logo

విత్తన కంపెనీపై రైతుల విజయం.. దక్కిన పరిహారం

మా కంపెనీ విత్తనాలు బాగుంటాయి.. వాడితే దిగుబడి రెండింతలుగా ఉంటుందంటూ ఊదరగొట్టే కంపెనీల ప్రచారాన్ని చూసి రైతులు కొని విత్తుకోవడం సహజం.

Updated : 07 Jun 2023 03:30 IST

చెక్కులు అందుకుంటున్న బాధిత రైతులు

కడెం, న్యూస్‌టుడే : మా కంపెనీ విత్తనాలు బాగుంటాయి.. వాడితే దిగుబడి రెండింతలుగా ఉంటుందంటూ ఊదరగొట్టే కంపెనీల ప్రచారాన్ని చూసి రైతులు కొని విత్తుకోవడం సహజం. ఈ క్రమంలో కడెం మండలంలోని లక్ష్మీసాగర్‌, మద్దిపడిగ, పెద్దూర్‌ తండాలకు చెందిన ఆరుగురు రైతులు 2017లో కొనుగోలు చేసి సాగుచేసిన వరి విత్తనాలు నకిలీగా తేలాయి. అప్పుడు ఖరీఫ్‌ పంటగా వారు సుమారు 20ఎకరాల్లో కావేరి 9090రకం విత్తనాలను కొని సాగుచేసుకున్నారు. వరి బాగానే ఎదిగినా గొలక సరిగా వేయక పంట పండలేదు. దీనిపై అప్పట్లోనే ఈ గిరిజన రైతులు దుకాణదారునికి, కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదుచేశారు. అనంతరం ఆదిలాబాద్‌లోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రైతుల వద్ద విత్తనాలు కొన్న రసీదులు, పంట నష్టపోయిన ఆధారాలు ఉండడంతో న్యాయంకోసం రైతు భూక్యా రాజేష్‌ నాయక్‌ సారథ్యంలో పోరాడారు. ఈకేసు ఆదిలాబాదు నుంచి హైదరాబాద్‌లోని వినియోగదారుల కోర్టుకు బదిలీ అయింది. ఆరేళ్లపాటు సాగిన విచారణ అనంతరం చివరగా రైతులే గెలిచారు. ఒక్కో ఎకరానికి రూ.40 వేల పరిహారం అప్పటినుంచి ఇప్పటివరకు ఆ డబ్బులకు వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు రావడంతో.. మంగళవారం హైదరాబాద్‌ కోర్టు ఆవరణలోనే కంపెనీ ప్రతినిధులు బాధితులకు చెక్కులు అందజేశారు. మొత్తం రూ.7,44,037లను చెక్కుల రూపంలో అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని