logo

ధరణిలో పేరుంటేనే పంట రుణం

ఇది వరకు పట్టాదారుల పాసుపుస్తకాలు, పహాణీ పత్రాలతో రుణం ఇచ్చే వెసులుబాటు ఉండేది. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త విధానం అమల్లోకి వచ్చింది.

Updated : 22 Sep 2023 06:11 IST

రెవెన్యూ సమస్యలు ప్రభుత్వానికి తెలిసినవే..
‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ ఏబీ ప్రసాద్‌  

ఈటీవీ - ఆదిలాబాద్‌ : ఇది వరకు పట్టాదారుల పాసుపుస్తకాలు, పహాణీ పత్రాలతో రుణం ఇచ్చే వెసులుబాటు ఉండేది. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ధరణి పోర్టల్‌లో రైతు పేరు ఉంటే తప్పితే కొత్తగా పంట రుణం ఇచ్చే పరిస్థితి లేదు. రుణమాఫీ అనేది ప్రభుత్వ నిర్ణయం. ప్రైవేటు బ్యాంకర్ల పాత్ర, పంట రుణాల లక్ష్యాలు, ప్రగతి అనే అంశాలపై జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ ఏబీ ప్రసాద్‌తో ‘ఈనాడు-ఈటీవీ’ ప్రత్యేక ముఖాముఖి.

ఈ : రైతులు ఉద్దేశపూర్వకంగా పంట రుణాలు చెల్లించడం లేదంటారా? భౌగోళిక పరిస్థితుల సమస్య లేమీ లేవంటారా?

ఎల్‌డీఎం : రైతుల తప్పిదమని కాదు. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాది ప్రత్యేక భౌగోళిక స్థితి. పూర్తిగా వర్షాధార పంటలే. రెండో పంటకు పూర్తిస్థాయి వెసులుబాటు లేదు. సాగు నీటి కల్పనలో ప్రభుత్వం కృషి చేస్తుంది. క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులను అధిగమించాల్సి ఉంది. మిగిలిన జిల్లాల్లో రెండు పంటలు పండించే రైతులు క్రమం తప్పకుండా పంట రుణాలు తీసుకుంటారు. తిరిగి చెల్లించడం ద్వారా ఏ ఇబ్బందులు కనిపించవు.

ఈ : కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. లేనిపోని నిబంధనలు చెబుతూ రైతులను ఇబ్బందులకు గురిచేయడం లేదంటారా? ప్రైవేటు బ్యాంకర్లయితే రుణాలే ఇవ్వడం లేదు.

ఎల్‌డీఎం : రాష్ట్రంలో 2013-14 వరకు పట్టాదారు పాసుపుస్తకాలపై రుణాలు ఇచ్చే వెసులుబాటు ఉండేది. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చాక విధానం మారింది. పోర్టల్‌లో రైతుల వివరాలు లేకపోతే కొత్త రుణం ఇవ్వడం కుదరదు. ఉమ్మడి జిల్లాలో అటవీభూములు ఉండటం, ఇతర సమస్యల కారణంగా ధరణి పోర్టల్‌లో పేర్లు నమోదు కావడం లేదు. ప్రైవేటు బ్యాంకర్లపై విధివిధానాలకు లోబడి రిజర్వ్‌ బ్యాంకు దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది.

ఈ : రెవెన్యూ సంబంధ సమస్యలున్నట్లు గుర్తించిన మీరు జిల్లా, రాష్ట్ర బ్యాంకర్ల సమావేశాల్లో చర్చించి పంట రుణాల కోసం సానుకూలమైన నిర్ణయం తీసుకోకపోవడం తప్పిదమే కదా?

ఎల్‌డీఎం : ఈ విషయంలో జిల్లా, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశాల్లో చర్చ జరిగింది. ప్రభుత్వ దృష్టికి సైతం వెళ్లింది. వాస్తవంగా రైతు పేరిట భూమి ఉండి పంట సాగు చేస్తున్నట్లుగా, ధరణిలో వివరాలు అందుబాటులో ఉంటేనే కొత్త రుణాలు ఇవ్వాలనేది బ్యాంకుల విధివిధానం. అది కూడా ప్రజల కోసమే తప్పితే రుణాలు ఇవ్వకూడదనేది కాదు.

ఈ : ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వర్తించే ఖాతాదారులకు సైతం రుణాలు ఎందుకు ఇవ్వడం లేదు మరి?

ఎల్‌డీఎం : తీసుకున్న రుణం చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. రుణమాఫీ వర్తించి తీసుకున్న రుణం చెల్లించకుండా బకాయి పడితేనే సమస్య. చాలా మంది రుణమాఫీ వస్తుందని తీసుకున్న రుణాలు చెల్లించలేదు.

ఈనాడు : ఆదిలాబాద్‌ జిల్లాలో పంట రుణాల పంపిణీలో బ్యాంకర్లు నిర్దేశించుకుంటున్న లక్ష్యాలు చేరుకోవడం లేదు. ఫలితంగా రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. ఎందుకీ పరిస్థితి?

ఎల్‌డీఎం : లక్ష్యాలు, ప్రగతి అనేవి రుణాల తీసుకోవడం, చెల్లించడంపై ఆధారపడి ఉంటుంది. ఆదిలాబాద్‌ జిల్లాలో చాలామంది తీసుకుంటున్న రుణాలు సకాలంలో చెల్లించడం లేదు. రెన్యూవల్‌ సైతం చేసుకోవడం లేదు. మొండి బకాయిదారులకు బ్యాంకర్లు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇక లక్ష్యాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలబాద్‌ జిల్లాలో అనుకున్న లక్ష్యం చేరుకోకపోవవచ్చు. కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలాంటి చోట అనుకున్న లక్ష్యాల కంటే అధికంగా రుణాలు ఇవ్వొచ్చు. అప్పుడు బ్యాంకర్లు లక్ష్యాలను అధిగమించినట్లే అవుతుంది. ఆ విషయంలో రైతులే ముందుకు రావాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు