logo

ఔత్సాహికులకు పారిశ్రామికరంగ తోడ్పాటు

ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి తోడ్పాటునందిస్తోందని, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పాలనాధికారి రాహుల్‌రాజ్‌ పేర్కొన్నారు.

Updated : 07 Jun 2023 03:36 IST

స్వయం ఉపాధి యూనిట్లను పరిశీలిస్తున్న పాలనాధికారి రాహుల్‌రాజ్‌

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి తోడ్పాటునందిస్తోందని, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పాలనాధికారి రాహుల్‌రాజ్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక భుక్తాపూర్‌లోని డీబీఎన్‌డీ హాలులో జిల్లా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రగతి ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులు ఆయా యూనిట్లను ప్రదర్శనకు పెట్టారు. వారు ఉపాధి పొందుతున్న తీరును పాలనాధికారి అడిగి తెలుసుకున్నారు. రాయితీతో కలిగిన లాభాలను లబ్ధిదారులు తెలిపారు. తొమ్మిదేళ్ల ప్రగతిని పరిశ్రమల శాఖ జిల్లా మేనేజరు పద్మభూషణ్‌రాజు వివరించారు. టీఎస్‌ఐపాస్‌ కింద జిల్లాలో రూ.97.63 కోట్లతో 1,954 మందికి ఉపాధి చూపించామన్నారు. టిఫ్రైడ్‌ పథకం కింద 460 యూనిట్లకు రూ.30.09 కోట్ల రాయితీతో లబ్ధి చేకూరిందని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనపర్చిన పలువురికి జ్ఞాపికలను, ప్రశంసాపత్రాలను అందజేశారు. అదనపు పాలనాధికారి నటరాజ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌, ఎల్‌డీఎం భాస్కర్‌ ప్రసాద్‌, విజయ డెయిరీ డీడీ మధుసూదన్‌, ఈడీఎం బండి రవి, పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

చెరువుల పండగకు విస్తృత ఏర్పాట్లు

పాలనాప్రాంగణం: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8న నిర్వహించే ఊరూరా చెరువుల పండగకు విస్తృత ఏర్పాట్లు చేయాలని పాలనాధికారి రాహుల్‌రాజ్‌ తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 468 పంచాయతీల పరిధిలో నిర్వహించే వేడుకలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసేందుకు ప్రత్యేకాధికారులను నియమించామని గుర్తుచేశారు. ప్రతి మండలంలో ఒకటి చొప్పున పెద్ద ఎత్తున చెరువుల పండగను జరపాలన్నారు. వెయ్యిమందికి తక్కువ కాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులు, మత్స్యకారులు, ఇతర వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్రచారం చేయాలన్నారు. సాయంత్రం అయిదు గంటలకు వేడుకలు ప్రారంభించి సాయంత్రం ఏడు గంటలకు ముగిసేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. భోజనవసతి, తాగునీరు, లైటింగ్‌, టెంటు, మైక్‌సిస్టం వంటి సౌకర్యాలు పక్కాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  బోనాలు, బతుకమ్మ, కట్టమైసమ్మ పూజలతో సందడి నెలకొనాలని, చెరువు ప్రాంగణాలను రంగవల్లులు, పూలతో ఆకట్టుకునేలా అందంగా ముస్తాబు చేయాలని పేర్కొన్నారు. శిక్షణ సహాయ పాలనాధికారులు శ్రీజ,  వికాస్‌ మహతో, డీఆర్డీవో కిషన్‌, జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్‌, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని