logo

ఎవరి ప్రభావమెంత?

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారత రాష్ట్రసమితి(భారాస) రాజకీయం మలుపులు తిరుగుతుండడంతో అధిష్ఠానం ప్రత్యేక దృష్టిసారించింది.

Updated : 18 Sep 2023 06:58 IST

దృష్టిసారించిన భారాస అధిష్ఠానం
25న నిర్మల్‌, వచ్చే నెల మొదటి వారంలో ఆదిలాబాద్‌కు కేటీఆర్‌ రాక
ఈటీవీ-ఆదిలాబాద్‌

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారత రాష్ట్రసమితి(భారాస) రాజకీయం మలుపులు తిరుగుతుండడంతో అధిష్ఠానం ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగానే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఈనెల 25న నిర్మల్‌కు, వచ్చే నెల మొదటివారంలో ఆదిలాబాద్‌కు రానుండటం రాజకీయ ప్రాధాన్యతాంశంగా మారుతోంది. చెన్నూరు, మంచిర్యాల, నిర్మల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతోపాటు కొత్తగా టిక్కెట్టు దక్కించుకున్న ఖానాపూర్‌, బోథ్‌, అభ్యర్థులకు అసమ్మతి నేతలతో సఖ్యత కుదరడం లేదు. ఆదిలాబాద్‌, నిర్మల్‌ నియోజకవర్గాల శ్రేణుల్లో మునుపటి ఉత్సాహం ఎందుకు లేదని స్వయంగా కేటీఆర్‌ ఆరా తీయడం పార్టీలోని లుకులుకలను వెల్లడిస్తోంది. కాగా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని జిల్లాలోని ఒకరిద్దరు కీలకమైన ఎమ్మెల్యేలు కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆరోపణలు- ప్రత్యారోపణలతో హైదరాబాద్‌ వరకు వచ్చే ఫిర్యాదులకన్నా క్షేత్రస్థాయిలో అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలనే ఆలోచనతోనే కేటీఆర్‌ నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పర్యటన ఖరారు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ‘‘నిజాయతీగా పార్టీ కోసం పనిచేస్తారనుకునే వారిని వదులుకోకూడదు. వద్దనుకునే వారిని పట్టుకొని వేలాడకూడదనే’’ ఆలోచనకు అధిష్ఠానం వచ్చింది. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సీనియర్‌ నేతల అనుభవాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  కాంగ్రెస్‌, భాజపాలో జరిగే పరిణామాలపై దృష్టిసారించాలని పార్టీ భారాస నిర్ణయించడం రాజకీయ ప్రాధాన్యం రేకెత్తిస్తోంది.

  • చెన్నూరు నియోజకవర్గంలో కీలక నేతల్లో ఒకరైన నల్లాల ఓదెలు కాంగ్రెస్‌లో చేరడం భారాస వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. భారాసతో ఓదెలుకు పెద్దగా విబేధాలు లేనప్పటికీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో సఖ్యత లేదనేది పార్టీలో చర్చకు వస్తోంది. ఈవిషయమై ఇప్పటికే అనేకసార్లు అధిష్ఠానం దృష్టికి వచ్చినప్పటికీ ఏదో అప్పటికప్పుడు సర్దిచెప్పడంతోనే ఆగిపోయింది. ఫలితంగా ఓదెలు పార్టీ వీడే దాకా వచ్చింది. తాజాగా ఓదెలు పరిణామం ఏ మేరకు ప్రభావం చూపుతుందనే దానిపై భారాస అప్రమత్తమైంది.
  • మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి అలక దివాకర్‌రావుకు పరీక్షగా మారుతోంది. దివాకర్‌రావుకు కాకుండా తనకైనా లేదా బీసీ సామాజిక వర్గంలో ఒకరికి టిక్కెట్టు ఇవ్వాలని అరవింద్‌రెడ్డి బాహాటంగానే ప్రకటిస్తుండటంతో తెరాసలో అసమ్మతివాదులకు బలం చేకూరుతోంది. మరోపక్క పైకి కలిసినట్లే కనిపిస్తున్న పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల దృష్టికి వెళ్లింది.
  • బోథ్‌, ఖానాపూర్‌లో టిక్కెట్టు దక్కించుకున్న ఇద్దరు కొత్త అభ్యర్థులే. ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ భర్త శ్యామ్‌నాయక్‌ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. ఆయన బాటలోనే రేఖానాయక్‌ పార్టీ మారడం ఖాయమన్నట్లుగానే ఉంది. పార్టీలోనే ఉంటారనుకుంటున్న ఆదిలాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్‌, ఇంద్రవెల్లి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ శ్రీరాంనాయక్‌లోనూ తగిన గుర్తింపు లభించడం లేదనే ఆవేదన కనిపిస్తోంది. బోథ్‌ టిక్కెట్టు దక్కించుకున్న అనిల్‌జాదవ్‌, సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు, మాజీ ఎంపీ నగేష్‌తోపాటు నినయోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించే ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులను ఖాతరు చేయడం లేదనే విషయం పార్టీకి సమాచారం అందింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని