logo

సేవలు భేష్‌.. గుర్తించిన ఎన్‌కాస్‌

ఆదిలాబాద్‌, కుమురం భీం జిల్లాల్లోని ఆసుపత్రులను జాతీయస్థాయి పురస్కారాలు వరించాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటికే 11 పీహెచ్‌సీ/యూపీహెచ్‌సీలు ఎన్‌కాస్‌ గుర్తింపు పొందగా తాజాగా ఆదిలాబాద్‌ జిల్లాలోని పుత్లీబౌలి పట్టణ పీహెచ్‌సీకి ఎన్‌కాస్‌, ఉట్నూర్‌, కుమురం భీం జిల్లా ఆసుపత్రుల్లోని లేబర్‌రూం(ప్రసవ విభాగా)లకు ‘లక్ష్య’ గుర్తింపు లభించింది.

Updated : 07 Jun 2023 05:59 IST

ఉట్నూర్‌, ఆసిఫాబాద్‌ లేబర్‌రూంలకు ‘లక్ష్య’, పుత్లిబౌలీ పట్టణ పీహెచ్‌సీకి పురస్కారం
ఆదిలాబాద్‌ జిల్లాలో అన్ని యూపీహెచ్‌సీలకు వర్తింపు

ఆసిఫాబాద్‌ ఆసుపత్రిలో లేబర్‌రూంను పరిశీలించటానికి మే 1న వచ్చిన ఎన్‌కాస్‌ బృందంతో ఆసుపత్రి సిబ్బంది

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వైద్య విభాగం: ఆదిలాబాద్‌, కుమురం భీం జిల్లాల్లోని ఆసుపత్రులను జాతీయస్థాయి పురస్కారాలు వరించాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటికే 11 పీహెచ్‌సీ/యూపీహెచ్‌సీలు ఎన్‌కాస్‌ గుర్తింపు పొందగా తాజాగా ఆదిలాబాద్‌ జిల్లాలోని పుత్లీబౌలి పట్టణ పీహెచ్‌సీకి ఎన్‌కాస్‌, ఉట్నూర్‌, కుమురం భీం జిల్లా ఆసుపత్రుల్లోని లేబర్‌రూం(ప్రసవ విభాగా)లకు ‘లక్ష్య’ గుర్తింపు లభించింది. ఆ కేంద్రాల్లో జాతీయస్థాయి ప్రమాణాల మేరకు వైద్య సేవలందిస్తున్నందుకు ఈ పురస్కారాలను ‘జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ’ ప్రకటించింది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో పర్యటించిన ఎన్‌కాస్‌(నాణ్యతా ప్రమాణాల గుర్తింపు) బృందం పర్యటించి ఆయా కేంద్రాలను పరిశీలించి కేంద్రానికి సమర్పించిన నివేదిక మేరకు వాటికి జాతీయ స్థాయి గుర్తింపు పురస్కారాలను ప్రకటించారు.  

ఇప్పటికే బజార్‌హత్నూర్‌, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, దంతన్‌పల్లి, భీంపూర్‌ పీహెచ్‌సీలు రెండేసి సార్లు ఎన్‌కాస్‌ గుర్తింపు లభించింది. గుడిహత్నూర్‌, అంకోలి, గాదిగూడ, ఖుర్శిద్‌నగర్‌, హమాలీవాడ, శాంతినగర్‌ పట్టణ పీహెచ్‌సీలకు సైతం ఎన్‌కాస్‌ గుర్తింపు లభించింది. రిమ్స్‌, ఉట్నూర్‌ పిల్లల వార్డులు సైతం ఇటీవలే ముస్కాన్‌ గుర్తింపు పొందాయి. తాజాగా పుత్లీబౌలి పట్టణ పీహెచ్‌సీ ఎన్‌కాస్‌ గుర్తింపు లభించటంతో ఎన్‌కాస్‌ గుర్తింపు లభించిన వంద శాతం పట్టణ పీహెచ్‌సీల్లో ఆదిలాబాద్‌ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆరోగ్య కేంద్రాలు జాతీయ స్థాయి గుర్తింపు పొందటానికి జిల్లా క్వాలిటీ మెంటరింగ్‌ టీం, క్వాలిటీ మేనేజర్లు సాయిప్రసాద్‌, అమర్‌లు విశేష కృషి చేస్తున్నారు.

సిబ్బందికి 25 శాతం ప్రోత్సాహకం

జాతీయస్థాయి గుర్తింపు ద్వారా అందనున్న నగదులో సిబ్బందికి 25 శాతం నిధులను ప్రోత్సాహకంగా చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 75 శాతం ఆయా కేంద్రాల్లో అత్యవసర పనులకు వినియోగించుకొని బాధితులకు మెరుగైన సేవలందించటానికి నిబంధనలు ఉన్నాయి. దీంతో మరింత మెరుగైన సేవలు అందే అవకాశాలున్నాయి.

ప్రతి కేంద్రానికి రూ.3 లక్షల ప్రోత్సాహక నగదు

ఉట్నూర్‌, ఆసిఫాబాద్‌ ప్రసవ విభాగాలకు ‘లక్ష్య’ కింద, ఆదిలాబాద్‌ పుత్లీబౌలి పట్టణ పీహెచ్‌సీకి ఎన్‌కాస్‌కు ఎంపిక కావటంతో ఒక్కో విభాగానికి రూ.3 లక్షల చొప్పున ప్రోత్సాహకం అందనుంది. ఇలా మూడేళ్లపాటు మొత్తం రూ.9 లక్షలు అందనున్నాయి. అనంతరం మళ్లీ పరిశీలన చేస్తారు.

ఇది ఉట్నూర్‌ జిల్లా ఆసుపత్రిలోని లేబర్‌రూం(ప్రసవ విభాగం). ఇందులో జాతీయ స్థాయి ప్రమాణాల మేరకు కాన్పులు చేస్తున్నారు. మే 19, 20 తేదీల్లో ఉట్నూర్‌ ఆసుపత్రి, మే 1న ఆసిఫాబాద్‌ ఆసుపత్రిలోని లేబర్‌రూంలను ఎన్‌కాస్‌ బృందం ఈ విభాగాలను పరిశీలించి అక్కడ పాటిస్తున్న జాతీయ నాణ్యతా ప్రమాణాలను పరిశీలించింది. కాన్పుల సమయంలో అక్కడ తీసుకుంటున్న జాగ్రత్తలను నమోదు చేసి నివేదికను కేంద్రానికి పంపించింది. ఉట్నూర్‌కు 90 శాతం, ఆసిఫాబాద్‌కు 86 శాతం మార్కులు లభించటంతో ‘లక్ష్య’ పథకంలో భాగంగా జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది.

ఇది ఆదిలాబాద్‌ పట్టణంలోని పుత్లీబౌలి పట్టణ పీహెచ్‌సీ. మే 10, 11 తేదీల్లో ఎన్‌కాస్‌ బృందం పరిశీలించింది. గర్భిణుల నమోదు, టీకాల నిర్వహణ, కేంద్రంలో పారిశుద్ధ్యం, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని 87 శాతం మార్కులు కేటాయించింది. దీంతో జాతీయ స్థాయిలో ఎన్‌కాస్‌ గుర్తింపు లభించింది. దీంతో పట్టణంలోని నాలుగు పీహెచ్‌సీలకు ఈ గుర్తింపు లభించినట్లయింది.

మరింత మెరుగైన సేవలందిస్తాం

రాఠోడ్‌ నరేందర్‌, డీఎంహెచ్‌ఓ

ఎన్‌కాస్‌ గుర్తింపు లభించటం సంతోషంగా ఉంది. దీంతో మా బాధ్యత మరింత పెరిగింది. పీహెచ్‌సీల్లో మరిన్ని అదనపు సౌకర్యాలు కల్పిస్తూ మెరుగైన సేవలందించటానికి కృషి చేస్తాం. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలను జాతీయ ప్రమాణాల గుర్తింపు కోసం ప్రమాణాలతో కూడిన సేవలందించే ఏర్పాట్లు చేస్తూ రాష్ట్రంలోనే వైద్య సేవల్లో ఉత్తమ జిల్లాగా ఉండేలా పాటుపడతాం. మా సిబ్బంది జాతీయ నాణ్యతా ప్రమాణాల మేరకు వైద్య సేవలందిస్తూ ఎనలేని కృషి చేయటం వల్లనే ఈ స్థాయి గుర్తింపు లభించింది. మా వైద్య బృందానికి అభినందనలు తెలుపుతున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని