logo

మరోసారి ఆశ.. తీరేనా గోస?

ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పిలుచుకునే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన 33 గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయారు.

Updated : 07 Jun 2023 06:01 IST

సీఎం ప్రకటనతో మళ్లీ తెరపైకి కాళేశ్వరం ప్యాకేజీ పనులు

సారంగాపూర్‌ మండలం అడెల్లి సమీపంలో సాగునీటి కాలువ దుస్థితి

నిర్మల్‌, న్యూస్‌టుడే: ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పిలుచుకునే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన 33 గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయారు. ఇందులో కొన్ని గ్రామాలవారు పొట్ట చేతపట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా.. మరికొన్ని గ్రామాలవారికి జిల్లాలో ప్రభుత్వం పునరావాసం కల్పించింది. ఈ ప్రాంత రైతులకు సాగు, తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో ఈ జలాశయం వెనుకతట్టు భాగంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 27, 28 కింద పంట నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గాల్లో 50వేల ఎకరాల చొప్పున నీరందించేందుకు కాలువ నిర్మాణ పనులు 15ఏళ్ల క్రితం ప్రారంభించినా.. నిధుల కొరతతో ముందుకు కదలడం లేదు. కాగితాల్లో 70శాతం పనులు పూర్తయినట్లు చూపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం 40 శాతం కూడా పూర్తికాలేదు. దిలావర్‌పూర్‌ మండలం గుండంపల్లి సమీపంలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వెనుకతట్టు భాగంలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో కాళేశ్వరం (ప్రాణహిత చేవెళ్ల) ప్రాజెక్టు ప్యాకేజీ 27, 28 కింద పంట కాలువ నిర్మాణ పనులు చేపట్టడానికి అంచనా వ్యయం రూ.1,300 కోట్లు నిర్ధారించారు.

కుంటాల మండలం విఠాపూర్‌ సమీపంలో వంతెన అసంపూర్తిగా ఉండటంతో కాలువలో మట్టి పోసుకుని రాకపోకలు సాగిస్తున్న ప్రజలు

నాణ్యత లేని నిర్మాణాలు..

కాలువ ద్వారా నీరు సరఫరా చేయక ముందు ఇదివరకు చేపట్టిన పనులు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. నాణ్యత లేకుండా నిర్మించడంతో శిథిలావస్థకు చేరాయి. నర్సాపూర్‌(జి), దిలావర్‌పూర్‌, సారంగాపూర్‌, కుంటాల మండలాల్లో నిర్మించిన కాలువ పనులు అడ్డదిడ్డంగా చేయటంతో కూలిపోయాయి. చాలా చోట్ల సిమెంటు లైనింగ్‌ దెబ్బతిన్నది. పలు ప్రాంతాల్లో ప్రధాన కాల్వలో పూడిక మట్టి చేరింది. మధ్యమధ్యలో రాకపోకలు సాగించేందుకు వీలుగా అక్కడక్కడ నిర్మించిన వంతెనలు పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో అంతర్గత రహదారుల్లో ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగుతోంది.

గడువు మీద గడువు..

2008లో ప్రారంభమైన ఈ పనులు నాలుగేళ్లలో పూర్తిచేయాలని గత ప్రభుత్వం గడువు విధించగా తదనంతరం జరిగిన పరిణామాలతో ఈ పనులు అర్ధాంతరంగా నిలిచాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తిరిగి పనులకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం జూన్‌ 2019లోగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు అవకాశం కల్పించింది. గడువు ముగిసి నాలుగేళ్లయినా పనులు గట్టెక్కడం లేదు. చేసిన ప్రతి చోట పనులు కొద్ది రోజులు చేపట్టడం తిరిగి అవి మధ్యలోనే నిలిపి ఇతర ప్రాంతంలో పనులు చేపట్టడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీతోనైనా కాలువలు, చెరువుల మరమ్మతులు పూర్తి చేయించాలని రెండు నియోజకవర్గాల అన్నదాతలు కోరుతున్నారు.

సారంగాపూర్‌ మండలంలోని కర్జీవాగుకు కిలోమీటరు దూరంలో అండర్‌టన్నెల్‌ (యూటీ)ని నిర్మించారు. ఈ కాలువ ఎడమ వైపు నుంచి వాన నీరు కుడి వైపునకు వెళ్లడానికి దీనిని నిర్మించారు. పక్కనే ఉన్న పంటల నుంచి వచ్చే వరదనీరు ఇక్కడ అయిదు అడుగుల ఎత్తు నుంచి వస్తుంటాయి. అంటే ఇక్కడ ఎస్‌పీ (సూపర్‌ పాస్‌) నిర్మించాల్సి ఉంది. కానీ యూటీ ఏర్పాటుతో ఎగువ నుంచి వచ్చిన వరద దిగువకు వెళ్లకుండా అక్కడే నిల్వ ఉంటోంది. దిగువన సుమారు 20 అడుగుల లోతుతో కాలువ తీయాల్సి ఉన్నా.. అలా చేయకపోవడంతో దిగువ ప్రాంతానికి నీరు వెళ్లడం లేదు.

‘ఎస్సారెస్పీ ద్వారా వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 27, 28 సాగునీటి కాలువల పనులు త్వరలో పూర్తి చేస్తామని నేను హామీ ఇస్తున్నా. నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం’.. అని మూడు రోజుల క్రితం నిర్మల్‌ సభలో సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో పనుల పూర్తిపై రైతుల్లో ఆశలు చిగురించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని