logo

పట్టపగలే చోరీలు

ఇది వరకు పట్టణంలో రాత్రి వేళల్లో దొంగలు చోరీలకు పాల్పడి సొత్తు దొంగలించేవారు. ఇటీవల తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా.. అదీ పట్టపగలే తమ పని కానిచ్చేస్తున్నారు.

Updated : 18 Sep 2023 06:59 IST

అంతర్రాష్ట్ర ముఠాలకుతోడు స్థానిక దొంగల బెడద
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ నేర విభాగం

ఇది వరకు పట్టణంలో రాత్రి వేళల్లో దొంగలు చోరీలకు పాల్పడి సొత్తు దొంగలించేవారు. ఇటీవల తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా.. అదీ పట్టపగలే తమ పని కానిచ్చేస్తున్నారు.

శుభకార్యాలు, ఇతర అత్యవసర పనుల నిమిత్తం కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లి వచ్చే లోపే గంటల వ్యవధిలో ఇల్లంతా ఊడ్చేస్తున్న సంఘటనలు చోటు చేసుకోవటంతో ఎక్కడకి వెళ్లాలన్నా పట్టణవాసులు జడుసుకుంటున్నారు. ఈ నెల 4న పట్టపగలే రాంనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్లో రెండు ఫ్లాట్లలో చోరీ చేసి దాదాపు 80 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. తాజాగా గురువారం టీచర్స్‌ కాలనీలో విశ్రాంత ఏఎస్‌ఐ ఇంట్లో పగలే తాళం పగులగొట్టి 16 తులాల బంగారు నగలు, రూ.ఒక లక్ష నగదు కాజేశారు. వీటికి తోడు చరవాణులు, ద్విచక్రవాహనాల చోరీలకు సైతం తెరపడటం లేదు. దొంగలు ముందుగా రెక్కీ నిర్వహించి ఎంపిక చేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వెల్లడవుతున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది ఎనిమిదిన్నర నెలల కాలంలోనే ఎక్కువ దొంగతనాలు జరిగాయి.  

తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌ ముఠా..

ఇది వరకు జిల్లాకు ఆనుకొని పొరుగున మహారాష్ట్ర నుంచి దొంగల ముఠా వచ్చి చోరీలకు పాల్పడేవారు. ప్రస్తుతం వీరికి తోడు అంతర్రాష్ట్ర ముఠా కూడా చోరీలకు తెగబడుతోంది. కొందరు స్థానికులు సైతం జల్సాలకు అలవాటు పడి ముఠాగా ఏర్పడి సునాయసంగా డబ్బు సంపాదించటానికి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇందులో మైనర్లు సైతం ఉంటున్నారు. మహారాష్ట్ర ముఠా ఇక్కడ చోరీలకు పాల్పడి రైల్లో మహారాష్ట్రకు పరారవుతోంది. జిల్లాలో చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను అడ్డదారుల్లో మహారాష్ట్రకు తరలించేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా జిల్లా కేంద్రంలోని రాంనగర్‌ అపార్ట్‌మెంట్లో పట్టపగలే చోరీకి పాల్పడింది. ఈ ముఠాను వరంగల్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రకటించారు.  

టీచర్స్‌ కాలనీలో విశ్రాంత ఏఎస్‌ఐ ఇంట్లో ఈ బీరువా నుంచే నగలు, నగదు చోరీ చేశారు..

రిక్షా కాలనీలో..

పట్టణంలోని రిక్షా కాలనీలో తాళం వేసి ఉన్న విశ్రాంత ఉద్యోగి తాండ్ర వేణుగోపాల్‌ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున దొంగలు చోరీకి పాల్పడ్డారు. విలువైన వాచీ, కెమెరాను చోరీ చేశారు. అయితే అక్కడున్న సీసీ కెమెరాల ద్వారా కుటుంబ సభ్యుల చరవాణికి అలారం రావటంతో వారు డయల్‌ 100కు సమాచారం ఇచ్చారు.

వాల్మీకి నగర్‌లో రెండిళ్లలో..

శుక్రవారం తెల్లవారుజామున పట్టణంలోని వాల్మీకినగర్‌లో రెండిళ్లలో దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఒక కానిస్టేబుల్‌, మరో ఉపాధ్యాయుడి ఇంట్లో నుంచి రూ.10 వేలు చోరీ చేశారు.

  • జైనథ్‌ మండలం పిప్పర్‌వాడలో మంగళవారం రాత్రి దుండగులు ఒక దుకాణంలో చోరీకి పాల్పడి సిగరెట్ ప్యాకెట్లు, నగదు ఎత్తుకెళ్లారు.

జీఎస్‌ ఎస్టేట్లో ..

నెల రోజుల కిందట స్థానిక జీఎస్‌ ఎస్టేట్లోని ఒక ఇంట్లో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటిని దుండగులు లూటీ చేశారు. ఇంట్లో భద్రపర్చుకున్న 60 తులాల బంగారు నగలు చోరీ అయినట్లు సమాచారం.

పోలీసుల సూచనలు ఇవీ..

  • ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు సమీపంలోని పోలీసు స్టేషన్‌లో సమాచారం అందించాలి
  • కుటుంబంతో సహా ఊరెళితే ఇళ్లల్లో నగదు, నగలు, విలువైన వస్తువులు ఉంచొద్దు.
  • బ్యాంకు లాకర్లలో దాచుకుంటే భద్రంగా ఉంటాయి
  • ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి

చోరీల తీరు..

గతేడాది జరిగిన చోరీలు : 188
ఈ ఏడాది (ఇప్పటి వరకు) : 201


అన్ని చర్యలు తీసుకుంటున్నాం

ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ

దొంగతనాలను అరికట్టడానికి పట్టణంతో పాటు పలు చోట్ల రాత్రుల్లో గస్తీ, పెట్రోలింగ్‌ ముమ్మరం చేశాం. చోరీలను అరికట్టడానికి జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నాం. ఇటీవల జరిగిన రెండు చోరీల్లో దుండగులను పట్టుకున్నాం. పోలీసుల తరఫున చోరీల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని