logo

ఆనకట్ట నిర్మాణంపై అనిశ్చితి

కుమురం భీం జిల్లావాసుల ఆశల ఆనకట్ట వార్దా బ్యారేజీపై అనిశ్చితి వీడటం లేదు. ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది ప్రాజెక్టు పరిస్థితి.

Updated : 18 Sep 2023 07:01 IST

డీపీఆర్‌ దశ దాటని వార్దా బ్యారేజీ
కౌటాల, న్యూస్‌టుడే

వార్దా నదిపై ఆనకట్ట నిర్మాణం చేపట్టే ప్రదేశం ఇదే..

కుమురం భీం జిల్లావాసుల ఆశల ఆనకట్ట వార్దా బ్యారేజీపై అనిశ్చితి వీడటం లేదు. ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది ప్రాజెక్టు పరిస్థితి. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు బదులుగా వీర్దండి వద్ద వార్దా నదిపై ఆనకట్ట నిర్మిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. మొదట హడావుడిగా పూర్తి చేసిన డీపీఆర్‌(సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను నీటిపారుదల శాఖ అధికారులు మార్పుచేర్పులు చేసి ఆరునెలల క్రితం కేంద్ర జలవనరుల సంఘానికి నివేదించారు. అప్పటి నుంచి ఎలాంటి కదలిక లేదు. గత జూన్‌లో జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్‌ బహిరంగ సభలో ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. వార్దా నదిపై బ్యారేజీ నిర్మాణం చేపట్టి జిల్లాలోని 88వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించడంతో దీంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రతిసారి ఎన్నికల వేళ ప్రచారాస్త్రంగా మారుతున్న ప్రాజెక్టుపై ‘న్యూస్‌టుడే’ కథనం..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రైతాంగానికి సాగునీరందించాలనే ఉద్దేశంతో 2007లో అప్పటి ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద రూ.38 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అనంతరం పునరాకృతి(రీడిజైనింగ్‌) పేరుతో ఈ ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ఈ నేపధ్యంలో ప్రాణహితకు బదులుగా వార్దా నదిపై బ్యారేజీ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. గతంలో ప్రాణహిత ప్రాజెక్టు కోసం తవ్విన కాలువలను ఈ బ్యారేజీకి అనుసంధానం చేసి పంపుహౌస్‌ల ద్వారా రైతాంగానికి సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. కానీ మూడేళ్లుగా వార్దా ప్రాజెక్టు అంశం కొలిక్కి రావడం లేదు.

ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన చిత్రపటం

ఆరునెలల క్రితం సీడబ్ల్యూసీకి నివేదిక

జిల్లాలో అనేక జలవనరులున్నా.. పంటలకు సాగునీరందని పరిస్థితి. ప్రాణహిత ప్రాజెక్టు తరలించడంతోనే ఈ పరిస్థితి నెలకొందని విమర్శలు రావడంతో వార్దాపై ఆనకట్ట నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. నాలుగేళ్ల క్రితమే డీపీఆర్‌ బాధ్యతలు వ్యాప్కోస్‌ సంస్థకు అప్పగించింది. భూసేకరణ తగ్గించేలా.. తక్కువ నది వెడల్పు, తక్కువ ఎత్తులో ప్రాజెక్టు నిర్మించేలా సదరు సంస్థ నివేదిక రూపొందించింది. ఈ లెక్కల ప్రకారం వార్దాపై రూ.750 కోట్ల అంచనా వ్యయంతో 36 గేట్లతో బ్యారేజీ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉంటుందని అంచనా వేశారు. కానీ ఆ ప్రతిపాదనకు ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో గతేడాది మరోసారి నివేదికలు రూపొందించాలని సీఎంఓ నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మొదట రూ.750 కోట్లతో అంచనా వేసిన ప్రాజెక్టు వ్యయం తదనంతరం రూ.వెయ్యి కోట్లకు చేరింది. డీపీఆర్‌ సిద్ధం చేసి ఆరునెలల క్రితమే కేంద్ర జలవనరుల సంఘానికి అందజేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు.

ఎన్నికల వేళ తలో మాట..

కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద 2008లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘ప్రాణహిత- చేవేళ్ల’ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. తదనంతరం పునరాకృతి పేరుతో ప్రాజెక్టు కాళేశ్వరానికి తరలించిన తర్వాత ఇప్పటి వరకు సిర్పూరు నియోజకవర్గంలో మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రతీసారి ఆయా పార్టీలు ఈ ప్రాంతంలోని రైతుల ఓట్లతో లబ్ధి పొందేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై తలోమాట మాట్లాడుతున్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ఈ బ్యారేజీ సంగతే మరిచిపోతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్షాలకు సిర్పూరు నియోజకవర్గంలో వార్దా బ్యారేజీయే ప్రధాన అంశంగా మారింది. వీర్దండి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపడతామని అధికార పార్టీ చెబుతుండగా.. తాము అధికారంలోకి వస్తే పుష్కల జలవనరులు ఉన్న తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, భాజపా, బీఎస్పీ హామీ ఇస్తున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు