logo

పునరావాస నిధులు.. పప్పు బెల్లాలు..

‘రాజుల సొమ్ము.. రాళ్లపాలు’ అన్న చందంగా త్వరలో తరలించి మరోచోట పునరావాసం కల్పించే గ్రామానికి నూతన తారురోడ్డు మంజూరు చేసి, పనులు చకాచకా చేస్తున్నారు.

Updated : 07 Jun 2023 03:28 IST

తరలించే గ్రామానికి రూ.లక్షలతో కొత్త రోడ్డు

ధనోరా వద్ద రాంజీగూడ గ్రామస్థులకు పునరావాసం కల్పించడానికి అయిదు సంవత్సరాల క్రితం సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించి ఇలా వదిలేశారు.

ఈనాడు, ఆసిఫాబాద్‌ : ‘రాజుల సొమ్ము.. రాళ్లపాలు’ అన్న చందంగా త్వరలో తరలించి మరోచోట పునరావాసం కల్పించే గ్రామానికి నూతన తారురోడ్డు మంజూరు చేసి, పనులు చకాచకా చేస్తున్నారు. దీంతో రూ.లక్షల నిధులు నీటిపాలు కానున్నాయి. కుమురం భీం జలాశయం ఏర్పడిన పుష్కరకాలం అనంతరం 2018 ఎన్నికల ముందు అధికారులు హడావుడిగా పునరావాస అంశానికి తెరతీశారు. కొన్ని గ్రామాలకు ప్రాజెక్టు మిగులు జలాలతో ముంపు పొంచి ఉందని.. అక్కడి ప్రజలకు వెంటనే పునరావాసం కల్పించాలని ఆగమేఘాల మీద అనుమతులు తెచ్చుకున్నారు. నిధుల మంజూరు చేయించుకొని పనులు ప్రారంభించారు. అయిదేళ్లుగా గడిచినా రూ.4.75 కోట్ల వరకు ఖర్చు అయినా పునరావాస ప్రక్రియ పూర్తికాలేదు. ఆ గ్రామాలనూ తరలించలేదు. తాజాగా ఆ తరలించే గ్రామాలకు నూతనంగా తారురోడ్డు నిర్మించడం నిధుల వృథాకు పరాకాష్ఠగా నిలుస్తోంది.

కుమురం భీం జలాశయం 2006లో పూర్తికాగా, 14గ్రామాలకు పునరావాసం కల్పించారు. కెరమెరి మండలంలోని రాంజీగూడ, దేవుడిపల్లి, రాంపూర్‌, దాబ్‌గూడ గ్రామాలకు పునరావాసం ఇప్పటికీ కలగానే మిగిలింది. రాంజీగూడ గ్రామానికి ధనోరా సమీపంలో ప్రధాన రహదారి పక్కన పునరావాసం కల్పిస్తామని 2018లో 10 ఎకరాల స్థలం కొన్నారు. సిమెంటు రోడ్డు, మురుగు కాలువల పనులు చేశారు. ఇందుకు రూ.1.75 కోట్లు ఖర్చు చేసినా గ్రామాన్ని తరలించలేదు. దేవుడిపల్లి గ్రామానికి సంబంధించి సమీప కొండ దగ్గర స్థలాన్ని చదును చేశారు. వంతెనతో పాటు, నాలుగు కల్వర్టులు, తారురోడ్డు, మురుగు కాలువలు, తాగునీటి ట్యాంకు రెండేళ్ల క్రితమే నిర్మించారు. ఇందుకు రూ.3 కోట్లు ఖర్చు చేసి, ఇక్కడికి గ్రామాలను తరలించడం మా పనికాదన్నట్లుగా అధికారులు చేతులేత్తేశారు. అంటే మొత్తం రూ.4.75 కోట్ల మేర ఇప్పటికే చెల్లించారు. విద్యుత్తు పనులు, పాఠశాల, ప్రభుత్వ వసతిగృహం, పంచాయతీ భవనాలు, తాగునీటి పనులు చేయాల్సి ఉంది. అందుకు మరో రూ.2.75 కోట్లు కేటాయించారు.

ముంపు గ్రామాలను పట్టించుకోలేదు..

వాస్తవంగా కుమురం భీం ప్రాజెక్టు ప్రాజెక్టు మిగులు జలాలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంది రాంపూర్‌ గ్రామం. ఏటా వర్షాకాలంలో వరద ఈ గ్రామానికి అతి సమీపంగా వస్తుంది. పాములు, పురుగులతో గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పునరావాసం కల్పించాలని వీరంతా కోరుతున్నా, అధికారులు పట్టించుకోలేదు. రాంజీగూడలో ఒక వర్గం ఇక్కడే ఉంటామని భీష్మించుకొని ఉండగా, మరోవర్గం పునరావాస కాలనీకి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.మళ్లీ రూ.70 లక్షల కేటాయింపు..

త్వరలో మరోచోటుకు తరలించే రాంజీగూడ గ్రామానికి కొత్తగా బీటీ రహదారి వేయడానికి చదును చేస్తున్న తీరిది

ఆసిఫాబాద్‌- ఉట్నూర్‌ రహదారి నుంచి రాంజీగూడ 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో నూతన తారురోడ్డు నిర్మాణానికి ఐటీడీఏ అధికారులు రూ.70 లక్షలు మంజూరు చేశారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో పూర్తి కానున్నాయి. ఒకవైపు గ్రామాన్ని తరలించే పునరావాస పనులు చేస్తూ, మరోవైపు ఇదే గ్రామానికి తారురోడ్డు వేయడమేమిటనే ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి. మొక్కుబడిగా పనులు చేసి, నిధులను స్వాహాచేసేందుకేనా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని