logo

గణాలకే కాదు.. గుణాలకూ అధిపతే..!

వినాయకుడి పూజ సందర్భంగా పఠించే శోడష నామాలు ఆయన గుణ సౌందర్యాన్ని    వర్ణిస్తాయి. మనం ఎలా ఉండాలి.. ఎలాంటి గుణ గణాలు ఆయన నుంచి నేర్చుకోవాలో వివరించి చెబుతుంది.

Updated : 18 Sep 2023 06:58 IST

లక్షెట్టిపేట, న్యూస్‌టుడే

వినాయకుడి పూజ సందర్భంగా పఠించే శోడష నామాలు ఆయన గుణ సౌందర్యాన్ని    వర్ణిస్తాయి. మనం ఎలా ఉండాలి.. ఎలాంటి గుణ గణాలు ఆయన నుంచి నేర్చుకోవాలో వివరించి చెబుతుంది. వినాయక చవితి నేపథ్యంలో కేవలం     ఆయనను పూజించడమే కాకుండా గుణ గణాలను గ్రహించి మన జీవితాలకు అన్వయించుకుంటే మనం   ధన్య జీవులమే. గణపతి నవరాత్రుల సందర్భంగా మంచి  అలవాట్లు చేసుకుంటామని నవ సంకల్పాలు చేసుకుందాం.. మనతోపాటు మన చుట్టూ ఉన్న సమాజంలో  మార్పు కోసం శక్తి వంచన లేకుండా  ప్రయత్నిద్దాం.


వృథా కట్టడి చేద్దాం

ఆహారంతో పాటు సహజ వనరులైన నీరు, విద్యుత్తు, ఇంధనాన్ని వృథా చేస్తుంటాం. అది మన భవిష్యత్తు తరాలకు శాపంగా పరిణమించే ప్రమాదం పొంచి ఉంది. అవి అందని ప్రాంతాలు, దేశాల దుర్భర పరిస్థితులను చూసి కూడా మనం వాట¨ వృథాను అరికట్టడంలో అలసత్వం ప్రదర్శిస్తుంటాం. వృథాను నిలువరించేందుకు ఎవరికి వారుగా ప్రయత్నాలు ప్రారంభించాలి.  


మట్టి గణపతే  శ్రేష్ఠం

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయకుడిని ఎంత భక్తి శ్రద్దలతో పూజిస్తామో ఆద్యంతం అంతే బాధ్యతగా మసలుకుందాం. గణనాథుని విగ్రహం రసాయనాలతో తయారైనది కాకుండా కచ్చితంగా మట్టితో చేసిన విగ్రహాన్నే వాడుదామని ప్రతిన బూనుదాం. మంటపాల వద్ద తొమ్మిది రోజుల పాటు రాత్రింబవళ్లు నిర్వాహకులు అందుబాటులో ఉంటూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూద్దాం. హంగు ఆర్భాటాలు కాకుండా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిద్దాం.


ఓటు మన బాధ్యత

ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సక్రమంగా వినియోగించుకోవాలి. రానున్నది ఎన్నికల పండగ. సార్వత్రికం నుంచి స్థానిక సంస్థల వరకు అన్ని రకాల ఎన్నికలు రానున్నాయి. ఓటును ప్రలోభాలకు తావు లేకుండా విజ్ఞతతో ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకుంటే సుపరిపాలనకు అవకాశం ఉంటుంది. బాధ్యత మరిచి ఎవరిని నిందించినా ప్రయోజనం ఉండదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి.


జీవనశైలి మార్పుకు ప్రతినబూనుదాం

దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌ లాంట¨ వ్యాధుల బారిన పడటానికి మన జీవన శైలి, ఆహారపు అలవాట్లు మారడమే కారణం. పాశ్చాత్య పోకడలబారిన పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా సంప్రదాయబద్ధంగా వస్తున్న మన  ఆహారపు అలవాట్లను కొనసాగించగలిగితే చాలా వరకు అనారోగ్యాలబారిన పడకుండా మనలను మనం కాపాడుకోవచ్చు.


సామాజిక మాధ్యమాలపై సంయమనం

సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే సామాజిక మాధ్యమాల వాడకంలో సంయమనంగా ఉండాలి. కొందరు వ్యక్తులు తమ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం చేసే కుయుక్తులకు అమాయకులు బలి అయ్యే అవకాశాలు ఉంటాయి. పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట విద్వేషాలు రగిలించి వాటి ద్వారా తమ స్వప్రయోజనాల కోసం యత్నించే వారి బారిన పడకుండా మనలను మనం కాపాడుకుందాం.


ఆర్గానిక్‌ వైపు అడుగులు..

లక్షెట్టిపేటలో మట్టి వినాయకుడి విగ్రహాలతో విద్యార్థులు

సహజ సిద్ధంగా, ప్రకృతి పరంగా పండే పంటలు, తయారయ్యే వస్తువులు మనకు ఆరోగ్యాన్ని పంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయి. తాత్కాలిక ఆనందం కోసం ప్రకృతికి విరుద్దంగా పంటలు పండించడం, విష రసాయనాల  ఇబ్బడి ముబ్బడి వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలను  గుర్తించి ఆర్గానికి వస్తువులు, పదార్థాల వాడకానికి మొగ్గు   చూపాలి.


పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములవుదాం

వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యమో మన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత. మనం మారకుండా ప్రభుత్వమో, అధికారులనో కారణం చూపడం సరికాదు.


ట్రాఫిక్‌ నిబంధనలు పాటిద్దాం

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడమే. స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాల్సింది పోయి ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు కూడళ్లలో పోలీసులు, రహదారులపై స్పీడ్‌గన్లు ఏర్పాటు, నిబంధనలు ఉల్లంఘించే వారికి ప్రభుత్వం జరిమానాలు విధించే పరిస్థితికి వెళ్లడం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం. యువత తమ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాలి. లైసెన్సు కలిగి ఉన్న వారు వాహనాలు నడపితే ప్రమాదాలు చాలా వరకు నియంత్రించగలం.


గ‘మ్మత్తు’ వదులుదాం

మద్యం, ధూమపానం స్థాయి నుంచి యువత డ్రగ్స్‌ వాడకానికి అలవాటు పడ్డారు. నగరాల్లో కొందరు వ్యక్తులకు పరిమితమైన డ్రగ్స్‌ వాడకం ఇప్పుడు మారుమూల గ్రామాలకు సైతం విస్తరించింది. డ్రగ్స్‌ వాడకం వల్ల ఇల్లు, ఒళ్లు గుల్ల అవడం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గుర్తించాలి. మాదక ద్రవ్యాలు వాడటం, సరఫరా చేస్తూ ఒక్కసారి పట్టుబడితే జీవితం అంధకారం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.


సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః


పూలు: బంతి, చామంతి, మోదుగు, కుసుమ, తురకబంతి, తుమ్మపూలు, కొండబూరుగ, మందార,        నూరువరహాలు, శంఖు, గోగు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని