logo

అడ్డదారిలో పట్టుబడ్డారు..

బదిలీల్లో ప్రాధాన్యం కోసం అడ్డదారి తొక్కిన ఉపాధ్యాయుల పేర్లను అధికారులు తొలగించారు. వచ్చిన ఫిర్యాదులు, పత్రికలో వచ్చిన కథనాలు, అధికారుల ఆదేశాలతో వారు స్పందించారు.

Published : 22 Sep 2023 05:42 IST

ఉపాధ్యాయ ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలో 17 మందికి చుక్కెదురు

శిబిరంలో పునః పరిశీలన చేస్తున్న వైద్యులు

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: బదిలీల్లో ప్రాధాన్యం కోసం అడ్డదారి తొక్కిన ఉపాధ్యాయుల పేర్లను అధికారులు తొలగించారు. వచ్చిన ఫిర్యాదులు, పత్రికలో వచ్చిన కథనాలు, అధికారుల ఆదేశాలతో వారు స్పందించారు. ఫలితంగా అర్హులైన ఇతర ఉద్యోగులు నష్టపోకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడింది.

మొదట ఆరుగురు.. ఆ తర్వాత 11..

ఉపాధ్యాయ బదిలీల్లో ప్రాధాన్యత కోసం కొంతమంది ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలో దరఖాస్తులు సమర్పించారు. ఇందులో కొన్ని అభ్యంతరాలు వెలువడ్డాయి. అర్హత లేకపోయినా కొందరు అదనపు ప్రయోజనం కోసం తప్పుడుమార్గాలను ఎంచుకుంటున్నారనే ఫిర్యాదులొచ్చాయి. దీంతో విద్యాశాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. అనర్హులు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా తమ దరఖాస్తులు ఉపసంహరించుకోవాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తొలుత ఆరుగురు తమ దరఖాస్తులను ఉపసంహరించుకున్నారు. ఇక అంతా సక్రమమే అనుకున్నారు. అయినప్పటికీ జాబితాలో ఉన్న ఉద్యోగుల్లో కొందరిపై ఉపాధ్యాయవర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షుణ్నంగా తనిఖీ చేస్తే తప్ప అసలు విషయాలు బయటపడవంటూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయమై ‘ఈనాడు’లో ‘దరఖాస్తులు సక్రమమేనా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా వైద్యసిబ్బందితో పునః పరిశీలన ఏర్పాటుచేశారు. ఒకేరోజు అవకాశం కల్పించినా, కొందరు గైర్హాజరవడం, మరికొందరు చికిత్సలో ఉండటంతో అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో గురువారం సైతం పరిశీలనకు హాజరయ్యేందుకు అవకాశమిచ్చారు. అయితే.. దరఖాస్తులు సమర్పించిన వారిలో ఇద్దరు గైర్హాజరు కాగా, మరో 9 మంది దరఖాస్తులను వైద్యులు తిరస్కరించారు. మొత్తంగా రెండు విడతల్లో 17 మందిని ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ నుంచి తొలగించినట్లయ్యింది.

చర్యలుంటాయా..?

తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించొద్దని మొదట్లోనే హెచ్చరించినా వాటిని బేఖాతరు చేస్తూ కొందరు నిర్భయంగా తమ దరఖాస్తులు సమర్పించారు. దీర్ఘకాల, తీవ్రమైన వ్యాధులకు గతంలో చికిత్స పొందినప్పటికీ, వ్యాధితీవ్రత తగ్గిందనో, నయమైందన్న కారణాలతోనో కొందరిని తిరస్కరించారు. మరో ఇద్దరు గైర్హాజరయ్యారు. ఇందులో ఒకరు ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ ఉపయోగించేందుకు ఆసక్తి లేదంటూ విద్యాశాఖ అధికారులకు రాతపూర్వకంగా తెలిపారు. సదరు ఉద్యోగి స్పౌజ్‌ పాయింట్లను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలను పక్కనపెడితే.. అధికారులను తప్పుదోవ పట్టించేందుకు తెలిసీ ప్రయత్నించిన ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలుంటాయా లేదా అనేది ఉపాధ్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు ఆస్కారముండదని, ఉద్యోగుల్లో భయం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.


వివరణ కోరుతాం
డా.ఎ.రవీందర్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి

హెచ్చరికలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినవారు, గైర్హాజరైన వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తాం. వారి నుంచి వివరణ కోరుతాం. ప్రిఫిరెన్షియల్‌ కేటగిరీ పాయింట్లను తొలగించేలా ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తాం. పదోన్నతులు, బదిలీల్లో భాగంగా ఉద్యోగులంతా పారదర్శకంగా వ్యవహరించాలి. స్పౌజ్‌ పాయింట్ల విషయంలోనూ కొందరు తప్పుడు వివరాలు (2018 బదిలీల సమయంలో వాడుకొని, మళ్లీ ఇప్పుడు ఉపయోగించే ప్రయత్నం చేస్తుండటం) సమర్పిస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటివారు దరఖాస్తులను ముందుగానే తొలగించుకోవాలి. విచారణలో తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తప్పవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు