logo

గనులు.. ప్రగతి పరవళ్లు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 49,666 కోట్లు పన్నులు, డివిడెంట్ల రూపంలో చెల్లించినట్లు సింగరేణి యాజమాన్యం వివరించింది.

Updated : 07 Jun 2023 06:03 IST

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 49.6 వేల కోట్ల చెల్లింపులు

సింగరేణి ప్రచురించిన ప్రత్యేక సంచిక ముఖచిత్రం

న్యూస్‌టుడే, శ్రీరాంపూర్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 49,666 కోట్లు పన్నులు, డివిడెంట్ల రూపంలో చెల్లించినట్లు సింగరేణి యాజమాన్యం వివరించింది. తెలంగాణ రాష్ట్ర దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి సంస్థ ప్రత్యేకంగా ప్రగతి నివేదిక పేరిట ఒక పుస్తకాన్ని ఆవిష్కరించింది. ఈ పుస్తకాన్ని సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పంపిణీ చేపట్టింది. మంచి నాణ్యతతో కూడిన ఈ పుస్తకంలో తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని వివరించారు. సింగరేణిలోని ముఖ్య ఘట్టాలు, సాధించిన విజయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులు, తదితరాలన్నింటిని పొందుపరిచారు. లాభాల్లో 421 శాతం వృద్ధి సాధించినట్లు గణాంకాల ద్వారా పేర్కొన్నారు. అమ్మకాల్లో 176 శాతం, బొగ్గు ఉత్పత్తిలో 133 శాతం, బొగ్గు రవాణాలో 39 శాతం, ఉపరితల గనుల్లో మట్టి (ఓవర్‌ బర్డెన్‌) తొలగింపులో 142 శాతం వృద్ధితో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. బొగ్గు ఆధారిత విద్యుత్తు 1200 మెగావాట్లు, 250 మె.వాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న తొలి ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణి నిలుస్తున్న విషయాన్ని వివరించారు. మహారత్న కంపెనీలకు దీటుగా సింగరేణి నిలుస్తున్న తీరును పొందుపరిచారు. కొత్తగా 8 గనులు, 13 సీహెచ్‌పీలు, 240 మెగావాట్ల సౌర విద్యుత్తుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సంచికలో పేర్కొన్నారు. 16 రాష్ట్రాల్లోని దాదాపు రెండు వేలకుపైగా పరిశ్రమలకు బొగ్గు రవాణా చేస్తున్న తీరును యాజమాన్యం సోదాహరణగా చెప్పింది. కార్మికుల సంక్షేమంపై 150 శాతం వృద్ధితో ఒక్కో ఉద్యోగిపై సగటున రూ. 3.12 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. కారుణ్య నియామకాలు, నేరుగా ఉద్యోగ నియామకాల ద్వారా మొత్తం 18,463 మందికి ఉపాధి కల్పించిన వైనాన్ని వివరించింది. లాభాల బోనస్‌ పెరిగిన తీరు, లాభాల వాటా పంపిణీ, కొత్త క్వార్టర్ల నిర్మాణం, సొంతింటి నిర్మాణానికి తీసుకున్న రుణంపై వడ్డీని తిరిగి చెల్లించే పద్ధతి తదితర సంక్షేమ పథకాలను ఈ సంచికలో పేర్కొంది. ఏటా రూ. 259 కోట్లతో 126 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అనుబంధ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపింది. సామాజిక బాధ్యతగా సమీప గ్రామాలు, పట్టణాల లభివృద్ధి కోసం రూ. 335 కోట్లు వెచ్చించింది.  డీఎంఎఫ్‌టీ (డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌) ద్వారా బొగ్గు అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీ మీద జమ చేసే 30 శాతం సొమ్ము కింద రూ. మూడువేల కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. మందుగుండు సామగ్రి, నదుల్లో ఇసుక తవ్వడానికి బదులుగా ఉపరితల గనుల్లో నుంచి వచ్చే మట్టి నుంచి ఇసుకను తయారు చేసే విధానం, కార్మికుల రక్షణ కోసం చేస్తున్న కృషి, ఐఐటీ, ఐఐఎంలలో చదివే కార్మికుల పిల్లలకు ఫీజును తిరిగి చెల్లించే విధానం తదితర అనేక విషయాలను పొందుపర్చడం ద్వారా యాజమాన్యం సంస్థకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కార్మికవర్గానికి వెల్లడించింది.్ఠ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని