బాదావత్‌ సంతోష్‌ కోరారు.

శ్రీరాంపూర్‌లో సింగరేణి ప్రగతి పుస్తకం ఆవిష్కరిస్తున్న పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేత, పక్కన డైరెక్టర్‌ బలరాం

ఆకట్టుకున్న స్టాళ్లు, బతుకమ్మ

గనులు, పలు శాఖలకు సంబంధించిన నమూనాల స్టాల్స్‌తో పాటు పల్లెటూరి వాతావరణం కనిపించేలా ఏర్పాటు చేసిన సెట్టింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 72 మందికి కారుణ్య నియామక పత్రాలు, 21 మందికి సొంతింటి కల పథకానికి సంబంధించిన చెక్కులు అందజేశారు. ఉత్తమ ఉద్యోగులను సన్మానించారు. సంస్థ డైరెక్టర్‌ బలరాం శ్రీరాంపూర్‌ బస్టాండ్‌ వద్ద కార్మికుడి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం బతుకమ్మ ఆటలతో నృత్యాలు, కోలాటాల నడుమ ప్రగతి మైదానానికి చేరుకున్నారు. తెబొగకాసం వర్కింగ్‌ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, మున్సిపల్‌ ఛైర్మన్‌ ప్రభాకర్‌, ఖాదీర్‌, సంజీవ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

శ్రీరాంపూర్‌లో బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని